‘చంద్రబాబు తోడు లేకుండా పవన్‌ రాజకీయం చేయలేరు’

2 Oct, 2021 16:56 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: శ్రమదానం పేరుతో పవన్‌ కల్యాణ్‌ పబ్లిసిటీ స్టంట్‌ చేశారని, ఈ తరహా శ్రమదానం పవన్‌ ఒక్కరే చేయగలరేమో అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీపై యుద్ధం ప్రకటించానని పవన్‌ చెబుతున్నారని, ఏ కారణంతో ప్రభుత్వంపై యుద్దం చేస్తున్నారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కోవిడ్‌ సమయంలో పేదలను ఆదుకున్నందుకు యుద్దం చేయాలా? అని నిలదీశారు.

ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్‌ మీడియం పెట్టింనందుకు యుద్దం చేయాలా? అని మండిడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ పేదరికంపై యుద్ధం ప్రకటించారని తెలిపారు. అందుకే సీఎం వైఎస్‌ జగన్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని పేర్కొన్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే అందుకు నిదర్శనం అన్నారు.  సీఎం వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర ప్రజలు వెన్నుదన్నుగా ఉన్నారని తెలిపారు. పవన్‌ కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో కులాన్ని ఎజెండా చేస్తున్నామని ప్రకటించినట్టున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తోడు లేకుండా పవన్‌ రాజకీయం చేయలేరని దుయ్యబట్టారు. రోడ్లు పూడుస్తామని చెప్పి కుల రాజకీయాలు చేశారని ధ్వజమెత్తారు.

అంతర్వేదీ ఘటనపై 24 గంటల్లోనే సీబీఐ విచారణ కోరామని తెలిపారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై పవన్‌కు నమ్మకం లేదని అన్నారు. అందుకే ఉగ్రవాదులు మాట్లాడే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. అతను కులాలు చూస్తున్నారని, తాము సంక్షేమం చూస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో కులాల మధ్య సామరస్యత ఉందని, చిన్న చిన్న కులాలను కూడా గుర్తించి న్యాయం చేస్తున్నామని అన్నారు. కుల-మతాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. కుల రాజకీయం చేసినవాళ్లు ఇంతవరకూ విజయం సాధించలేదని అన్నారు. పవన్‌ గోతులు పూడ్చడం కాదు.. గోతులు తీస్తున్నారని మండిపడ్డారు.  
 

మరిన్ని వార్తలు