ఎన్నికల హామీలపై... మధ్యప్రదేశ్‌లో నేతల మాటల యుద్ధం

15 Oct, 2023 06:39 IST|Sakshi

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ వాద్రా, పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ రాష్ట్రంలో సంక్షేమ పథకాల హామీలపై పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. ఉచిత విద్య, విద్యార్థులకు నగదు పురస్కారాలు వంటి కాంగ్రెస్, ప్రియాంకా గాంధీ ఇచి్చన ఎన్నికల హామీలపై సీఎం చౌహాన్‌ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో గాంధీ కుటుంబం ప్రతి ఒక్కరినీ మోసం చేసింది.

తాజాగా గాంధీ కుటుంబాన్ని సైతం పీసీసీ చీఫ్‌ కమల్‌నాథ్‌ మోసం చేస్తున్నారు. తప్పుడు హామీలిచ్చేలా వారిపై ఒత్తిడి తెస్తున్నారు’అని ఆరోపణలు చేశారు. మాండ్లాలో ఈ నెల 12న జరిగిన ర్యాలీలో ప్రియాంకా గాంధీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందజేస్తామని ప్రకటించడం ఆ తర్వాత దానిని పలు మార్లు మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. సీఎం విమర్శలపై కమల్‌నాథ్‌ తీవ్రంగా స్పందించారు. దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై సీఎం చౌహాన్‌ అనుచిత భాషను వాడారని ఆరోపించారు.

తమ పార్టీ తప్పుడు వాగ్దానాలు చేయదని స్పష్టం చేశారు. సీఎం చౌహాన్‌ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రియాంకా గాంధీ సైతం విమర్శలు చేశారు. భారతీయ జనతా పార్టీలో మాదిరిగా తమ పారీ్టలో నియంతృత్వానికి చోటులేదన్నారు. కమల్‌నాథ్‌ సారథ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలను ఎందుకు నిలిపివేశారని సీఎం చౌహాన్‌ను ఆమె ప్రశ్నించారు.

తమ పార్టీ విద్య, చిన్నారులు, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతుంటే ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం చౌహాన్‌ ఇటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారంటూ ఆమె ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులం, మతం, వర్గంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి విద్యారి్థకి ఉపకారవేతనం అందజేస్తుందని హామీ ఇచ్చారు.నవంబర్‌ 17వ తేదీన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. 

మరిన్ని వార్తలు