సిగ్గు లేకుండా నీతులా?

2 Oct, 2020 07:28 IST|Sakshi

యనమలపై మంత్రి కన్నబాబు మండిపాటు

రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది

సాక్షి, అమరావతి: రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీలను ముఖ్యమంత్రికి ముడిపెట్టిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడికి చిన్న మెదడు చితికినట్లుందని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. కాకినాడ సెజ్‌లో జీఎంఆర్, అరబిందో కంపెనీల మధ్య షేర్ల విక్రయాన్ని రాజకీయం చేస్తూ యనమల చేసిన ప్రకటనపై కన్నబాబు మండిపడ్డారు.

గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ‘అరబిందో కంపెనీ రైతుల నుంచి భూములను లాక్కోలేదు. జీఎంఆర్‌ నుంచి కొనుగోలు చేసింది. జీఎంఆర్‌ రైతుల నుంచి భూములను తీసుకున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది. మరి అప్పుడు మీరేం చేశారు? మీ హయాంలోనే ఇదంతా జరిగింది’ అని పేర్కొన్నారు.  కాకినాడలో సెజ్‌కు శ్రీకారం చుట్టి ఇవాళ నీతులు వల్లించడం యనమలకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్‌ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.  (లక్షన్నర మందికి 3 లక్షల ఎకరాలు)

కంపెనీలు తమ వాటాలను విక్రయించడం అతి సహజం. ఒకవేళ అదే తప్పయితే హెరిటేజ్‌ కంపెనీ షేర్లను ఫ్యూచర్‌ గ్రూపునకు ఎందుకు అమ్మారు?
కాకినాడ సెజ్‌ వ్యవహారంలో జీఎంఆర్‌కే లాభం చేకూర్చాలనుకుంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఇచ్చిన ఎంతో విలువైన కమర్షియల్‌ భూముల్లో వేల కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఎందుకు వెనక్కుతీసుకుంటారు? మీకు ఆమాత్రం తెలియదా?
మ్యాట్రిక్స్‌ ప్రసాద్‌ మీ పార్టీ వారితో కలిసి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తే మంచి పారిశ్రామికవేత్తా? అదే ప్రసాద్‌ సాక్షిలోనో, మీకు నచ్చని మరోచోటో పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తే చెడ్డ పారిశ్రామికవేత్తగా చిత్రీకరిస్తారా?
సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో కాకినాడ వచ్చినప్పుడు సెజ్‌ రైతులకు ఇచ్చిన హామీ మేరకు కమిటీని నియమించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఆ దిశగా మేం కృషి చేస్తుంటే మేమేదో కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నట్లు విమర్శలా?
మీ హయాంలో 600 ఎకరాల్లో దివీస్‌ హేచరీస్‌ ఏర్పాటు యత్నాలపై ప్రజలు తిరగబడ్డ విషయాన్ని మరిచారా? 
చంద్రబాబు హయాంలో దేశవ్యాప్తంగా 82 ప్రభుత్వ ఆస్తులను అమ్మితేఅందులో 52 ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని మరచిపోవొద్దు. కాకినాడ నడిబొడ్డున ఉన్న గోదావరి ఫెర్టిలైజర్స్‌ను విక్రయించిన ఘనత మీదే.  

మరిన్ని వార్తలు