తుస్సుమనిపించిన పవన్‌.. ఎందుకంత వణుకు?

8 Nov, 2023 13:34 IST|Sakshi

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నప్పటికీ, అదే సభలో వక్తగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఘాటైన స్పీచ్ చేస్తారో అని తెలుగు రాష్ట్రాల ప్రజలు, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఎదురు చూశారు. అలాగే బీజేపీ కేడర్ కూడా పవన్ ఏదో ఇరగదీస్తారని ఆశించారు. తీరా చూస్తే ఆయన మొత్తం జావగారిపోయినట్లు మాట్లాడటం అందరిని ఆశ్చర్యపరచింది.

బీజేపీకి ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తారనుకుంటే ఆ పార్టీల ఊసు కాదు కదా.. పేర్లే ఎత్తలేదు. మామూలుగా సినిమా స్టైల్‌లో హవభావాలు ప్రదర్శిస్తూ జనాన్ని రెచ్చగొడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఆకర్షిస్తారని అనుకుంటే  ఆయన అదేమీ చేయకుండానే డల్‌గా తన ప్రసంగం ముగించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆయన విమర్శలు చేయలేదు. కనీసం పేరు కూడా తీయలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆరోపణల వర్షం కురిపిస్తారని ఎదురుచూసిన బీజేపీ, జనసేన వారికి ఆయన గురించి టచ్ చేయలేదు. కేవలం ప్రధాని మోదీని మాత్రం పొగిడి, అదేదో లోక్‌సభ ఎన్నికల ప్రచారం అన్నట్లు వ్యవహరించారు.

తెలంగాణలో బీజేపీ గెలుస్తుందని కానీ, గెలవాలని కానీ కనీసం పిలుపు ఇవ్వలేదు. ఇదంతా చూస్తే ఏపీలో ఆయన ఇంతకాలం చేస్తున్న ఆవేశపూరిత ప్రసంగాలన్నీ ఉత్త బీరాలేనా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ నోటికి వచ్చినట్లు వైఎస్సార్‌సీపీని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దూషిస్తూ చెలరేగిపోతున్నట్లు వ్యవహరించే పవన్ అక్కడ మాత్రం తుస్సుమనిపోవడం గమనించదగిన అంశమే. ప్రధాని మోదీ, బీజేపీ ఇతర  ముఖ్యులు కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించారు. పవన్ కళ్యాణ్ మాత్రం అసలు వాటి జోలికే వెళ్లలేదు. కాకపోతే ఏపీలో సమైక్యవాదిగా మాట్లాడే ఆయన తెలంగాణలో మాత్రం ప్రత్యేక తెలంగాణవాదిగా నటించే యత్నం చేశారు.

ప్రధాని మోదీ సైతం పవన్‌ను పెద్ద సీరియస్‌గా తీసుకున్నట్లు అనిపించలేదు. ఏదో మొక్కుబడిగా ఒకసారి ప్రతి నమస్కారం చేయడం, మరోసారి తన ప్రసంగంలో పవన్ అన్న పేరు ప్రస్తావించడం తప్ప ఇంకెక్కడా పట్టించుకున్నట్లు బహిరంగంగా కనిపించలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై కొన్ని అవినీతి ఆరోపణలు చేయడం, కాంగ్రెస్, బీఆర్ఎస్‌ పార్టీలు ఒకటేనని చెప్పడానికి మోదీ  ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణలో బీజేపీ గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని ఇస్తామని అన్నారు కానీ, అభ్యర్ధి పేరు ప్రకటించలేదు. అదే టైమ్‌లో బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, బండి సంజయ్‌లకు ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనిపించింది. బీసీలకు కేంద్రంలో ఏ విధంగా పథకాలు అమలు చేస్తున్నది, తన మంత్రివర్గంలో బీసీ మంత్రులు ఎంత మంది ఉన్నది తదితర వివరాలు ఇవ్వడానికి ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. 

అలాగే హైదరాబాద్‌లోనే 2014 ఎన్నికలకు ముందు తన సభకు టిక్కెట్ పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుని తనకు ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు. కొన్ని సెంటిమెంట్ డైలాగులు, మరికొన్ని విమర్శలు, ఆరోపణలు చేసిన మోదీ కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారం గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన దాని గురించి మర్చిపోయారా? లేక కావాలనే వదిలివేశారో తెలియదు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అవినీతిలో ఎవరిని వదలిపెట్టం అని మాత్రం అన్నారు. ఈ సభకు జన సమీకరణ బాగానే జరిగినా, బీసీలు ఎంతమేర బీజేపీకి పట్టం కడతారు? తద్వారా ఆ పార్టీ అధికారంలోకి రాగలుగుతుందా? అన్నది ఇంకా చర్చనీయాంశమే.

తెలంగాణకు మోదీ వచ్చినప్పుడు కాస్త ఊపు వచ్చినట్లు కనిపిస్తున్నా, ఆ తర్వాత అది పాలపొంగు మాదిరి తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. పలువురు బీజేపీ ముఖ్యనేతలు కాంగ్రెస్‌లో  చేరిపోవడమే ఇందుకు ఉదాహరణ అవుతుంది. మోదీ సభలో పాల్గొనడం తన అదృష్టమని, ఆయన అంటే చాలా గౌరవమని పవన్ కళ్యాణ్‌ అన్నారు. నిజంగానే మోదీ పట్ల అంత అభిమానం, విశ్వాసం ఉంటే ఆయన 2019 ఎన్నికల సమయంలో మోదీని వ్యతిరేకించి  బీఎస్పీ అధినేత్రి మాయావతి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి, బీఎస్పీతో పాటు, సీపీఐ, సీపీఎంలతో ఎలా పొత్తు పెట్టుకున్నారో తెలియదు. ఏపీ ఎన్నికలలో దారుణ పరాజయం తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని ఎన్డీయేలో చేరారు. అందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సలహా కూడా ఉందని అంటారు. మరి ఇప్పుడు కూడా ఆయన సూచన మేరకే కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేయలేదేమో తెలియదు. 

ఒకప్పుడు  కాంగ్రెస్ నేతల పంచెలు ఊడదీసి కొడతానంటూ గంభీర ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ మరోసారి తన ప్రసంగ కళను ఆ పార్టీపై ప్రయోగిస్తారని చూస్తే ఒక్క మాట అనకపోవడం అక్కడ ఉన్న బీజేపీ  నేతలను ఆశ్చర్యపరచింది. మోదీని పొగడటం వరకు అభ్యంతరం లేదు. కానీ, అసలు లక్ష్యం తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం. అందులో జనసేన కూడ భాగస్వామి అవడం. దానికి అనుగుణంగా కనీసం అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, జనసేన అభ్యర్ధులను గెలిపించాలని కోరకపోవడం గమనించదగ్గ విషయమే. రాసుకు వచ్చిన ప్రసంగంలో ఈ పాయింట్ ఎందుకు పేర్కొనలేదో తెలియదు. ఏపీలో ప్రసంగాలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌పై అవసరం ఉన్నా, లేకున్నా విరుచుకుపడుతూ, పచ్చి అబద్దపు ఆరోపణలు చేసే పవన్ ఇంత కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో సీఎం కేసీఆర్‌పై ఒక్క ఆరోపణ చేయలేదంటే ఆయన పాలన బాగున్నట్లని ఒప్పుకున్నట్లేనా? లేక కేసీఆర్ అన్నా, బీఆర్ఎస్ అన్నా భయపడుతున్నారా?.

కొంతకాలం క్రితం కేసీఆర్ పాలనను పొగడుతూ మాట్లాడారు. అలాగే మంత్రి కేటీఆర్‌ను కూడా మెచ్చుకున్నారు. ఇప్పుడేమో ఆ పార్టీపైన పోరాడాల్సిన పరిస్థితి ఎదురవడంతో ఏమీ తోచక వదలివేశారు. పోనీ అలా అని కాంగ్రెస్‌పై మాట్లాడారా అంటే అదీ లేదు. దాని వల్ల తన మిత్రుడు అనండి, వైఎస్సార్‌సీపీ వారు వ్యాఖ్యానిస్తున్నట్లు దత్తతండ్రి అనండి.. చంద్రబాబుకు శిష్యుడు అయిన రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తే ఆయనకు నష్టం కలుగుతుందని అనుకున్నారేమో తెలియదు. 

ఒకవైపు బీజేపీ, జనసేనల మధ్య  పొత్తు కుదిరినా.. టీడీపీ అధినేత చంద్రబాబుతో తమకు అనుకూలంగా మద్దతు ప్రకటన చేయించలేకపోయిన పవన్, ఈ సభలో ఇలా వ్యవహరించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఏపీలో టీడీపీకి సాయం చేస్తున్న పవన్, తెలంగాణలో తనకు మద్దతు ఇవ్వాలని, కనీసం జనసేన కార్యకర్తల గెలుపునకు ప్రకటన చేయాలని చంద్రబాబును ఎందుకు కోరలేదు?. మరి వీరిద్దరూ హైదరాబాద్‌లో కూర్చుని చర్చించిందేమిటి?ఇలాంటి అనేక ప్రశ్నల మధ్య పవన్.. బీజేపీ సభలో పాల్గొన్నప్పటికీ ఆ పార్టీకి పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పాలి. ఆయన తెలంగాణ జనసేన కార్యకర్తల,  అభిమానుల ఉత్సాహంపై నీరుకార్చినట్లు అనిపించింది. పవన్ మరీ ఇంత పిరికివాడా? అన్న సంశయం ఎవరికైనా వస్తే దానికి ఏమి సమాధానం చెబుతాం?.


కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు