రయ్‌ రయ్యిన..

27 Nov, 2020 01:32 IST|Sakshi
గురువారం రాత్రి హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లిలో జరిగిన రోడ్‌షోకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్‌

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారాన్ని పరుగులు తీయిస్తున్న టీఆర్‌ఎస్‌ 

 క్షేత్రస్థాయిలో డివిజన్లను చుట్టబెడుతున్న ఇన్‌చార్జ్‌లు, అభ్యర్థులు 

నియోజకవర్గాల వారీగా నిరంతర రోడ్‌షోలతో కేటీఆర్‌ బిజీ 

ప్రచార, ప్రసార సాధనాల్లో బీజేపీయే లక్ష్యంగా ఇంటర్వూ్యలు 

రాజకీయ విమర్శలకు పెద్దపీట.. ఆరేళ్ల అభివృద్ధి ప్రస్తావన 

రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ సభ.. 30 వేల మంది జనసమీకరణ 

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ ఎన్నికల ప్రచారం మరో మూడ్రోజుల్లో ముగియనుండటంతో క్షేత్రస్థాయిలో ప్రచార ఉధృతి పెంచడంపై టీఆర్‌ఎస్‌ దృష్టి సారించింది. ఈ నెల 17న ఎన్నికల షెడ్యూలు వెలువడగా మూడు విడతల్లో అభ్యర్థులను ఖరారుచేసిన టీఆర్‌ఎస్‌.. నామినేషన్ల దాఖలు నుంచే ప్రచారానికి శ్రీకా రం చుట్టింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఈ నెల 20న రోడ్‌షోలు ప్రారంభించగా రోజుకు రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజవర్గాల్లో జరిగే కార్యక్రమా ల్లో పాల్గొంటున్నారు. కేవలం సాయం త్రం వేళల్లో మాత్రమే రోడ్‌షోల్లో పాల్గొంటున్న కేటీఆర్‌ మిగతా çసమయంలో క్షేత్రస్థాయిలో అభ్యర్థుల ప్రచారం, పార్టీ యంత్రాంగం నడుమ సమన్వయం వంటివి చూస్తూనే, వివిధ వర్గాలతో జరిగే భేటీల్లో పాల్గొంటున్నారు. హైసియా, గౌడ, యాదవ సంఘం, ప్రైవేటు స్కూల్స్, బిల్డర్స్‌ అసోసియేషన్లతో పాటు వివిధ వర్గాలకు చెందిన వారితో సమావేశమై హైదరాబాద్‌ నగరాభివృద్ధిపై తమ పార్టీ ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 

సమన్వయకర్తలతో అంతర్గత భేటీలు 
డివిజన్ల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలను ఇన్‌చార్జ్‌ లుగా నియమించిన టీఆర్‌ఎస్‌ ఈనెల 29లోగా క్షేత్రస్థాయిలో కాలనీలు, బస్తీలను చుట్టొచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటోంది. డివిజన్లలో జరుగుతున్న ప్రచార తీరుతెన్నులను నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఎప్పటికప్పుడు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌కు నివేదిస్తున్నారు. ఆయన నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా ప్రచార లోపాలను సరిదిద్దడంతో పాటు, అంతర్గత సమన్వయంపై మరింత దృష్టి పెడుతున్నారు. డివిజన్ల వారీగా వివిధ ప్రైవేటు సర్వే ఏజెన్సీలు, ఇతర మార్గాల ద్వారా వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి.. నగరానికి చెందిన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలను లోపాలపై అప్రమత్తం చేస్తున్నారు. 

విస్తృత ప్రచారం 
ఓవైపు క్షేత్రస్థాయి ప్రచారాన్ని కొనసాగిస్తూనే మరోవైపు ప్రచార, ప్రసార మాధ్యమాల్లో పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేలా టీఆర్‌ఎస్‌ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రధాన పత్రికలు, చానళ్లకు ఇస్తున్న ప్రత్యేక ఇంటర్వూ్యల్లో ఆరేళ్లలో హైదరాబాద్‌ నగరాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పదేపదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు బీజేపీయే లక్ష్యంగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ, ఆ పార్టీ ఆరోపణలకు చెక్‌పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సోషల్‌ మీడియాతో పాటు ఎఫ్‌ఎం రేడియో వంటి ఆధునిక ప్రసార సాధనాలను కూడా ప్రచారం కోసం వినియోగిస్తున్నారు. తాజాగా ‘ఈ బుక్‌’పేరిట పార్టీ అభివృద్ధి ఎజెండాను టీఆర్‌ఎస్‌ డిజిటల్‌ రూపంలో ఓటర్లకు చేరవేస్తోంది. 

సీఎం సభకు జనసమీకరణపై దృష్టి
ఈ నెల 28న ఎల్‌బీ స్టేడియంలో జరిగే ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ బహిరంగసభకు జనసమీకరణపై కసరత్తు జరుగుతోంది. ఓవైపు క్షేత్రస్థాయిలో ప్రచారానికి అంతరాయం కలగకుండా మరోవైపు స్టేడియం సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం 30వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు. గ్రేటర్‌ ఎన్నికల క్షేత్రస్థాయి ప్రచారానికి దూరంగా ఉన్న సీఎం కేసీఆర్, పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో మాత్రమే పాల్గొన్నారు. వివిధ పార్టీలు లేవనెత్తుతున్న అంశాలు, విమర్శలకు సమాధానమిచ్చేలా 28న జరిగే బహిరంగసభ ఉంటుందని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

>
మరిన్ని వార్తలు