మండలి చైర్మన్‌గా మళ్లీ గుత్తా? 

16 Dec, 2021 02:12 IST|Sakshi
గుత్తా, మధుసూదనాచారి, బండా ప్రకాశ్‌

లేదంటే మధుసూదనాచారికి అవకాశం 

మండలిలో చైర్మన్, డిప్యూటీ చైర్మన్‌ సహా మూడు విప్‌ పదవులు ఖాళీ 

బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి లేదా డిప్యూటీ చైర్మన్‌ 

మండలి నుంచి కేబినెట్‌ ఆశావహుల జాబితాలో కడియం, గుత్తా, కవిత

చైర్మన్, వైస్‌చైర్మన్‌ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి సమావేశాలు?  

సాక్షి, హైదరాబాద్‌: శాసన మండలిలో వివిధ కోటాల్లో ఖాళీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగియడంతో సభలో సంఖ్యాపరంగా టీఆర్‌ఎస్‌ సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. 40 మంది సభ్యులున్న మండలిలో పార్టీ మద్దతుదారులైన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో కలుపుకొని టీఆర్‌ఎస్‌ బలం 36కు చేరింది. గవర్నర్‌ కోటాలో ఒకరు, ఎమ్మెల్యే కోటాలో ఆరుగురు, స్థానిక సంస్థల కోటాలో 12 మంది కలుపుకొని మొత్తం 19 మంది టీఆర్‌ఎస్‌ సభ్యులు ఇటీవలి కాలంలో మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మండలిలో ఖాళీగా ఉన్న పదవులను పలువురు సభ్యులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం మండలిలో చైర్మన్, వైస్‌ చైర్మన్‌తోపాటు చీఫ్‌ విప్, మరో మూడు విప్‌ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటితోపాటు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్న సభ్యులూ ఉన్నారు.

గత జూన్‌ మొదటి వారంలో మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు ఏకకాలంలో ఎమ్మెల్సీలుగా పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. విప్‌లుగా ఉన్న కర్నె ప్రభాకర్‌ గత ఏడాది మార్చిలో రిటైర్‌ కాగా, మరో ఇద్దరు విప్‌లు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు తాజాగా జరిగిన స్థానిక కోటా ఎన్నికల్లో మరోమారు ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం జనవరి 4న ముగియనుండగా, ఎంఎస్‌ ప్రభాకర్‌ ఒక్కరే విప్‌ హోదాలో కొనసాగుతారు. చైర్మన్‌ స్థానంలో ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డి పదవీకాలం జనవరి 4న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు ఆశావహులు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 

సర్వత్రా ఉత్కంఠ: మండలి చైర్మన్‌గా పనిచేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి మరోమారు మండలికి ఎన్నిక కాగా, గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన సిరికొండ మధుసూదనాచారి కూడా గవర్నర్‌ కోటాలో మండలిలో అడుగు పెడుతున్నారు. ఏడాదిన్నర కాలం చైర్మన్‌గా పనిచేసిన గుత్తా మరోమారు చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే, అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన అనుభవమున్న మధుసూదనాచారి మండలి చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మధుసూదనాచారికి చైర్మన్‌ పదవి దక్కితే గుత్తాకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత ఉన్న పదవి దక్కే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఎమ్మెల్యే కోటాలో మండలిలో అడుగుపెడుతున్న బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌కు కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. ఒకవేళ సామాజిక సమీకరణాల లెక్కల్లో కేబినెట్‌లో బెర్త్‌ దక్కకపోతే మండలి వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశముంది.  ఈ పదవుల పంపకాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మండలి కోటాలో కేబినెట్‌ బెర్త్‌? 
ప్రస్తుతం మండలి నుంచి మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ మంత్రిమండలికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, మరికొందరు సీనియర్‌ నేతలు కూడా కేబినెట్‌లో చోటు ఆశిస్తున్నారు. గతంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన ఈటల రాజేందర్‌ స్థానంలో బండా ప్రకాశ్‌కు చోటు దక్కుతుందని భావిస్తుండగా, ఆయనతోపాటు మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత ఆశావహుల జాబితాలో ఉన్నారు. మండలిలో ఖాళీగా ఉన్న మూడు విప్‌ పదవులను ఆశిస్తున్న వారిలో ఇప్పటికే విప్‌లుగా ఉన్న భానుప్రసాద్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డితోపాటు తక్కల్లపల్లి రవీందర్‌రావు, సురభి వాణీదేవి, ఫారూఖ్‌ హుస్సేన్, గంగాధర్‌గౌడ్‌ ఉన్నారు. ఇదిలాఉంటే మండలి ప్రొటెమ్‌ ఛైర్మన్‌ పదవీకాలం జనవరి 4న ముగుస్తుండటంతో కొత్త చైర్మన్‌ ఎన్నిక కోసం రెండు రోజులు మండలి ప్రత్యేక సమావేశం నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.   

మరిన్ని వార్తలు