‘గ్రేటర్‌’ వార్‌ 1న

18 Nov, 2020 03:19 IST|Sakshi

మోగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల భేరి.. మేయర్‌ స్థానం మహిళకు

డిసెంబర్‌ 1న పోలింగ్‌.. 4న కౌంటింగ్‌

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ.. 20న ముగింపు

పోలింగ్‌ సమయం గంట పొడిగింపు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ

సాక్షి,హైదరాబాద్‌ : ‘గ్రేటర్‌’ పొలిటికల్‌ వార్‌కు తెరలేచింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. డిసెంబర్‌ 1న పోలింగ్‌ జరగనుంది. 4న ఫలి తాలు ప్రకటించనున్నారు. దుబ్బాకతో రాజు కున్న రాజకీయ వేడి రాష్ట్రంలో రానున్న పక్షం రోజుల్లో పతాకస్థాయికి చేరనుంది. సమయం తక్కువున్నా... రాజకీయపక్షాలు ప్రతిష్టాత్మక సమరానికి సిద్ధమవుతున్నాయి. నగరంలోని 150 డివిజన్లకు సంబంధించిన రిటర్నింగ్‌ ఆఫీ సర్లు బుధవారం ఉదయం ఎక్కడికక్కడ ఎన్నికల నోటిఫికేషన్లు జారీచేస్తారు.

బుధవారమే ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథి మంగళవారం ఇక్కడ జీహెచ్‌ఎంసీఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. 21న నామినేషన్లను పరిశీలిస్తారు. 22న మధ్యాహ్నం 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. డిసెంబర్‌ 1న (మంగళవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ప్రస్తుత కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో ఓటర్లు ఇబ్బంది పడకుండా పోలింగ్‌ను ఒక గంట అదనంగా సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌ నిర్ణయించింది. ఈ నెల 21న పోలింగ్‌స్టేషన్ల తుది జాబితాను ప్రచురిస్తారు. నవంబర్‌ 29న సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల ప్రచారపర్వం ముగియనుంది. 

అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌
ఎన్నికల కమిషన్‌ జీహెచ్‌ఎంసీ షెడ్యూల్‌ను ప్రకటించిన వెంటనే నగర పరిధిలో మంగళవారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. పేపర్‌ బ్యాలెట్‌ ద్వారానే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుపురంగు బ్యాలెట్‌పేపర్లను ఉపయోగిస్తారు. జీహెచ్‌ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీలు, ప్రభుత్వ సమ్మతితో ఎన్నికల నిర్వహణ చేపట్టామని పార్థసారధి స్పష్టం చేశారు. మేయర్‌ పదవిని మహిళ (జనరల్‌)కు రిజర్వు చేశారు.

ఈసారి ఈ–ఓటింగ్‌ లేదు: పార్థసారధి
‘రాష్ట్రంలోని మూడోవంతు జనాభా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నందున జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారమే గ్రేటర్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ ప్రకారం బ్యాలెట్‌ పద్దతిలో ఎన్నికల నిర్వహిస్తున్నాం. ఈ విషయంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ఈవీఎంలను సంసిద్ధం చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.

ఎన్నికల నిబంధనలు, కోడ్‌ను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. అభ్యర్థులు తమ నామినేషన్‌లతో ఏయే పత్రాలు జతచేయాలో టీఈ–పోల్‌ యాప్‌లో చూసి... వాటిని నిర్ణీత ఫార్మాట్‌లో నింపి ప్రింట్‌ అవుట్‌ తీసుకోవచ్చు. అయితే నామినేషన్లను మాత్రం స్వయంగా సంబంధిత వార్డుల్లోని రిటర్నింగ్‌ ఆఫీసర్లకు అభ్యర్థులు సమర్పించాల్సి ఉంటుంది. కోవిడ్‌ నిబంధనల్లో భాగంగా అభ్యర్థులతో పాటు ముగ్గురు నామినేషన్‌ దాఖలుచేసేందుకు రావొచ్చు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు పరిమితి రూ.5 లక్షలు. ఫలితాలు వెలువడిన 45 రోజుల్లో ఎన్నికల వ్యయానికి సంబంధించిన వివరాలు అభ్యర్థి అందజేయాలి. వివరాలు ఇవ్వకపోతే మూడు సంవత్సరాలు అన్ని రకాల ఎన్నికలకు అనర్హులుగా ప్రకటిస్తాం.

మొత్తం 48 వేల మంది పోలింగ్‌ సిబ్బంది అవసరం అవుతారు. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌లో నలుగురేసి చొప్పున నియమించడంతో పాటు... కొవిడ్‌ నేపథ్యంలో రిజర్వ్‌ కింద 30 శాతం సిబ్బందిని సిద్ధం చేస్తున్నాం. తాము నివసిస్తున్న వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి డ్యూటీ వేయం. లైసెన్సు కలిగిన తుపాకులను సమీప పోలీసు స్టేషన్లో డిపాజిట్‌ చేయాలి. పోలింగ్‌కు 48 గంటల ముందు మద్యం దుకాణాలు మూసివేయాలి. ప్రతీ ఓటరుకు కచ్చితంగా పోలింగ్‌ స్లిప్‌ అందజేస్తాం. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి ఓటరు స్లిప్‌ తీసుకోవచ్చు. రాజకీయ పార్టీలు కూడా సింబల్‌ లేకుండా ఓటర్‌ స్లిప్స్‌ ఇవ్వొచ్చు.

2009లో పోలింగ్‌ 42.04శాతం మాత్రమే. 2016లో 45.29 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ పెంచేందుకు రెసిడెంట్స్‌ వేల్ఫేర్‌ ఆసోసియేషన్స్, ఎన్జీవో సంస్థలు, సెలబ్రిటీలు, ఎలక్షన్‌వాచ్‌ సంస్థల సహకారంతో క్యాంపెయిన్‌ నిర్వహిస్తాం. వయోవృద్దులు, అనారోగ్యంతో ఉన్న వారు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బంది కోసం ఈ– ఓటింగ్‌ను ప్రయోగాత్మకంగా అమలుచేయాలని ఎస్‌ఈసీ భావించింది. అయితే సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి మరోనెల సమయం పట్టేట్లుంది. పైగా దీని నిర్వహణకు చట్టసవరణ కూడా చేయాల్సి ఉండడంతో ఈసారి దీనిని ప్రవేశపెట్టలేకపోతున్నాం.

ఫేస్‌రికగ్నేషన్‌ టెక్నాలజీని మాత్రం ఈ ఎన్నికల్లో విస్తృతంగా ఉపయోగిస్తాం. మొత్తం 150 వార్డుల్లోని ఒక్కో పోలింగ్‌స్టేషన్‌లో ఈ విధానాన్ని అమలుచేస్తాం. ఎన్నికల సందర్భంగా రూ.50 వేల వరకు నగదును వెంట తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతకుమించి నగదు ఉంటే... ఏ అవసరం నిమిత్తం దానిని తీసుకెళుతున్నారో ఆధారాలతో వివరించగలిగితే మినహాయింపులు ఉంటాయి. నామినేషన్‌ చివరి రోజు వరకు ఫారమ్‌– ఏ, ఫారమ్‌– బిలను సమర్పించవచ్చు’అని ఎన్నికల కమిషనర్‌ పార్థసారథి వెల్లడించారు.

రూ. 10 వేల సాయం కొనసాగించొచ్చు
భారీ వర్షాలు, వరదల కారణంగా హైదరాబాద్‌లోని నష్టం జరిగినందున రూ.10 వేల విపత్తు సహాయాన్ని డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అకౌంట్‌ ట్రాన్సఫర్‌ చేస్తే కమిషన్‌కు అభ్యంతరాలుండవని ఎన్నికల కమిషనర్‌ స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్‌ విపత్తు సహాయానికి అడ్డుకాదని, అయితే నేరుగా నగదును చేతికి అందించడానికి వీల్లేదని వివరించారు.

ఇదీ ఎన్నికల షెడ్యూల్‌...
– బుధవారం ఉదయం జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో సంబంధిత రిటర్నింగ్‌ ఆఫీసర్లు (ఆర్‌వో) ఎన్నికల నోటీస్‌లు జారీచేస్తారు. 
– తమ కార్యాలయాల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ఆర్‌వోలు ప్రదర్శిస్తారు
– బుధవారం (18వ తేదీ) నుంచి నామినేషన్ల స్వీకరణ
– శుక్రవారం (20వ తేదీ) మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల దాఖలుకు గడువు
– 21న నామినేషన్ల పరిశీలన
– 22న 3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణ
– తర్వాత పోటీచేసే అభ్యర్థుల జాబితా ప్రచురణ
– డిసెంబర్‌1న పోలింగ్‌ (ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)
– 3న అవసరమైన పక్షంలో రీపోలింగ్‌
– 4న (శుక్రవారం) ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు. ఫలితాల ప్రకటన

రిజర్వేషన్లు ఇలా...
మేయర్‌ పదవి – జనరల్‌ మహిళ
– ఎస్టీలు: రెండుస్థానాలు (ఒకటి మహిళ)
– ఎస్సీలు: 10 స్థానాలు (5 మహిళలకు)
– బీసీలు 50: (మహిళలకు 25) 
– జనరల్‌ మహిళ: 44 స్థానాలు
– అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరి: 44 స్థానాలు.
– మొత్తం డివిజన్లు : 150

మొత్తం ఓటర్లు : 74,04,286
పురుషులు : 38,56,770
మహిళలు : 35,46,847
ఇతరులు : 669
పోలింగ్‌ స్టేషన్లు : 9,235

50 వేల మంది పోలీసులు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌ కోసం సుమారు 50 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మొత్తం మీద సిటీ కమిషనరేట్‌ పరిధిలో 25 వేలు, సైబరాబాద్‌ పరిధిలో 15 వేలు, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సుమారు 10 వేల మంది పోలీసులను బందోబస్తుకు వినియోగించనున్నారు. 
రూట్‌ మొబైల్‌పార్టీలు    : 356
స్ట్రైకింగ్‌ ఫోర్స్‌    : 131
స్పెషల్‌ స్ట్రైకింగ్‌ ఫోర్స్‌  : 44 

సగం మహిళలకే
జీహెచ్‌ఎంసీలో సగం సీట్లు మహిళలకు రిజర్వ్‌ అయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఆమోదించిన చట్టం ప్రకారం మొత్తం 150 డివిజన్లలో సగం సీట్లు... 75 మహిళలకు కేటాయించారు. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో (2016) జనరల్‌ స్థానాల్లో సైతం గెలిచి మొత్తం 79 మంది మహిళలు ప్రాతినిధ్యం వహించారు. 

పీఠంపై నాలుగో మహిళ
జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవి మహిళకు రిజర్వు అయింది. జనరల్‌ మహిళ కాబట్టి కార్పొరేటర్లుగా గెలిచిన మహిళల్లో ఎవరికైనా మేయర్‌ అయ్యే చాన్స్‌ ఉంటుంది. గతంలో సైతం మహిళలు హైదరాబాద్‌ కార్పొరేషన్‌లో అధ్యక్షపీఠం అధిరోహించారు. రాణి కుముదిని దేవి, సరోజిని పుల్లారెడ్డి, బండ కార్తీకరెడ్డిలు మేయర్‌లుగా పనిచేశారు. 

ముందస్తు తొలిసారి
జీహెచ్‌ఎంసీకి ముందస్తు ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. గతంలో పాలకమండలి గడువు ముగిశాక, ఏళ్లకేళ్ల తర్వాత మాత్రమే తిరిగి ఎన్నికలు జరిగేవి. కిందటిసారి సైతం స్పెషల్‌ ఆఫీసర్‌ పాలన సాగింది. 2014లో పాలకమండలి గడువు ముగియడంతో 2016 ఎన్నికలు జరిగే వరకు స్పెషలాఫీసర్‌ పాలనే నడిచింది. ఈసారి పాలకమండలి గడువుకు రెండున్నర నెలల ముందుగానే ఎన్నికలు జరగనున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా