మీరు నీళ్లిస్తే వలసలు ఆగలేదేం?

12 Feb, 2023 02:44 IST|Sakshi

భట్టి ఆరోపణలకు సమాధానమిచ్చిన మంత్రి హరీశ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘కాంగ్రెస్‌ హయాంలోనే నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి ప్రాజెక్టులు పూర్తయి లక్షల ఎకరాలకు నీళ్లందితే పాలమూరు జిల్లాలో వలసలు ఎందుకు కొనసాగాయో ఆ పార్టీనే చెప్పాలి. ఆ ప్రాజెక్టుల కింద కాంగ్రెస్‌ హయాంలో  27,300 ఎకరాలకే నీళ్లందాయి. పంప్‌ హౌస్‌లు పూర్తి చేయకుండా,  కాలువలు తవ్వకుండా బిల్లులు తీసుకున్నారు.

మా ప్రభుత్వం వచ్చాక రూ. 3,663 కోట్లతో మొత్తం పనులు పూర్తి చేసి 5,69,506 ఎకరాలకు నీళ్లు అందించాం. జూరాల కింద లక్ష ఎక రాల ఆయకట్టు పెంచాం. మిషన్‌ కాకతీయతో వలస వెళ్లిన వారు తిరిగి వచ్చారు’’ అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పద్దుల పై చర్చలో సీఎల్పీ నేత భట్టి సాగునీటి ప్రాజెక్టులపై చేసిన ఆరోపణలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.

‘కాళేశ్వరం’ ఇప్పుడు వెళ్లండి..: గతేడాది భారీ వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాంతం బురదమయమై ఉండటంతో ప్రమాదాలు నివారించేందుకే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అందుకే అప్పుడు కాంగ్రెస్‌ నేతల ప్రాజెక్టు సందర్శనను పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు.

ఇప్పుడు సమావేశాలు పూర్తయ్యాక వెళ్తానంటే అధికారులను ఇచ్చి పంపుతామని, కడుపునిండా భోజనం కూడా పెట్టిస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై గతేడాదే కృష్ణా బోర్డు భేటీలో అభ్యంతరం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని ఎన్జీటీ, కృష్ణా బోర్డు ద్వారా ఏపీ ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇప్పించగలిగామని చెప్పారు.

17 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తెచ్చాం...
పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో జలయజ్ఞంలో కొత్తగా వచ్చిన ఆయకట్టు 5.71 లక్షల ఎకరాలు మాత్రమేనని, స్థిరీకరించింది కేవలం 93 వేల ఎకరాలేనని హరీశ్‌రావు గుర్తుచేశారు. కానీ తమ ప్రభుత్వం 17.23 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 30.56 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించిందన్నారు. గుజరాత్‌లోని సర్దార్‌ సరోవర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి 56 ఏళ్లు పట్టిందని, మధ్యప్రదేశ్‌లో  ఇందిరాసాగర్‌ ప్రాజెక్టు పూర్తికి 21 ఏళ్లు పట్టిందన్న హరీశ్‌రావు... తాము మూడున్నరేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి 817 చెరువులు, 66 చెక్‌డాంలు నింపామని వివరించారు.

అనుమతి రాగానే పాలమూరు–రంగారెడ్డి పనులు..
ఎస్‌ఎల్‌బీసీని ఏడాదిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పాలమూరు–రంగారెడ్డి డీపీఆర్‌ కేంద్రానికి పంపామని మంత్రి హరీశ్‌ తెలిపారు. వట్టెం నుంచి డిండికి నీళ్లు తీసుకుంటామని ప్రతిపాదించామని అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు