తనయుడిని గెలిపించిన తల్లి.. జైలు నుంచే జయభేరి

3 May, 2021 18:41 IST|Sakshi

సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు అఖిల్‌ గొగోయ్‌ విజయం

జైలు నుంచే బరిలో నిలిచి గెలిచాడు

డిస్పూర్‌: అసోం అసెంబ్లీ ఎన్నికల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, రైజోర్ దళ్ చీఫ్ అఖిల్ గొగోయ్ జైలు నుంచే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. శిబ్‌సాగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన... ప్రచారంలో పాల్గొనకుండానే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కోన్వారిపై 11,875 ఓట్ల తేడాతో గెలుపొందారు. గొగోయ్‌కు మొత్తం 57,219 ఓట్లు రాగా.. మొత్తం 46.06 శాతం ఓటర్ల మద్దతు ఆయనకు లభించింది. సీఏఏ వ్యతిరేక ఉద్యమం నేపథ్యంలో దేశద్రోహం అభియోగాల కింద 2019లో గొగోయ్‌‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గొగోయ్‌ గువహటి మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్సిటల్‌లో చికిత్స పొందుతున్నారు. 

అఖిల్ గొగోయ్ గత ఏడాది అక్టోబర్‌లో రైతు సంస్థ క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్), కొన్ని యాంటీ సీఏఏ సంస్థల మద్దతుతో రైజోర్ దళ్‌ను స్థాపించారు. అస్సాంలో జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలకు రైజోర్ దళ్ కొత్తగా ఏర్పడిన మరో పార్టీ అస్సాం జాతియా పరిషత్ (ఏజేపీ) తో కలిసి 18 స్థానాలకు పోటీ చేసింది. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతుగా నిలిచినప్పటికీ... ఎన్నికల్లో మాత్రం సుభ్రామిత్ర గొగోయ్‌కు టిక్కెట్ ఇచ్చింది. దాంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే ఎన్నికల ఫలితాల్లో ఆయన మూడో స్థానంలో నిలిచారు.  

కుమారుడి తరఫున రంగంలోకి దిగిన తల్లి...
ఇక ఎన్నికల ప్రచారంలో ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం లేకపోవడంతో.. గొగోయ్ జైలు నుంచే ప్రజా సమస్యలపై అనేక బహిరంగ లేఖలు రాశారు. దీనికితోడు జైల్లో ఉన్న తన కుమారుడి కోసం 85 ఏళ్ల ఆయన తల్లి ప్రియదా గొగోయ్.. శిబ్‌సాగర్‌లోని గల్లీల్లో తిరుగుతూ విస్తృత ప్రచారం చేశారు. కుమారుడి కోసం ఆమె చేస్తున్న పోరాటానికి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు మేథా పాట్కర్, సందీప్ పాండే మద్దతు తెలిపారు. శిబ్‌సాగర్‌కు తరలివచ్చి ప్రియదా గొగోయ్‌తో కలిసి ప్రచారం చేశారు. దీంతో బీజేపీ అభ్యర్థి సురభి రాజ్‌కొన్వర్‌ కోసం బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ వంటి అగ్రనేతలను సైతం రంగంలోకి దించినా.. గొగోయ్ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది.

ఈ సందర్భంగా అఖిల్‌ గొగోయ్‌ భార్య మాట్లాడుతూ.. ‘‘అసోం శిబ్‌సాగర్‌ జనాలు అఖిల్‌ మీద పెంచుకున్న ప్రేమ, ఆప్యాయతలే తనని గెలిపించాయి. ఈ విజయం మా అందరి బాధ్యతను మరింత పెంచింది. ఈ సందర్భంగా శిబ్‌సాగర్‌ జనాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమ, ఆప్యాయత వల్లనే అఖిల్‌ గొగోయ్‌ విజయం సాధించారు. అసోం చరిత్రలో ఇది చారిత్రాత్మక విజయం. ఎందుకంటే ఇంతవరకు జైలుకెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో విజయం సాధించిన ఘటనలు ఎక్కడా లేవు’’ అన్నారు. 

ఏవరీ అఖిల్‌ గొగోయ్‌...
గువాహటిలోని కాటన్ కాలేజి నుంచి పట్టభద్రుడైన 46 ఏళ్ల గొగోయ్.. రాజకీయాలకు కొత్తేం కాదు. 1995-96 మధ్య ఆయన కాటన్ కాలేజి స్టూడెంట్ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనేక ఏళ్లుగా అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కేఎంఎస్ఎస్) వేదికగా అనేక పోరాటాలకు నేతృత్వం వహించారు. 2019 డిసెంబర్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన రాష్ట్ర వ్యాప్త ఉద్యమం హింసకు దారితీయడంతో.. దీని వెనుక గొగోయ్ హస్తం ఉందంటూ ఎన్ఐఏ అధికారులు తనను అరెస్ట్ చేశారు. 

చదవండి: అస్సాంలో కమలదళానికి కఠిన పరీక్ష

మరిన్ని వార్తలు