Chandrababu: చంద్రబాబు-మానసిక బలహీనతలు

28 Jun, 2022 12:34 IST|Sakshi

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఒక సందర్భంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు గురించి మాట్లాడుతూ.. ఆయనకు వయసు మీద పడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఇందుకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. అంతవరకు ఓకే. కానీ.. ఆ కౌంటర్ లో చెప్పినట్లుగా ఆయన బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారా?.. ఉండడం లేదా? అనే చర్చకు ఆస్కారం ఇస్తున్నారు. ఉత్తరాంద్ర టూర్ లో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను శారీరకంగానే కాక, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నానని  చెప్పారు. తాను ఫిట్‌గా ఉన్నానని చెబితే సరిపోయేది. ఆయన మానసికంగా కూడా ఫర్ ఫెక్ట్‌గా ఉన్నానని అనేసరికి.. అందరికి క్యూరియాసిటీ ఏర్పడింది. 

దానికి తగినట్లుగా చంద్రబాబు చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఏమిటిలా మాట్లాడుతున్నారు? మానసికంగా ఫిట్ గా ఉన్నవారు మాట్లాడవలసిన మాటలేనా? అన్న సందేహం ప్రజలకు వస్తే తప్పు పట్టేది ఏముంటుంది?. దాంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేదా? తమ్ముళ్లు..’ అని వ్యాఖ్యానించి అందరిలో కలకలం సృష్టించారు. అక్కడ ఉన్న ఆయన అభిమానులు కూడా నెత్తి కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనా అన్నది అగ్ర రాజ్యాలైన చైనా, అమెరికాలతో సహా ప్రపంచం అంతా వచ్చింది. అందులో భారతదేశం మినహాయింపేం కాదు. దేశంలో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ దీనికి అతీతం కాదు. కానీ చంద్రబాబు ఏమిటి? ఇలా మాట్లాడుతున్నారంటే.. ఏమి చెబుతాం. బహుశా చంద్రబాబు ఉద్దేశం తాను సీఎంగా ఉండి ఉంటే కరోనా సమస్యను మరింత బాగా హ్యాండిల్ చేసేవాడినన్నది ఆయన ఉద్దేశం కావొచ్చు. 

కానీ, అలా కాకుండా చిత్రంగా తాను సీఎంగా ఉంటే అసలు కరోనా వచ్చేది కాదని అనడం ద్వారా ఆయన మానసికంగా ఫిట్‌గానే ఉన్నారా? అనే సందేహాన్ని ప్రత్యర్ధులు లేవనెత్తడానికి ఒక అవకాశం ఇచ్చారు. కరోనా సమస్య మొదలైన రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక మాట అన్నారు. ఇది మన జీవితంలో ఒక భాగం అవుతోందని, దీనికి పారాసిటమాల్ వేసుకోవడం, తదితర జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అన్నారు. వెంటనే చంద్రబాబు తదితరులు గాత్రం అందుకుని కరోనాను ఇంత తేలికగా తీసుకుంటారా? పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని అంటారా అంటూ ఇంతెత్తున ఎగిరిపడ్డారు. కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ  మొదలు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దాకా ఇదే మాట చెప్పడంతో సీఎం జగన్ మెచ్యూరిటీ ఏమిటో ప్రజలకు తెలిసింది. నిజానికి చంద్రబాబు అంతకన్నా ఎక్కువగా మెచ్యూర్డ్ గా ఉండాలి. అయితే.. జగన్‌ను విమర్శించడమే ఏకసూత్ర కార్యక్రమంగా పెట్టుకుని ఏది పడితే అది మాట్లాడి అభాసుపాలు అవుతున్నారు. ఇంతకంటే ఘోరమైన వ్యాఖ్య ఒకటి ప్రచారంలోకి వచ్చింది. 

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బైజూస్ విద్యా టెక్ సంస్థతో ఒప్పందం చేసుకుంటే దానిని కూడా తప్పు పట్టారు. విద్యార్ధులకు జగన్ జ్యూస్ ఇస్తారా? అని ఆయన అన్నారు. ఏమైనా అర్దం ఉందా? బైజూస్ ఒప్పందంతో ఏవైనా లోపాలు ఉంటే చెప్పవచ్చు. అలాకాకుండా జగన్ జ్యూస్ అనడం పిచ్చి వ్యాఖ్య కాక మరేమంటాం. నిజంగా మానసికంగా ఫిట్‌గా ఉన్నవారు అనవలసిన మాటలేనా ఇవి. ముఖ్యమంత్రి పదవి పోయిందన్న ప్రస్టేషన్, తిరిగి అధికారంలోకి రాలేమోనన్న భయాందోళన, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు ఏమి అవుతుందో తెలియదన్న బెంగ.. ఇవన్నీ కలిసి ఇలా మాట్లాడించి ఉండవచ్చు. 

విద్యారంగంలో జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన అనేక మార్పులు ప్రజలను బాగా ప్రభావితం చేస్తున్నాయి. నాడు -నేడు కింద స్కూళ్ల రూపురేఖలను మార్చడం నుంచి.. అమ్మఒడి తదితర సంక్షేమ పథకాలను ఆయన అమలు చేస్తున్నారు. వీటివల్ల ప్రత్యేకించి పేద వర్గాలలో జగన్ పట్ల అభిమానం పెరుగుతోంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు ఆందోళన చెందుతుండాలి. తెలుగు రాష్ట్రాలలో ఏమి జరిగినా, అదంతా తన ఖాతాలోకి వేసుకోవడం చంద్రబాబుకు  అలవాటే. ఆయన ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం హైదరాబాద్ రాజధానిగా ఉమ్మడి ఎపికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అనేక పరిణామాలు వచ్చాయి. రాష్ట్రం చీలడంతో హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయింది. చంద్రబాబు టైమ్ లో ఒక హైటెక్ సిటీ భవనం నిర్మించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి టైమ్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాని, పలు ఇతర నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున వచ్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వైఎస్ హయాంలోనే పూర్తి అయింది. శంషాబాద్ విమానాశ్రయం, అక్కడకు వెళ్లడానికి ఎక్స్ ప్రెస్ హై వే వంటివి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినవే. ఆ తర్వాత టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక  మెట్రోరైల్ పూర్తి అయింది. పలు వంతెనల నిర్మాణం జరిగింది. 

ఇలా గత రెండు దశాబ్దాలలో హైదరాబాద్ ఎంతగానో అభివృద్ది చెందితే, చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌ను తానే నిర్మించానన్నంతగా , తను లేకపోతే హైదరాబాద్ లేదన్నంతగా బిల్డప్ ఇస్తుంటారు. అది ఒక రకంగా మానసిక బలహీనతగానే భావించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. వాటిలో ఒకటి అమరావతి రాజధాని ప్రాంతంలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని అనడం. అసలు భారతదేశానికి అలా ఒలింపిక్స్ వచ్చే చాన్స్ మరి కొన్ని దశాబ్దాలవరకు ఉండకపోవచ్చు. అలాటిది ఆయన అమరావతిలో 2018లోనే ఒలింపిక్స్ నిర్వహిస్తానని అనడం. ఇది ఒకటి అయితే ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్టే నోబెల్ బహుమతి ఇస్తానని ఆయన అన్నట్లు వార్తలు వచ్చాయి. ఇది ఏమిటో ఎవరికి అర్ధం కాలేదు. అసలు అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని, ఏ దేశం వెళితే ఆ దేశ రాజధాని మాదిరి నిర్మిస్తామని అనడం, ప్రముఖ దర్శకుడు రాజమౌళిని పిలిచి రాజధాని ప్లాన్ చేయాలని అనడం ఇవన్ని ఆయనను నవ్వులపాలు చేశాయి. పోనీ అలా అని ఒక భవనం అయినా ఆయన పూర్తి చేశారా అంటీ అదీ లేదు. కేవలం రెండు తాత్కాలిక భవనాలు పూర్తి చేశారు. 

చంద్రబాబు చేసిన ఇతర ఆశ్చర్యకర వ్యాఖ్యల విషయానికి వెళితే.. బ్రిటిష్ వారితో పోరాడిన పార్టీ తెలుగుదేశం అని ప్రకటించడం. 1983లో పెట్టిన  పార్టీ స్వాతంత్రోద్యమంలో ఎప్పుడు పాల్గొందా అని అందరు ఆలోచించవలసి వచ్చింది. పైగా అప్పుడు ఆయన కాంగ్రెస్ ఐ లోనే ఉండి పార్టీ వ్యవస్థాపకుడైన , తన మామ ఎన్.టి.ఆర్.ను ఓడిస్తానని తొడకొట్టేవారు. సముద్రాన్ని కంట్రోల్ చేస్తామని ఒకసారి అమరావతిలో పది డిగ్రీల సెంటిగ్రేడ్ మేర ఉష్ణోగ్రత్ తగ్గించాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం.. ప్రముఖ ఐటి నిపుణుడు సత్య నాదెళ్ల మైక్రోసాప్ట్ లో చేరడానికి తాను కారణమన్నట్లుగా మాట్లాడడం, తాను కంపెనీల కోసం న్యూయార్కు వీధులలో ఫైళ్లు చంకనేసుకుని తిరిగానని చెప్పడం.. ఇలా ఒకటేమిటి అనేక కామెంట్లు చేసిన తీరు సహజంగానే ఆయన మానసిక పరిస్థితిపై సందేహాలు కలిగేలా చేస్తుంది. అలా అని ఆయనకు ఏదో అయిందని అనజాలం కాని తన సభలకు  హాజరైనవారిని విసిగించేలా గంటల తరబడి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి అపశ్రుతులు దొర్లుతుంటాయి. చంద్రబాబులో ఒక విశిష్టత ఉంది. అదేమిటంటే ఆయన సత్యాసత్యాలతో సంబంధం లేకుండా,నిజానిజాలతో నిమిత్తం లేకుండా ఏదైనా మాట్లాడారు. కొంతకాలం క్రితం మాట్లాడినదానికి, ఇప్పుడు మాట్లాడుతున్నదానికి పొంతన ఉండడం లేదని ఎవరైనా అనుకున్నా, ఆయన దానిని సీరియస్ గా తీసుకోరు. ఇవన్ని మానసిక బలహీనతలా? లేక రాజకీయ వ్యూహమా అంటే ఏమి జవాబు ఇస్తాం. ఎంత వ్యూహం అయినా, చంద్రబాబు పద్దతి ప్రకారం మాట్లాడితే వయసు తగినట్లు హుందాగా వ్యవహరిస్తేఅప్పుడు ఆయన గౌరవం పెరుగుతుంది. అలాకాకపోతే ఆయనకే నష్టం. ఏది ఏమైనా ఈ మానసిక బలహీనత సమస్య మామూలు వయసులో ఉన్నవారి కంటే డెబ్బై ఏళ్లు దాటిన వృద్దులలో మరీ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చంద్రబాబు ఆ దశలో ఉన్నారని అనుకోవచ్చేమో!..


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు