భారీ పోలింగ్‌ మా విజయానికి సంకేతం

1 Apr, 2021 05:58 IST|Sakshi
ధనేఖలిలో సభలో అభివాదం చేస్తున్న నడ్డా

బెంగాల్‌ ఎన్నికలపై బీజేపీ అధ్యక్షుడు నడ్డా

ధనేఖలి: బెంగాల్‌ తొలివిడత ఎన్నికల్లో భారీగా పోలింగ్‌ శాతం నమోదు కావడం రాష్ట్రంలో మార్పునకు సంకేతమని, అవినీతి టీఎంసీ పాలనపై ప్రజలు విశ్వాసం కోల్పోయారనేందుకు నిదర్శనమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. టీఎంసీ గూండాల బీభత్సాల నడుమ శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించిందంటూ ఎన్నికల కమిషన్‌ను ప్రశంసించారు. టీఎంసీ ఆట ముగిసిందని, ఎన్నికలు శాంతియుతంగా జరగడంపై మమతా బెనర్జీ ఆందోళనగా ఉన్నారని విమర్శించారు. బెంగాల్‌ తొలిదశ ఎన్నికల్లో దాదాపు 85 శాతం పోలింగ్‌ నమోదయింది.

మమతా బెనర్జీ నందిగ్రామ్‌ నియోజకవర్గాన్ని ఎంచుకోవడంపై వ్యంగ్యంగా స్పందిస్తూ ‘‘ తన కేబినెట్‌లో మాజీ మంత్రిని ఎదుర్కొనేందుకు స్వయంగా సీఎం రంగంలోకి దిగారంటే, ఇద్దరిలో ఎవరు బడాలీడర్‌?’’ అని ప్రశ్నించారు. బెంగాల్‌లో టీఎంసీ అదృశ్యమవుతుందని నందిగ్రామ్‌ ప్రజలు స్పష్టమైన సమాధానమిస్తారన్నారు. ఇటీవలే మరణించిన 82ఏళ్ల వృద్ధురాలు సోవా మజుందార్‌ను ప్రస్తావిస్తూ, మమత పాలనను దుయ్యబట్టారు. బెంగాల్‌లో మా, మాటీ, మానుష్‌ అరక్షితంగా మారాయన్నారు. మమత పాలనలో సిండికేట్‌ రాజ్యం ఏర్పడిందని ఆరోపించారు. కిడ్నాపులు, యాసిడ్‌ దాడులు, హత్యాయత్నాల్లో బెంగాల్‌ అగ్రగామిగా మారేందుకు మమతే కారణమని విమర్శించారు. మొహర్రం ఊరేగింపునకు గతేడాది అనుమతినిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, రామమందిరం శంకుస్థాపన రోజు ఎందుకు కర్ఫ్యూ విధించిందని నడ్డా ప్రశ్నించారు. దుర్గాపూజ, సరస్వతి పూజపై పరిమితులు విధించిన సీఎం ఎన్నికలు వచ్చే సరికి చండీయాగాలు చేస్తోందన్నారు. హూగ్లీలో జూట్‌మిల్లుల్లో అధికశాతం మూతపడడం, రాష్ట్రంలో పరిశ్రమల దుస్థితికి నిదర్శనమన్నారు.   
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు