కోవిడ్‌ విలయంలో కేంద్రం సంచలన నిర్ణయం

3 May, 2021 18:57 IST|Sakshi

సెంట్రల్​ విస్టా  ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక హంగులతో ప్రధాని నివాసం

 2022 డిసెంబరు నాటికి  పూర్తి చేయాలని డెడ్‌లైన్‌

సాక్షి,న్యూఢిల్లీ: ఒకవైపు దేశంలో కరోనా మహమ్మారి రెండో దశలో విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగి పోతోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో ఆక్సిజన్‌ కొరత కారణంగా బాధితుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ఎన్‌డీఏ  సర్కారు తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సెంట్రల్​ విస్టా  ప్రాజెక్టులో భాగంగా 2022 డిసెంబరు నాటికి ప్రధానమంత్రి కొత్త నివాసాన్ని పూర్తి చేయాలని  డెడ్‌లైన్‌  విధించింది. కరోనా, లాక్‌డౌన్‌ ఆంక్షల మధ్య అనేక కార్యకలాపాలు నిలిచిపోయిన తరుణంలో దీన్ని అత్యవసర సర్వీస్‌గా పరిగణించి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ క్లియరెన్స్  ఇచ్చేసింది.

ప్రతిపక్షాల అభ్యంతరాలు ఉన్నప్పటికీ, మేక్ఓవర్ ప్రణాళికపై ముందుకు సాగాలని ప్రభుత్వం నిశ్చయించుకోవడం చర్చకు దారి తీస్తోంది. తాజా ఆదేశాల ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరు నాటికి  పూర్తి కానున్న భవనాల్లో మొదటిది ప్రధానమంత్రి నివాసం. అత్యాధునిక హంగులతో దీన్ని రూపొందించనున్నారు.  అలాగే ప్రధాని భద్రత నిమిత్తం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ప్రధాన కార్యాలయం, ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్ కూడా ఇదే గడువులో నిర్మాణాన్ని పూర్తి చేసుకోనున్నాయి. మరోవైపు సెంట్రల్ విస్టాపై గత వారమే కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇది అత్యవసరం కాదు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో అవసరం అని రాహుల్ ట్వీట్ చేశారు. అటు సీపీఎం  ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి కూడా తాజా నిర్ణయంపై మండిపడ్డారు. ఒక పక్క దేశ ప్రజలు ఆసుప్రతి బెడ్స్‌ దొరకక, ఆక్సిజన్‌, మందులు లభించక అల్లాడిపోతోంటే.. చివరికి శ్మశానాల్లో స్థలం దొరక్క విలవిల్లాడుతోంటే  ప్రజలు డబ్బును తగలేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది  చాలా అసంబద్ధమైంది. ఈ నేరాన్ని ఆపండి అంటూ  ట్వీట్‌ చేశారు. (ఫైజర్‌ ఔదార్యం: కంపెనీ చరిత్రలో అతిపెద్ద సాయం)

డిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు నాలుగు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే  ఈ మొత్తం ప్రాజెక్టుని 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందే పూర్తి చేయాలనేది ప్లాన్‌. అయితే ప్రస్తుతం భవనాలు చెడిపోయే స్థితిలో ఉన్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. అటు ఈ ప్రాజెక్టును ఆపడానికి సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. అన్నీ నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయనీ తేల్చి చెప్పింది. అయితే  ముగ్గురు న్యాయమూర్తుల  సుప్రీం ధర్మాసనంలో  ఒకరు దీనికి ప్రజా సంప్రదింపులు లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు  కింద నిర్మించనున్న  కొత్త భవనాల కోసం అంచనా వ్యయం రూ.13,450 కోట్లు. 10 భవనాలు నిర్మించనున్నారు. దాదాపు 46,000 మందికి ఉపాధి లభించనుందని అంచనా.   (కరోనా ఉధృతి: 6వ రోజూ 3 వేలకు పైగా మరణాలు)

మరిన్ని వార్తలు