‘కుప్పంలో సత్తా చూపిస్తాం.. రాజీనామా చెయ్యి’.. చంద్రబాబుకు మంత్రి నాగార్జున సవాల్‌

12 Jul, 2022 12:05 IST|Sakshi

మీరైనా.. మీ కొడుకైనా కుప్పంలో ఓటమి తప్పదు

ప్లీనరీ దెబ్బకు బాబు, ఆయన తాబేదార్లకు మతి తప్పింది

జగన్‌ రథచక్రాల కింద బాబు నలిగిపోతారు

కష్టాల్లో ఉన్నప్పుడే జగన్‌కు ప్రజలు అండగా నిలిచారు

ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్‌ను అస్సలు వదులుకోరు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో జన ప్రభంజనాన్ని చూసిన చంద్రబాబు, ఆయన తాబేదార్లకు మతి తప్పిందని, అందుకే అవాకులు చవాకులు పేలుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. ఈసారి కుప్పంతో సహా 175 స్థానాల్లోనూ ఓడిపోతారనే విషయం వారికి అర్థమైందని అన్నారు. 

జగన్‌ జన ప్రభంజన రథ చక్రాల కింద చంద్రబాబు, ఆయన అనుయాయులు నలిగిపోవడం ఖాయమన్నారు. ఇప్పటికీ టీడీపీకి గెలుస్తామనే నమ్మకం ఉంటే కుప్పం ఎమ్మెల్యే సీటుకు చంద్రబాబు రాజీనామా చేసి వస్తే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని సవాల్‌ విసిరారు. కుప్పంలో మీరైనా, మీ కొడుకైనా సరే మా సత్తా చూపిస్తామన్నారు. 

మంత్రి నాగార్జున సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒక తల్లిగా వైఎస్‌ విజయమ్మ సీఎం వైఎస్‌ జగన్‌ ఉజ్వల భవిష్యత్తుపై మాట్లాడిన మాటలను కూడా ఎల్లో గ్యాంగ్‌ వక్రీకరిస్తోందని చెప్పారు.14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏం చేశారని ప్రజలు మళ్లీ ఆదరిస్తారని ప్రశ్నించారు. 

ఆయన మార్కు పథకం ఒక్కటైనా చెప్పగలరా అని నిలదీశారు. ఎన్టీఆర్‌ 2 రుపాయలకు కిలో బియ్యం పథకాన్ని పెడితే, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వంటి ఎన్నో గొప్ప పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసా, అమ్మఒడి, విద్యా కానుక, విద్యా దీవెన లాంటి లెక్కలేనన్ని పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. 

కష్టాల్లో ఉన్నప్పుడే వైఎస్‌ జగన్‌ను ఆదరించిన ప్రజలు ఆయనకు కంచుకోటలా అండగా నిలిచారన్నారు. ఇప్పుడు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్‌ను అస్సలు వదులుకోరని చెప్పారు. చంద్రబాబు, ఆయన తాబేదార్లు ఎన్ని వేషాలేసినా, అబద్ధాలు  ప్రచారం చేసినా రాబోయే ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సత్తా చూపిస్తారన్నారు. 

మళ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసిన చంద్రబాబును ఈసారి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని స్పష్టం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ స్థాయికి దిగజారి మాట్లాడలేమని ఓ ప్రశ్నకు సమాధానంగా నాగార్జున చెప్పారు.

మరిన్ని వార్తలు