ఇమ్రాన్‌ ఖాన్‌పై మరియం షరీఫ్‌ సంచలన ఆరోపణలు.. చివరి క్షణం వరకూ..

27 Apr, 2022 18:37 IST|Sakshi

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌పై అధికార పార్టీ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్‌ సంచలన ఆరోపణలు చేశారు. అధికారాన్ని కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నించారని ధ్వజమెత్తారు. తను పదవిలో ఉన్న చివరి నిమిషం వరకు పాకిస్థాన్‌ ఆర్మీని వేడుకున్నాడని అన్నారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో తనను గట్టెక్కించాలని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఉపాధ్యక్షుడు అసిఫ్‌ అలీ జర్దారీని కూడా బతిమాలారని మరియం విమర్శించారు. అవిశ్వాసంపై ఓటింగ్‌ను వాయిదా వేయడానికి తీవ్రంగా ప్రయత్నించాడని, అందుకే తాము అర్ధరాత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించామని మరియమ్‌ అన్నారు.  

లాహోర్‌లో గురువారం నిర్వహించిన ఓ  కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు కష్టాలు వచ్చే రోజులు మొదలయ్యాయని మరియం ఆరోపించారు. ఒకవేళ నవాజ్‌ షరీఫ్‌ తిరిగి వస్తే ఇమ్రాన్‌ పరిస్థితి ఎలా ఉంటుందోనని ఊహించుకోవాలన్నారు. రాజకీయాలంటే కప్పు టీ తాగినంత సులువు కాదని ఇమ్రాన్‌ క్రికెట్‌ ఆడటమే మంచిదని ఎద్దేవా చేశారు. ఇమ్రాన్ అవినీతిపై ప్రభుత్వం దర్యాప్తు చేస్తుందని, త్వరలోనే ఇమ్రాన్‌తోపాటు అతని మంత్రివర్గ సభ్యులు తిరుగులేని అవినీతి ఆరోపణలపై కటకటాల పాలవుతారని మండిపడ్డారు.
చదవండి👉 పాకిస్తాన్‌లో మహిళా సూసైడ్‌ బాంబర్‌.. షాకింగ్‌ విషయాలు వెల్లడి

కాగా మూడుసార్లు పాకిస్థాన్‌కు ప్రధానిగా పనిచేసిన నవాజ్‌షరీఫ్‌ కూతురే మరియం షరీఫ్‌. ఇమ్రాన్‌ ఖాన్‌ అధికారంలో ఉన్న సమయంలో నవాజ్‌పై అనేక అవినీతి కేసులు పెట్టించాడు. అయితే లాహోర్‌ హై కోర్టు అనుమతితో 2019 నవంబర్‌లో చికిత్స కోసం లండన్‌ వెళ్లారు. ప్రస్తుతం పాక్‌లో అధికారంలోకి వచ్చిన పీఎమ్‌ఎల్‌ ప్రభుత్వం నవాజ్‌కు కొత్త పాస్‌పోర్టు అందించి అతన్ని దేశానికి తీసుకొచ్చేందుకు మార్గం సుగుమం చేసింది. 

కాగా 75 ఏళ్ల స్వతంత్ర్య పాకిస్థాన్‌ చరిత్రలో దాదాపు సగానికి పైగా ఆర్మీనే ఆ దేశాన్ని పాలించింది. ఇప్పటికీ దేశ భద్రత, విదేశాంగ విధానానికి సంబంధించి సైన్యమే కీలక నిర్ణయం తీసుకుంటుంది. అయితే ఇటీవల ఇమ్రాన్‌ ఖాన్‌కు షెబాష్‌ షరీఫ్‌కు మధ్య రాజకీయ వివాదాలు తలెత్తడంతో ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సైన్యం నిరాకరించింది. ఇమ్రాన్‌ను గద్దె దించేందుకు ప్రతిపక్షాలు జాతీయ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ అవిశ్వాస తీర్మాణం నెగ్గడంతో ఇమ్రాన్‌ ఖాన్‌ ఏప్రిల్‌ 10న పదవి కోల్పోయారు. దీంతో పాకిస్థాన్‌ చరిత్రలో  అవిశ్వాసం ఎదర్కొని పదవీచ్యుతుడైన తొలి ప్రధానికిగా నిలిచారు.
చదవండి👉 ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. రెప్పపాటులో బిడ్డను వెనక్కి లాగడంతో..

మరిన్ని వార్తలు