కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్‌ విజయలక్ష్మి షాకింగ్‌ కామెంట్స్‌

6 Mar, 2023 17:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి.. తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు.

సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్‌ మేయర్‌గా పనిచేయడం అంత సులువు కాదని విజయలక్ష్మి అన్నారు.

కాగా, తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కూడా స్పందించారు.. ట్విట్టర్‌ వేదికగా కేటీఆర్‌ సార్‌.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ  కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు.
చదవండి: ఉప్పు‌‌-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! 

ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ మేయర్‌ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్‌ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్‌ చేశారు. కుక్కలన్నీ మేయర్‌ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్‌ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్‌ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. 
 

మరిన్ని వార్తలు