‘ఉక్కు’ పిడికిలి

6 Feb, 2021 04:57 IST|Sakshi
స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ఉద్యోగ సంఘాల భారీ బైక్‌ ర్యాలీ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిరసిస్తూ రోడ్డెక్కిన ఉద్యోగ, కార్మిక సంఘాలు

మద్దతు పలికిన వైఎస్సార్‌సీపీ నేతలు

కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌

అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. వీరికి స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు మద్దతుగా నిలిచారు. అందరూ కలిసి విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించి.. తమ ఆందోళనను చాటిచెప్పారు. ఉద్యమకారుల త్యాగాలను వృథా కానివ్వబోమని, ఎట్టి పరిస్థితిలోనూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కానివ్వబోమని ప్రతినబూనారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ నేతలతో పాటు వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్, సీఐటీయూ, ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ సహా 16 కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీ నేతలు శుక్రవారం నగరంలో భారీ ర్యాలీ చేశారు.

ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని నినదించారు. లక్షలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తున్న ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ పరం కానివ్వబోమని స్పష్టం చేశారు. వేలాది ఎకరాల భూమిని రైతులు త్యాగం చేసి స్టీల్‌ ప్లాంట్‌కు అందిస్తే.. దాన్ని పోస్కోకు కట్టబెట్టాలని ప్రయత్నించడం దారుణమంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనిపక్షంలో.. అవసరమైతే రాజీనామాకైనా సిద్ధమేనని ప్రకటించారు. స్టీల్‌ప్లాంట్‌ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పార్లమెంట్‌లో స్టీల్‌ప్లాంట్‌ అంశంపై గళమెత్తుతామన్నారు. ఇప్పటికే స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయొద్దని కోరుతూ ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖలు రాసినట్లు చెప్పారు. ఆందోళనలో అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీవీ సత్యవతి, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్మిక సంఘ నాయకుడు మంత్రి రాజశేఖర్‌తో పాటు కార్మిక సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు