ఆర్‌ఎస్‌ఎస్‌ అర్థం కావాలంటే చాన్నాళ్లు పడుతుంది

4 Mar, 2021 01:50 IST|Sakshi

రాహల్‌గాంధీనుద్దేశించి మంత్రి జవదేకర్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల ఆర్‌ఎస్‌ఎస్‌’అని బీజేపీ కొనియాడింది. హిందూత్వ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ను రాహుల్‌ గాంధీ పాకిస్తాన్‌లోని రాడికల్‌ ఇస్లామిక్‌ వ్యవస్థతో పోల్చడాన్ని బీజేపీ తీవ్రంగా దుయ్యబట్టింది. కేంద్ర మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ అధికార బీజేపీకి సైద్ధాంతిక భూమికనిచ్చిన ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీకి చాలా సమయం పడుతుందని బీజేపీ ఎద్దేవా చేసింది. ‘ఆర్‌ఎస్‌ఎస్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద దేశభక్తియుత పాఠశాల. అందుకే అది అత్యున్నత స్థానంలో ఉంది’ అని జవదేకర్‌ అన్నారు.

ప్రజల్లో మంచి మార్పు తీసుకురావడమూ, వారిలో దేశభక్తిని పెంపొందించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యమని జవదేకర్‌ అన్నారు. పాకిస్తాన్‌లోని ఇస్లామిస్ట్‌లు నిర్వహిస్తోన్న మదర్సాల మాదిరిగా భారత్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహిస్తోన్న పాఠశాలలున్నాయని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించగా, జవదేకర్‌ స్పందించారు. అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు కౌషిక్‌ బసుతో మాట్లాడుతూ రాహుల్‌ గాంధీ, 1975లో మాజీప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడం తప్పు అని వ్యాఖ్యానించారు. అయితే ఆనాడు వ్యవస్థలను టార్గెట్‌ చేసే ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎప్పుడూ చేయలేదని రాహుల్‌ స్పష్టం చేశారు.

అయితే రాహుల్‌ వ్యాఖ్యలు హస్యాస్పదం అని జవదేకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ సంస్థల స్వాతంత్య్రాన్ని ఆనాడే కాలరాసిందని, పత్రికా స్వేచ్ఛను హరించిందని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి గొంతు నులిమి వేసిందనీ జవదేకర్‌ విమర్శించారు. ఎంపీలూ, ఎమ్మెల్యలేతో సహా లక్షలాది మంది ప్రజలను ఎమర్జెన్సీలో అరెస్టు చేశారని, సంస్థల స్వాతంత్య్రాన్ని హరించివేశారని జవదేకర్‌ అన్నారు. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన బెంగాలీ హిందువులు, బుద్ధిస్టులకు పౌరసత్వం ఇవ్వాలని 2015లో డిమాండ్‌ చేసిన కాంగ్రెస్, అస్సాంలో తమని గెలిపిస్తే సీఏఏని రద్దు చేస్తామంటూ కాంగ్రెస్‌ జనరల్‌సెక్రటరీ ప్రియాంకా గాంధీ ఇప్పుడు వ్యాఖ్యానించడం ఎన్నికల అవకాశవాదమని జవదేకర్‌ ట్వీట్‌ చేశారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు