అభివృద్ధా.. అరాచకమా? తేల్చుకోండి

22 Nov, 2020 03:10 IST|Sakshi

నగరం ఎన్నడూ లేనంత ప్రశాంతంగా ఉంది 

హైదరాబాద్‌కు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి 

ఆరేళ్లలో నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం 

ప్రశాంతంగా ఉన్నచోట విద్వేషాలు సృష్టించే కుట్రలు  

కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్

గతంలో బీజేపీ వాళ్లు అకౌంట్లలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పారు. ఎవరికైనా పడ్డాయా? ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేల వరద సాయాన్ని అడ్డుకున్నోళ్లు రూ.25 వేలు ఇస్తామంటున్నారు. అమ్మకు అన్నం పెట్టనోళ్లు... చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారట.బీజేపీ నాయకులు ఏం చెప్పినా వినడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్‌ కాదు, హుషార్‌ హైదరాబాద్‌.. ఆరేళ్లలో కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎంత డబ్బు తెచ్చారో చెప్పాలి. ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతారు.కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుండా అంతా కలిసిమెలిసి ఉంటున్నాం. ఇప్పుడు నాలుగు ఓట్ల కోసం విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 

సాక్షి, కూకట్‌పల్లి (హైదరాబాద్‌) : టీఆర్‌ఎస్‌ పాలనలో హైదరాబాద్‌ నగ రం ముందెన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్తోందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు అన్నారు. విద్వేషాల వలలో పడకుండా... సిటీజనులు అభివృద్ధిని చూసి గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. కూకట్‌పల్లి నుండి జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి ఆయన శనివారం శ్రీకారం చుట్టారు. కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లలో నిర్వహించిన రోడ్‌ షోలలో పాల్గొన్నారు. పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరం ఎంతో ప్రశాంతతతో ఉందని, ఈ ప్రశాంతతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని చెప్పారు. కులం, మతం, ప్రాంతంతో నిమిత్తం లేకుం డా నగర ప్రజలందరం కలిసిమెలిసి ఉంటు న్నామన్నారు. ఇలాంటి ప్రశాంతమైన వాతా వరణాన్ని చెడగొట్టే కుట్రలు జరుగుతున్నాయన్నారు. మొన్న కరోనా వచ్చినా, నిన్న వరదలు వచ్చి నా ప్రజల వెంట ఉన్నది టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేననే విషయం ప్రజలకు తెలుసన్నారు. వరదలతో ఇబ్బందిపడిన పేదలకు ప్రభు త్వం చేస్తున్న వరదసాయాన్ని ఆపింది ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఎన్ని కల్లో గెలిస్తే రూ.25 వేలు ఇస్తామని కొంతమంది ప్రజల్ని మభ్యపెడుతున్నారని, అంతేకాదు చలాన్లు కడతాం, అందిస్తాం, ఇదిస్తాం అంటూ తలాతోక లేకుండా మాట్లాడుతున్నా రని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అందజేసిన రూ. 10 వేల వరద సహాయాన్ని అడ్డుకున్నవాళ్లు రూ. 25 వేలు ఇస్తామని చెప్పడం... అమ్మకు అన్నం పెట్టనోళ్లు చిన్నమ్మకు బంగా రు గాజులు చేయిస్తామన్నట్లుగా ఉందన్నారు. మరో వైపు కారు పోతే కారు.. బైకు పోతే బైకు ఇస్తామంటూ వస్తారని, వాటిని ఏమాత్రం నమ్మవద్దన్నారు. గతంలో అకౌంట్లలో రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, ఎవరి అకౌంట్‌లోనైనా పడ్డాయా? అని ప్రశ్నించారు.


‘మీరు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి ఇది అమాయకపు అహ్మదాబాద్‌ కాదు, హుషార్‌ హైదరాబాద్‌’అని గుర్తుపెట్టుకోవాలని బీజే పీని ఉద్దేశించి అన్నారు. ఈ ఆరేళ్లలో కేసీఆర్‌ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి అన్నపూర్ణ పథకం, బస్తీ దవాఖానాలు, శివార్లకు మంచినీటి సదుపాయం, నిరంతర కరెంటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయన్నారు. రూ. 67 వేల కోట్లతో వంద ల కొద్దీ కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. ఈ ఆరేళ్లలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు కేంద్రం నుంచి ఎంత డబ్బు తెచ్చారో చెప్పాలన్నారు. ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లడుగుతున్నారని నిలదీశారు. 

ఇప్పుడు కరెంటు పోతే వార్త... 
ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అనేక రంగాల్లో హైదరాబాద్‌ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. యాపిల్, అమెజాన్, గూగుల్‌ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాయని, నగరంలో ఉన్న ప్రశాంతత, శాంతిభద్రతలే అందుకు కారణమని చెప్పారు. ఈ ఆరేళ్లలో నగరంలో 67 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం రాకముందు 14 రోజులకోమారు నీరు వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతిరోజూ, రెండురోజులకోమారు నీటిని ఇచ్చే పరిస్థితికి చేరుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఉంటే వార్త అని, ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నారు.

నగరంలో గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు, పేదవాళ్ల ఆకలి తీర్చేందుకు అన్నపూర్ణ పథకం, వీధివీధికి సీసీ కెమెరాలు, సీసీ రోడ్లు, కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌.... ఇలా వందల కార్యక్రమాలు ఈ ఆరేళ్ల కాలంలో చేశామన్నారు. అందరినీ అక్కున చేర్చుకునే తల్లి లాంటి హైదరాబాద్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని, నగరం నాశనమైతే మొత్తం తెలంగాణకే దెబ్బ అన్నారు. అభివృద్ధిని చూసి జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు సురేందర్, కోనేరు కోనప్ప, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, రేఖానాయక్, జోగు రామన్న, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్, బాలమల్లు, కార్పొరేటర్‌ అభ్యర్థులు పాల్గొన్నారు.   

అభివృద్ధా.. అరాచకమా? తేల్చుకోండి
పచ్చగా ఉన్న హైదరాబాద్‌ నగరంలో అలజడి సృష్టించేందుకు కుట్రలు జరుగుతున్నాయని, అలాంటి అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇండియా– పాకిస్తాన్‌. హిందూ– ముస్లిం అంటూ విద్వేషాలు రెచ్చగొట్టి నాలుగు ఓట్లు రాల్చుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రలను నగర ప్రజలు గమనించాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హైదరాబాద్‌లో మరెక్కడా ఆలయాలే లేవన్నట్లుగా పాతబస్తీలోని చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లడంలోనే వారి అసలు ఉద్దేశం అర్థమవుతోందన్నారు. హైదరాబాద్‌ నగరాన్ని నరకం చేయాలని చూస్తున్న వ్యక్తుల కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఏ రకమైన హైదరాబాద్‌ ఉంటే మన పిల్లాపాపలు ప్రశాంతంగా ఉంటారో, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయో ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ధి కావాలో, అరాచకం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు