గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్‌

10 Nov, 2022 15:50 IST|Sakshi

రాజ్‌కోట్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అధికార బీజేపీకి చెందిన మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు సీనియర్‌ నాయకులు పోటీ విముఖత చూపారు. తాము పోటీ చేయడం లేదని, అభ్యర్థుల ఎంపికలో తమ పేర్లు పరిశీలించొద్దని అధిష్టానానికి తెలిపారు. మాజీ సీఎం విజయ్‌ రూపానీ, మాజీ ఉప ముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌, భూపేంద్రసిన్హ్‌ చూడాసమా, ప్రదీప్‌సిన్హ్‌ జడేజా.. ఈ మేరకు గుజరాత్‌ బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌కు లేఖలు రాశారు. ఈ నలుగురు వేర్వేరుగా లేఖలు రాసినట్టు బీజేపీ అధికార ప్రతినిధి యమల్ వ్యాస్ ధ్రువీకరించారు.

అభ్యర్థుల పేర్లను ఖరారు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఢిల్లీలో బీజేపీ కేంద్ర పార్లమెంట్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో సీనియర్‌ నాయకుల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తమకు టికెట్లు వద్దంటూ సీనియర్లు లేఖలు ఇవ్వడంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పి తప్పినట్టయింది. 


పోటీ చేయనని ముందే చెప్పా: రూపానీ

‘అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నాను. గుజరాత్‌కు ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం బీజేపీ నాకు కల్పించింది. ఇప్పుడు నన్ను పంజాబ్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సీనియర్ నాయకుడిగా నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ముందే ప్రకటించాను. నేను టికెట్ కూడా అడగటం లేద’ని విజయ్‌ రూపానీ విలేకరులతో చెప్పారు. 66 ఏళ్ల రూపానీ రాజ్‌కోట్ వెస్ట్ అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2016, ఆగస్టు నుంచి 2021, సెప్టెంబర్  వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 


ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా: పటేల్‌

ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెహసానా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడం లేదని, తన పేరు పరిశీలించొద్దని పాటిల్‌కు రాసిన లేఖలో నితిన్‌ పటేల్‌ పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కడి, మెహసానా స్థానాల నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాన’ని పటేల్‌ విలేకరులతో  అన్నారు.


తొమ్మిది సార్లు పోటీ చేశా, ఇక చాలు..

పార్టీ తనకు తొమ్మిది సార్లు అవకాశం ఇచ్చిందని, ఇక చాలని మాజీ మంత్రి, ధోల్కా ఎమ్మెల్యే భూపేంద్రసిన్హ్‌ చూడాసమా అన్నారు. ‘తొమ్మిది సార్లు పోటీ చేసే అవకాశమిస్తే నేను ఐదు సార్లు గెలిచి క్యాబినెట్ మంత్రిగా కూడా పని చేశాను. ఇక చాలు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పార్టీకి ముందే చెప్పాన'ని తెలిపారు.


ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేయబోనని, పార్టీ తనకు ఏ పని అప్పగించినా చేస్తానని ప్రదీప్‌సిన్హ్‌ జడేజా పేర్కొన్నారు. (క్లిక్: మోదీతో 25 ఏళ్ల పరిచయం.. అయినా వెనక్కి తగ్గను)

మరిన్ని వార్తలు