-

30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది 

27 Nov, 2023 03:49 IST|Sakshi

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 

ముషీరాబాద్, మక్తల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థుల తరపున ప్రచారం 

సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్‌)/నారాయణపేట: గత పదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక్కడ ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముషీరాబాద్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్‌కుమార్‌యాదవ్‌కు ఆశీస్సులు అందించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం బాగ్‌లింగంపల్లి చౌరస్తాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ నవంబర్‌ 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుందని, తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అన్ని కుల, మతాల ప్రజల సంక్షేమం కోసం పని చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్సే అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ ప్రమేయం లేదని, పార్లమెంటులో ఆయనకు ఎంపీలు లేకపోయినా సోనియా గాంధీ ధైర్యం చేసి రాష్ట్రాన్ని ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర సంపదను కేసీఆర్‌ కుటుంబం లూటీ చేసిందని ధ్వజమెత్తారు.  కేసీఆర్, మోదీలకు ఓడిపోతామనే భయం ప్రారంభమైందని, బీజేపీకి మూడు సీట్లు మించి రావని అన్నారు.  

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మూడే రోజులు 
‘బీఆర్‌ఎస్‌ నాయకులు రాష్ట్ర అభివృద్ధిని మరచి పక్కనున్న కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని  సిద్ధరామయ్య అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరి తరపున ఏర్పాటు చేసి రోడ్‌షోలో సిద్ధరామయ్య మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇంకా మూడురోజులే గడువు ఉందన్నారు. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారని, కానీ అది మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని విమర్శించారు.  

మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం 
సాక్షి, హైదరాబాద్‌:  కర్ణాటక ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఐదు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఈ విషయంలో ఎవరికైనా అనుమానాలుంటే తమ రాష్ట్రానికి వస్తే చూపిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఐదు గ్యారంటీల ను కాంగ్రెస్‌ పార్టీ కర్ణాటకలో అమలు చేయడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.

ఈ పథకాల అమలు కోసం తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రూ.38 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆదివారం తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణా హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ రాష్ట్ర మంత్రులు బోసురాజు, లక్ష్మీ హెబ్బాల్కర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరులతో కలసి మాట్లాడారు.

ఐదు గ్యారంటీల్లో నాలుగు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని, ఎన్నికల సందర్భంగా కర్ణాటక ప్రజలకిచ్చిన 165 హామీల్లో ఇప్పటివరకు 158 నెరవేర్చామని సిద్ధరామయ్య వెల్లడించారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం గత పదేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా నెరవేర్చలేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కారణంగా కర్ణాటక ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిందని ప్రధాని మోదీ చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని సిద్ధరామయ్య అన్నారు. 

మరిన్ని వార్తలు