అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు

5 Mar, 2021 15:43 IST|Sakshi

గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో సీఎంతో పాటు మరో ముగ్గురు మినిస్టర్ల పేర్లు

తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు భారీ షాక్‌ తగిలింది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసుతో పినిరయి విజయన్‌కు చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్న సురేష్‌ కస్టమ్స్‌ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గోల్డ్‌, డాలర్‌ స్మగ్లింగ్‌ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ పాత్ర ఎంతో ఉందని.. ఆయన స్వయంగా కాన్సులేట్‌ జనరల్‌తో మాట్లాడారని ఆమె కస్టమ్స్‌ అధికారులకు తెలిపారు. విజయన్‌తో పాటు మరో ముగ్గురు కేబినెట్‌ మంత్రులపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయాలను కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు కేరళ హై కోర్టుకు తెలిపారు. 

ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘విజయన్‌కు అరబిక్‌ భాష రాదు. అందువల్ల స్వప్న సురేష్‌ ముఖ్యమంత్రికి, కాన్సులేట్‌ జనరల్‌కి మధ్య మధ్యవర్తిగా వ్యవహించారు. ఈ డీల్‌లో సీఎం, మిగతా ముగ్గురు మంత్రులు కోట్ల రూపాయలను కమిషన్‌గా పొందినట్లు స్వప్న సురేష్‌ తెలిపారు’’ అన్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్‌ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘‘గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’’ అన్నారు. 

చదవండి: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసు: సీఎం రాజీనామా చేయాలి

మరిన్ని వార్తలు