‘బీజేపీ గాంధేయవాదిని ప్రయోగిస్తోంది’.. అన్నా హజారే లేఖపై కేజ్రీవాల్‌ ఫైర్‌

30 Aug, 2022 20:09 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విధానంపై విమర్శలు గుప్పిస్తూ ప్రముఖ గాంధేయవాది, ఉద్యమకారుడు అన్నా హజారే బహిరంగ లేఖ రాయటంపై కౌంటర్‌ ఇచ్చారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. బీజేపీ అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ గురిపెడుతోందన్నారు. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే.. సీబీఐ మాత్రం ఎలాంటి స్కాం జరగలేదని నిరూపించిందన్నారు.

‘లిక్కర్‌ పాలసీలో స్కాం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే.. సీబీఐ ఎలాంటి కుంభకోణం జరగలేదని తేల్చింది. వారి మాటలను ప్రజలు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అన్నా హజారే భుజాలపై నుంచి తుపాకీ ఎక్కుపెడుతోంది. అన్నా హజారేను బీజేపీ ఉపయోగించినట్లు ప్రముఖ వ్యక్తులను ఉపయోగించటం రాజకీయాల్లో సాధారణమే.’ అని ఆరోపించారు కేజ్రీవాల్‌.

ఢిల్లీ లిక్కర్‌ పాలసీ విధానంపై వివాదం తలెత్తిన క్రమంలో తన శిష్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు అన్నాహజారే. ముఖ్యమంత్రి అయ్యాక అధికారం అనే మత్తుతో విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోందంటూ విమర్శలు గుప్పించారు. ఒక పెద్ద ఉద్యమం నుంచి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదని, అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో చిక్కుకున్నారని దుయ్యబట్టారు అన్నా హజారే.

ఇదీ చదవండి: అధికారంతో విషమెక్కావ్‌.. ఆదర్శాలను తుంగలో తొక్కావ్‌‌!.. ఆప్‌ సర్కార్‌పై అన్నా హజారే ఆగ్రహం

మరిన్ని వార్తలు