శాసన మండలి చైర్మన్ గుత్తా ఉక్కిరి బిక్కిరి.. అసలేం జరుగుతోంది?

29 Oct, 2023 12:54 IST|Sakshi

సుఖేందర్ రెడ్డికి అనుచరుల తలపోటు

ఒక్కొక్కరు పార్టీ వీడుతున్న వైనం

కాంగ్రెస్‌లోకి వలసెల్లకుండా అడ్డుకోలేని దైన్యం

సొంత పార్టీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న సుఖేందర్ రెడ్డి

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఆయనకు దగ్గరి అనుచరులుగా ఉన్న వారంతా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారు. వారంతా కట్టకట్టుకు కాంగ్రెస్‌లో చేరిపోతున్నారు. దీంతో పరోక్షంగా ఈ ప్రభావం మండలి చైర్మన్‌కు ఎఫెక్ట్ అయ్యేలా ఉందన్నఅభిప్రాయం వ్యక్తమవుతోంది. సుదీర్ఘ కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలను శాసిస్తున్న గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇపుడు ఆత్మరక్షణలో పడిపోయిన పరిస్థితులు తలెత్తాయంటున్నారు.

తెలుగుదేశం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన మదర్ డెయిరీ చైర్మన్‌గా, ఎంపీగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నల్గొండ ఎంపీగా పనిచేసిన ఆయన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్ గూటికి చేరారు. అదే సమయంలో సుఖేందర్ రెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉన్న నాటి సీపీఐ దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ సైతం సీపీఐ నుంచి బీఆర్ఎస్‌లోకి మారిపోవడంతో గుత్తా కీలకంగా వ్యవహరించారు.

మరో వైపు టీడీపీలో ఉన్న సమయం నుంచీ ఇప్పటి నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సోదరులతో గుత్తాకు బయటకు కనిపంచేంత సఖ్యత లేదు. కాంగ్రెస్ ఎంపీగా ఉండి గులాబీ కండువా కప్పుకున్న ఆయనకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు, తెలంగాణ శాసన మండలి చైర్మన్‌గా కూడా అవకాశం కల్పించారు. పదవీ కాలం ముగిశాక కూడా రెండోసారి ఎమ్మెల్సీగా, మరో మారు మండలి చైర్మన్ గా పదవిలో కూర్చోబెట్టారు. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న, తన రాజకీయ వారసునిగా తన తనయుడు అమిత్‌ను అరంగేట్రం చేయించే పనిలో ఉన్నారు. కానీ, తెలంగాణ శాసన సభ ఎన్నికల సందర్బంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆయనకు ప్రతికూలంగా మారుతున్నాయి.

వారితో చెడిందా?
ఎవరితో తనకు విభేదాలు లేవని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది. కానీ, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నాయక్ లతో ఈ మధ్య చెడిందన్న వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖరారు చేసిన నాటినుంచే కొందరు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారిలో దేవరకొండ ఒకటి. అక్కడి అభ్యర్థిని మార్చాల్సిందేనని పట్టుబడుతున్న వారంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరి అనుచరులు కావడం గమనార్హం.

టీడీపీ తరపున దేవరకొండ జెడ్పీటీసీ సభ్యునిగా పని చేసిన కాలం నుంచి గుత్తా ఏ పార్టీలోకి వెళితే ఆయన వెంట ఆయా పార్టీల్లోకి వెళ్లి వెంట నడుస్తున్న వారే కావడం గమనార్హం. ఇపుడు వీరంతా.. మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహులు, మాజీ చైర్మన్ వడ్త్య దేవేందర్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అంతా కట్టకట్టుకుని మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిల మాటను బేఖాతరు చేసి, సుఖేందర్ రెడ్డి మాటలను చెవిన పెట్టకుండా కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి బాలూ నాయక్  గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు.

నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పదుల సంఖ్యలో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీ, తిప్పర్తి జెడ్పటీసీ సభ్యుడు వీరంతా బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. వీరంతా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అత్యంత దగ్గరి అనుచరులు కావడం విశేషం. జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న తిప్పర్తి జెడ్పీటీసీ సభ్యుడు పాశం రాంరెడ్డి పార్టీ మారడం గుత్తా సుఖేందర్ రెడ్డికి తలనొప్పిగా మారింది.

దీంతో ఆయన తాను పార్టీ మారడం లేదని, తన అనుచరులను బయటకు పంపడం లేదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే తాను కానీ, తన తనయుడు కానీ, నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తామని ప్రకటించాల్సి వచ్చింది. సుఖేందర్ రెడ్డి అనుచరగణం పార్టీ వీడుతుండడాన్ని ఆయా నియోజకవర్గాల సిట్టింగు అభ్యర్థులు హై కమాండ్‌కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో మండలి చైర్మన్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
చదవండి: కాంగ్రెస్‌ను వీడనున్న నాగం జనార్దన్‌రెడ్డి?            

మరిన్ని వార్తలు