వ్యూహాత్మకంగానే.. తప్పు మీద తప్పులు

19 Oct, 2023 15:53 IST|Sakshi

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు అయినప్పటి నుంచి ఆ పార్టీ వ్యూహాత్మక తప్పిదాలు చేస్తోంది. ఒక తప్పును కవర్ చేయడానికి మరిన్ని తప్పులు చేస్తారన్నట్లుగా టీడీపీ నేతలు పూర్తి అయోమయావస్థలో పలు బ్లండర్స్‌కు పాల్పడుతున్నట్లుగా ఉంది. చంద్రబాబు గత నెల తొమ్మిదో తేదీన అరెస్టు అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ చేసిన తప్పులేమిటో చూద్దాం.

చంద్రబాబును ఉదయం ఆరున్నర గంటల సమయంలో అరెస్టు చేస్తే.. కోర్టులో మాత్రం ఆయన తరపు లాయర్లు అర్దరాత్రి అరెస్టు చేసినట్లు చెప్పడానికి యత్నించారు. తమ కక్షీదారుకు మద్దతుగా లాయర్లు వాదిస్తారు. కానీ, అందరికి తెలిసిన సత్యాన్ని కూడా అందుకు భిన్నంగా చెబితే ప్రజలలో పలచన అవుతామన్న సంగతి అర్థం చేసుకోవాలి. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆయనను హెలికాఫ్టర్‌లో తరలించాలని సీఐడీ భావించింది. కానీ, అందుకు చంద్రబాబు నిరాకరించారు. దాంతో ఆయన కోరుకున్న విధంగానే రోడ్డు మార్గంలో.. అదీ ఆయన వాహనంలోనే తరలించారు. అయినా టీడీపీ నేతలు, ఆయనకు మద్దతు ఇచ్చే ఇతర పార్టీల నేతలు చంద్రబాబును ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని విమర్శలు చేశారు.

✍️తప్పు చేసింది చంద్రబాబు అయితే ప్రభుత్వం పై నింద మోపడం ఏమిటి? ప్రజలకు ఈ విషయం కూడా తేటతెల్లమైంది. ఆయన విజయవాడ వస్తుంటే ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చి సానుభూతి చెబుతారని ఆశించారు. కానీ ఒకటి,రెండు చోట్ల మినహాయించి అలా జరగలేదు. దాంతో ఆయన ప్లాన్ బెడిసినట్లయింది. కాకపోతే ఢిల్లీ నుంచి లాయర్లను తెప్పించుకోవడానికి కొంత సమయం కలిసి వచ్చింది. అలాగే విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై తరలించినప్పుడు కూడా స్పందన కనిపించలేదు. ఆయనకు మద్దతు ఇచ్చే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి మీడియా సంస్థలు మాత్రం శరభ..శరభ అంటూ పూనకం వచ్చినట్లు ఊగిపోయాయి. ఇలాంటి మీడియాను నమ్ముకునే చంద్రబాబు నష్టపోయారు. ఎందుకంటే వారు రాసింది ప్రతిదీ నిజమని ఆయన భ్రమపడ్డారు. అందుకే మాట్లాడితే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి నువ్వేం పీకావ్.. అంటూ సవాల్ చేసేవారు. తీరా అవినీతి కేసుల్లో అరెస్టు చేసిన తర్వాత కక్ష అంటూ ప్రచారం మొదలు పెట్టారు.

✍️చంద్రబాబు అరెస్టు అయిన వెంటనే బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నించకుండా క్వాష్ పిటిషన్‌లు వేసి ఆయన తరపు లాయర్లు కాలం గడిపినట్లు అనిపిస్తుంది. దాంతో ఆయన ఐదువారాలు దాటినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రి అరెస్టు తర్వాత హడావుడిగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లడం పలు సందేహాలకు తావిచ్చింది. పైకి డాంబికంగా మాట్లాడుతున్నా తాను కూడా అరెస్టు అవుతానేమో అనే భయంతోనే ఢిల్లీలోనే బస చేశారన్న భావన ప్రజలలోకి వెళ్లింది. ఇది కూడా టీడీపీకి నెగిటివ్ అయింది. చంద్రబాబు జైలులో ఉంటే సానుభూతి వస్తుందనుకుంటే అది కూడా పెద్దగా కనిపించకపోవడం తో రకరకాల నిరసనలు అంటూ కథ నడిపారు.

✍️డప్పులు కొట్టడం, విజిల్స్ ఊదడం, కంచాలు కొట్డడం వంటివి చూసేవారికే ఎబ్బెట్టుగా మారాయి. ఏదో సంబరాలు చేసుకున్నట్లు ఉంది.. తప్ప బాధపడుతున్నట్లు లేదన్న వ్యాఖ్యలు వచ్చాయి. తదుపరి లైట్లు తీసేయాలని ఒకరోజు, చేతులకు సంకేళ్లు వేసుకున్నట్లు ఇంకో రోజు కార్యక్రమాలు చేశారు. కాని అవన్నీ ప్రజలలోకి వెళ్లలేకపోయాయి. టీడీపీ కార్యకర్తలు అరవై, డెబ్బై లక్షల మంది ఉంటారని చంద్రబాబు చెబుతుంటారు. అందులో పది శాతం మంది ఆ నిరసనలలో పాల్గొన్నా చాలా ప్రభావం పడేదని అంటారు. నిజానికి ఈ నిరసనలు ఎవరిమీద చూపుతున్నారు?.

చంద్రబాబును అవినీతి కేసులో అరెస్టు చేసింది సీఐడీ అనేది నిజమే. కాని వారు పెట్టిన ప్రాధమిక ఆధారాలను చూశాకే కోర్టు ఆయనను రిమాండ్‌కు పంపిందన్న సంగతిని మర్చిపోయి ఈ నిరసనలు చేయడం కూడా విమర్శలకు గురి అయింది. ఇక రిమాండ్‌కు పంపిన గౌరవ జడ్జి మీద ఇష్టం వచ్చినట్లు పోస్టింగ్లు పెట్టడం నీచం అనే భావన ఏర్పడింది.

✍️చంద్రబాబు చాలా ఆరోగ్యంగా ఉన్నారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. సడన్‌గా ఆయనకు ఏదో జరిగిపోతోందని లోకేష్ తదితరులు అనడం కూడా ఎవరికి అర్ధం కాలేదు. మరోవైపు తమ హెరిటేజ్ కంపెనీలో రెండు శాతం షేర్లు అమ్మితే రూ. 400 కోట్లు వస్తాయని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెప్పడం కొత్త వివాదం అయింది. లోకేష్ చాలా రోజులు ఢిల్లీలో ఉన్నప్పటికీ బీజేపీ పెద్దలు ఎవరూ కలవడానికి ఆసక్తి చూపలేదు. ఎలాగోలా హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయనే తనను పిలిపించుకున్నారని లోకేష్ చెప్పడం అంత తెలివైన చర్యగా ఎవరూ చూడడం లేదు. తద్వారా అమిత్ షానే అవమానించారని కొందరు వ్యాఖ్యానించారు. భేటీ అయిన తర్వాత ఒక సందర్భంలో టీడీపీ అటు ఎన్డీయేకి, ఇటు ఇండియా కూటమికి సమదూరంలో ఉంటుందని అనడం కూడా బీజేపీ నేతలకు నచ్చలేదట. దాంతో టీడీపీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదని బీజేపీ పెద్దలు భావించారట. చంద్రబాబు ఆరోగ్యంపై రకరకాల వదంతులు టీడీపీవారే లేవదీయడం, ప్రజలలో అనుమానాలు కలిగేలా కుటుంబ సభ్యులే మాట్లాడడం కూడా ఆశ్చర్యం కలిగించింది. నిజంగానే చంద్రబాబు ఆరోగ్యం బాగోపోతే ఎందుకు ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోర్టులో పిటిషన్ వేయలేదో అర్ధం కాదు. కేవలం ఏసీ పెట్టాలని మాత్రమే పిటిషన్ వేయడం కోర్టువారు అంగీకరించడం జరిగిపోయాయి. మరి అలాంటప్పుడు చంద్రబాబు ఆరోగ్యం నిజంగా దెబ్బతిన్నదా?లేదా? అనే చర్చకు ఆస్కారం ఇచ్చారు.

చంద్రబాబు ఎండల్లో, దుమ్ము, ధూళి మధ్య చెమట్లు కక్కుతూ జనం మధ్యలో తిరుగుతున్నప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ జైలులో నీడపట్టున ఉన్నప్పుడు అంత సీరియస్‌గా ఆరోగ్యం దెబ్బతింటుందా? అనే అనుమానం కూడా కొందరు వ్యక్తం వ్యక్తం చేశారు. అయినప్పటికీ టీడీపీ వాళ్లు కోర్టులో ఆయనను ఆస్పత్రిలో చేర్చాలని కోరకపోవడంతో జనంలో సందేహాలు వచ్చాయి.

✍️ఏపీలో పెద్దగా నిరసనలు లేకపోయినా, హైదరాబాద్లో ఒక సామాజికవర్గం వారే నిరసనలకు దిగడం ద్వారా చంద్రబాబును చివరికి ఒక కుల నాయకుడుగా మార్చివేశారనే వ్యాఖ్యలు కూడా వచ్చాయి. తెలంగాణ ఎన్నికలకు ముడిపెట్టిన తీరు కూడా అంత తెలివిగా కనిపించదు. ఇలా పలు రకాలుగా టీడీపీ నేతలు అనండి.. చంద్రబాబు కుటుంబ సభ్యులనండి.. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అన్నింటికీ మించి చంద్రబాబు పీఎస్‌ శ్రీనివాస్ అమెరికా వెళ్లిపోవడం, సుప్రీంకోర్టు వరకు కేవలం 17ఏ ద్వారా గవర్నర్ అనుమతి లేనందునే కేసు కొట్టేయాలని లాయర్లు కోరడం వంటివాటి ద్వారా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని, టీడీపీ ఖాతాలోకి రూ. 27కోట్లు వచ్చే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడే పరిస్థితిని ఆ పార్టీ నేతలే తెచ్చుకున్నారనే విశ్లేషణలు వస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయి లాయర్ గా పేరొందిన హరీష్ సాల్వే చివరికి తన వాదనలో చంద్రబాబు వయసు ప్రస్తావించి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనడం, అవసరమైతే మళ్లీ జైలులో పెట్టవచ్చని చెప్పడంతో టీడీపీ ఎంత బలహీనంగా ఉందన్న విషయం అర్దం అయిపోయింది.


:::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు