KSR: జనంపై ప్రేమతో కాదు..జగన్‌పై ద్వేషంతోనే జనసేన

25 Jul, 2022 09:05 IST|Sakshi

జనసేన అధినేత ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ పెడుతున్న రకరకాల పంచాయతీలు చర్చనీయాంశం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తన పార్టీ వారి కోసం కన్నా, తెలుగుదేశంలో  ఉన్నవారి కోసం ఎక్కువ బాధపడుతున్నారు.  నిజానికి పవన్ కు ఏపీలో ఉన్న బలం చాలా అల్పమే అయినా, ఒక వర్గం  మీడియాలో  వస్తున్న వార్తల కవరేజీతో పాటు, సినీ గ్లామర్ కు ఉండే అభిమానుల కారణంగా అవకాశం లభిస్తోంది. గత శాసనసభ ఎన్నికలలో జనసేనకు వచ్చిన ఓట్లు ఏడు శాతం లోపే. కాకపోతే ఆయన ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తెలుగుదేశం పార్టీ, టీడీపీ మీడియా మద్దతు పొందడం ద్వారా ప్రచారం కూడా విస్తారంగానే వస్తోంది. అందువల్లే ఆయన ప్రతి వారాంతంలో ఏపీలో పర్యటిస్తూ ఏదో ఒక పంచాయతీ పెడుతూ తానేదో సాధిస్తున్నట్లు సంతోషపడుతున్నారు. ఆ క్రమంలో ఆయన అచ్చం టీడీపీ అధినాయకత్వం మాదిరే అసత్యాలు, అర్ధం పర్దం లేని వ్యాఖ్యలు చేస్తున్నానన్న స్పృహను కోల్పోతున్నారు. 

ఇటీవల పవన్ కళ్యాణ్  మండపేట, భీమవరంలలో జరిపిన కార్యక్రమాలలో చేసిన ప్రసంగాలను పరిశీలిస్తే ఈ విషయాలు అర్ధం అవుతాయి. వాటిని చూస్తే తమ పార్టీ భవిష్యత్తు ఏమి అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఆయన ఉన్నట్లు తెలుసుకోవడం కష్టం కాదు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పడం లేదు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములలో ఉన్న లోటుపాట్లు వివరించడం లేదు. ఎంత సేపు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాటలోనే మాట్లాడుతూ  ఈ ప్రభుత్వం అరాచకంగా ఉందని అంటారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి వస్తే అధోగతి అని ..ఇలా వింత వ్యాఖ్యలు చేస్తున్నారు. 

ప్రతిపక్షం అన్నాక విమర్శలు చేయవచ్చు. కాని అవి అర్దవంతంగా లేకపోతే వారికే నష్టం .ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న ద్వేషంతో ఏది పడితే అది మాట్లాడితే జనం ఎలా గౌరవిస్తారు? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటివారు చేస్తున్న విమర్శలను పరిశీలిస్తే,  ఏపీలో జగన్ ఎంత బలంగా ఉన్నారన్నది, ప్రజలలో ఎలా ఆదరణ పెంచుకుంటున్నారన్నది తెలిసిపోతుంది. మరోసారి కూడా జనసేన పూర్తి స్థాయిలో పరాజయం చెందితే తమ పార్టీ పరిస్థితి అధోగతి పాలు అవుతుందన్న భయాందోళన ఆయన ప్రసంగాలలో అంతర్లీనంగా ద్యోతకం అవుతుంది. కులాల మధ్య చిచ్చు రేపాలన్న ఆయన తాపత్రయం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి తాను అసలు కాపులకే పరిమితం అయిన వ్యక్తిని కానంటారు. మరోసారి కాపులు అయినా తనకు ఓట్లు వేయరా అని అంటారు. ఇంకోసారి అసలు కులాలు ఏమిటని, వేరొకసారి ఎపిలో కనీసం కుల భావన లేకపోతే ఎలా అని చిత్ర,విచిత్రంగా మాట్లాడుతుంటారు.

కొంతమంది అమాయకులు ఆయన మాటలకు చప్పట్లు కొట్టవచ్చు. కానీ కాస్త బుర్రపెట్టి ఆలోచించేవారికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇంత పిచ్చిగా ఉంటాయా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఉదాహరణకు ఆయన ఏమి అంటున్నారో కొన్ని అంశాలు చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ రెడ్లకు కూడా అన్యాయం చేస్తున్నారట. కొందరిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారట. మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి లను వేదిస్తున్నారని పవన్ అంటున్నారు. ఈ విషయం చెబుతున్నప్పుడు అది ఏ విధంగానో అన్న విషయం చెప్పాలి కదా..అలాకాకుండా జనరల్ గా మాట్లాడి ప్రజలను మోసం చేయాలన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. జేసీ దివాకరరెడ్డిపై వచ్చిన ఆరోపణ ఏమిటి? సిమెంట్ ప్యాక్టరీ పెడతానని చెప్పి గనులను తీసుకున్న ఆయన దానిని స్తాపించకుండానే గనులను అక్రమంగా తవ్వుతున్నారన్నది అబియోగం. అది కూడా నిబంధనలను పట్టించుకోకుండా చేస్తున్నారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఇందులో కక్ష సాధింపు అంటే, ఎలాంటి అక్రమాలు  జరిగినా వదలివేయాలని ఆయన చెబుతున్నారా? ఒకవేళ ప్రభుత్వం నిజంగానే అన్యాయంగా కేసులు పెడితే తప్పే. అవి ఎలా తప్పుడు కేసులో పవన్ చెప్పి ఉండాలి కదా? అలా చేయలేకపోయారు. 

ఇక జేసీ ప్రభాకరరెడ్డిపై వచ్చిన అభియోగం ఏమిటి? ఆయన సంస్థ 150  బస్ లను అక్రమంగా ఎక్కడో వేరే రాష్ట్రంలో రిజిస్టర్ చేయించారన్నది ఆరోపణ. దీనిపై అదికారులు క్షుణ్ణంగా విచారణ చేసి ఆయన అక్రమ బస్‌లను స్వాధీనం చేసుకుని కేసు పెట్టారు. మరి అది తప్పు ఎలా అవుతుంది. జేసీ చేసింది తప్పుకాదని పవన్ ఎలా అంటారు.ఇదేనా ఆయనకు ఉన్న పరిజ్ఞానం. మరో కేసులో ఒక ఎస్సీ పోలీస్ అధికారిపై జేసీ దురుసుగా ప్రవర్తించారు. దానిని కూడా పవన్ సమర్ధిస్తారా? ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. వైసీపీ అసమ్మతి ఎమ్.పి రఘురామకృష్ణరాజు ను ప్రభుత్వం వేధిస్తోందట. ఇది మొత్తం క్షత్రియులపై జరుగుతున్న దాడి అట. అంటే మొత్తం క్షత్రియులందరికి రఘురాజు ప్రాతినిద్యం వహిస్తున్నారా? రఘురాజుపై వచ్చిన కేసు ఏమిటి? ఆయన టీవీలలో కూర్చుని కులాలు, మతాలు రెచ్చగొడుతూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచుతున్నారని. అలా ఆయన చేయలేదని పవన్ అనదలిస్తే సోదాహరణంగా చెప్పి ఉండాల్సింది. రెడ్లను ఉద్దేశించి రఘురాజు ఎంత ఘోరమైన వ్యాఖ్యలు చేసింది పవన్‌కు తెలియదా? అసలు ఒక పార్టీ టిక్కెట్ పై ఎన్నికై, ఆ పార్టీపైనే తిరుగుబాటు చేసి,నానా మాటలు అనడం సమర్ధనీయం అవుతుందా? వైసీపీ ఇచ్చిన ఎంపీ పదవికి ఎందుకు రాజీనామా చేయడం లేదని పవన్ అడగవచ్చు కదా? ఎంపీగా ఎన్నికైన ఆయన రెండేళ్ళుగా అసలు తన నరసాపురం నియోజకవర్గంలోకే ఎందుకు వెళ్లలేకపోతున్నారు. 

వాస్తవంగా  నియోజకవర్గంలో ప్రజల మద్దతు విశేషంగా ఉంటే ఏ ప్రభుత్వం అయినా ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకోగలుగుతుందా? ఒకవేళ అలా తీసుకుంటే ప్రజలలో తీవ్రమైన నిరసన వ్యక్తం అయ్యేది కాదా? ఎంపీని ఆహ్వానించ లేదు కాబట్టి తాను అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభకు రాలేదని చెప్పడం అంటే తాడిచెట్టు ఎందుకు ఎక్కావంటే దూడమేతకు అని  చెప్పినట్లు గా లేదా?అసలు రఘురామరాజు ఏమైనా జనసేన నుంచి ఎన్నికయ్యారా?  పోని అల్లూరి పై పవన్ కు అంత భక్తి ఉంటే, తాను వాగ్దానం చేసిన విధంగా ఆయన విగ్రహ స్థాపనకు ఎందుకు చొరవ చూపలేకపోయారు. కోటి రూపాయల విరాళం ఎందుకు ఇవ్వలేదు. 

తాను భీమవరంలో ఓడిపోయిన తర్వాత మూడేళ్ల వరకు అటు వెళ్లకుండా ఉన్న పవన్ ఇక ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో మళ్లీ అటువైపు చూడడం ఆరంభించారు. పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని అసత్యాలు చూడండి. వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి ఐదువేల మంది మరణించారని ఆయన ఆరోపించారు. ఇది అచ్చంగా చంద్రబాబు చెప్పే కాకి లెక్కల మాదిరిగానే ఉంది కదా!పవన్ కళ్యాణ్ కనీసం ఈ అబద్ధాలు ఆడడంలో అయినా తన సొంత తెలివితేటలు వాడి ఉండవచ్చుకదా? వాస్తవిక లెక్కలు తీసుకుని మాట్లాడితే విలువ ఉండేది కదా!రోడ్లన్ని ఈతకొలనుల మాదిరి కనిపిస్తున్నాయట. ఇందులో ఎంత నిజం ఉందన్నది ప్రజలకు తెలియదని ఆయన అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎక్కడైనా రోడ్లు అక్కడక్కడా పాడై ఉండవచ్చు. వాటిని రిపేరు చేయమని అడగడం తప్పుకాదు. 

కాని ఏపీలో మొత్తం రోడ్లన్నీ గోతులని చెప్పడం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న తాపత్రయం తప్ప మరొకటికాదు. తాజాగా జనసేన అభిమానులు కొందరు ఇష్టం వచ్చినట్లు రోడ్ల అంశానికి సంబంధించి తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్నారు. సత్తెనపల్లి వద్ద అయితే ఇద్దరు జనసేన కార్యకర్తలు శుభ్రంగా ఉన్న రోడ్డును తవ్వి ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి యత్నించిన విషయం చూసిన తర్వాత పవన్ పరువు ఎంతగా దిగజారింది. దీనిని కదా విద్వంసం అనేది.

ఇవన్ని చూస్తే జనససేనకు, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు జనంపై ప్రేమకన్నా, ముఖ్యమంత్రి జగన్ పై ఉన్న విద్వేషమే అధికంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక తన సినిమాలకు ఏదో నష్టం జరిగిందని ఎప్పటి మాదిరే వాపోతున్నారు.అంతే తప్ప తాను సినిమాలో నటించినందుకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ లో కొంత తగ్గించుకుంటానని అనడం లేదు. ప్రజల కోసం దెబ్బలు తింటా.. జైలుకు వెళ్తా ..అంటూ సినిమా డైలాగులు చెబుతున్నారు. వీటివల్ల ఎవరికి ఉపయోగం. నిజంగానే పవన్ కళ్యాణ్ కు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒక ఆరోపణ చేశారు. అది పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. దానిపై ఆయన లేదా, ఆయన తరపున జనసేన నేత మరెవరైనా వివరణో లేదో, ఖండన ఇచ్చి ఉంటే బాగుండేది.పవన్ కళ్యాణ్ జనవాణి పేరుతో ఫిర్యాదులు తీసుకుని ప్రభుత్వ అధికారులకు పంపించడంలో తప్పు లేదు. కాని ఆ సందర్భంలో తప్పుడు ఫిర్యాదులు, ఆరోపణలకు ఆస్కారం ఇస్తే దాని లక్ష్యం దెబ్బతింటుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఏపీలో ఎప్పుడూ ఏదో ఒక పంచాయతీ పెట్టాలని తపిస్తూ రాజకీయాలు సాగిస్తున్నారు. అవి సఫలం అవుతాయా?

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు