Maharashtra political crisis:...ఇక ముంబై వంతు!

3 Jul, 2022 05:15 IST|Sakshi

మూణ్నెల్లలో ముంబై కార్పొరేషన్‌ ఎన్నికలు

ఉద్ధవ్‌కు అగ్నిపరీక్షే, పునరుత్థానానికి చివరి చాన్స్‌

బీజేపీ ఆశీస్సులతో సర్వశక్తులూ ఒడ్డనున్న షిండే

సోమిరెడ్డి రాజమహేంద్రారెడ్డి
రోజుకో మలుపుతో థ్రిల్లర్‌లా పది రోజుల దాకా కొనసాగిన మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఓ కొసమెరుపుతో ముగిసింది. శివసేన రెబెల్‌ నేత ఏక్‌నాథ్‌ షిండేకు అనూహ్యంగా సీఎం కుర్చీ అప్పగించి బీజేపీ తన రాజకీయ చతురత చాటుకుంది. అటు శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రేకు, ఇటు సీఎం పదవి ఆశించిన సొంత నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు గమ్మత్తయిన జవాబు చెప్పింది. రాజకీయ పండితులు కూడా కలలోనైనా ఊహించని ట్విస్ట్‌ ఇది.

షిండే తిరుగుబాటు సాయంతో ఉద్ధవ్‌ను కోలుకోలేని దెబ్బ తీసిన బీజేపీ అగ్ర నాయకత్వం, అదే షిండేను రాజును చేయడం ద్వారా రెండోసారి సీఎం పీఠమెక్కుదామనుకున్న ఫడ్నవీస్‌ను దూకుడు కాస్త తగ్గించాలని అన్యాపదేశంగా చెప్పింది. ఒక ఆట ఈ విధంగా ముగిసినా, అసలైన రసవత్త రాజకీయానికి త్వరలో జరగనున్న బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలు వేదిక కానున్నాయి. ఉద్ధవ్‌ శివసేనకు చావో రేవో కావడంతో పాటు ఆయన రాజకీయ భవితవ్యానికీ పెను పరీక్షగా నిలవనున్నాయి.

ప్రతిష్టాత్మకమైన బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు అక్టోబర్‌–నవంబరులో జరగనున్నాయి. షిండే నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం వీటిని ఏ మాత్రం తేలిగ్గా తీసుకోదు. బీఎంసీపై పట్టు బిగించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తుంది. ఇతర మున్సిపల్‌ కార్పొరేషన్లు, జిల్లా, నగర పరిషత్‌ ఎన్నికలూ ఉన్నా బీఎంసీయే కీలకంగా నిలవనుంది. ఉద్ధవ్‌ శివసేన, షిండే శివసేన రెండింటికీ ఇదే ప్రతిష్టాత్మకం. 1977 నుంచీ బీఎంసీ శివసేన అధీనంలోనే ఉంది. బీఎంసీ తర్వాత థానే, కల్యాణ్‌–డోంబీవలి మహానగర్‌ పాలిక రెండు, మూడో స్థానాల్లో నిలుస్తాయి. ఈ రెండింట్లోనూ షిండేకు పూర్తి పట్టుందని చెబుతారు. కనుక ఉద్ధవ్‌ తన దృష్టినంతా బీఎంసీపైనే కేంద్రీకృతం చేయడం ఖాయంగా కన్పిస్తోంది. ఒకరకంగా షిండేపై ప్రతీకారానికి కూడా ఆయనకిది మంచి అవకాశం.

అప్పట్లో రాజ్‌ దెబ్బ...
ఉద్ధవ్‌ నేతృత్వంలో శివసేన తొలిసారిగా 2002లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల బరిలో దిగింది. టికెట్ల పంపిణీ అంతా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఈ సమయంలోనే తన అనుయాయులకు టికెట్లివ్వడానికి నిరాకరించిన ఉద్ధవ్‌తో రాజ్‌ ఠాక్రే తెగదెంపులు చేసుకుని వేరుకుంపటి పెట్టుకున్నారు. అయినా ఉద్ధవ్‌ బీఎంసీని ఎలాగోలా చేజిక్కించుకున్నారు. రాజ్‌ నిష్క్రమణతో బలహీనపడ్డ శివసేన క్రమంగా గత వైభవాన్ని కోల్పోతూ వచ్చింది. బీజేపీ కూడా బీఎంసీలో తన బలాన్ని పెంచుకుంటూ పోయింది. రాజ్‌ నేతృత్వంలోని ఎంఎన్‌ఎస్‌ దెబ్బకు 2012 బీఎంసీ ఎన్నికల్లో శివసేనకు దాదాపు ఓడినంత పనైంది. సాయం కోసం బీజేపీ వైపు చూడక తప్పలేదు. అలా శివసేన–బీజేపీ సంకీర్ణం బీఎంసీని హస్తగతం చేసుకుంది.

బీజేపీతో కయ్యం...
మరో ఐదేళ్లకు 2017లో విచిత్రమైన పరిస్థితి తలెత్తింది. రాష్ట్రస్థాయిలో మిత్రపక్షాలుగా ఉన్న శివసేన, బీజేపీ బీఎంసీ ఎన్నికల్లో మాత్రం పరస్పరం పోటీ పడ్డాయి. బీజేపీ తన బలాన్ని 31 సీట్ల నుంచి ఏకంగా 82కు పెంచుకుంది. శివసేన గట్టిపోటీ నడుమ 84 సీట్లు గెలవగలిగింది. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు షిండే సవాలును తట్టుకుని ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సిందే. ఒకవైపు బీజేపీ, మరోవైపు షిండే దాడిని ఉద్ధవ్‌ ఏ మేరకు కాచుకుంటారన్నది ప్రశ్నార్థకమే. వాటికి తోడు రాజ్‌ ఠాక్రే ఎంఎన్‌ఎస్, శరద్‌ పవార్‌ ఎన్సీపీ నుంచి ఎటూ పోటీ ఉండనుంది. కాంగ్రెస్‌కు పెద్దగా సీన్‌ కనిపించడం లేదు. మరాఠా ఓటర్లంతా తమవైపేనన్నది ఉద్ధవ్‌ శివసేన ధీమా అయితే గుజరాతీలు, జైన్లు, ఉత్తరాది వారివంటి మరాఠేతర ఓటర్లు తమను విడిచిపెట్టరన్నది బీజేపీ ధీమా.

నిజానికి శివసేనకు ముంబై పెట్టని కోటగా ఉండేది. కానీ దాదర్, మాహిం, కుర్లా, చాందివలి ఎమ్మెల్యేలు కూడా షిండే వర్గంలో చేరడంతో బీఎంసీ ఎన్నికల్లో వారి అనుయాయులు, కార్యకర్తల మద్దతు ఉద్ధవ్‌కు లేకుండా పోయినట్టే. ఇది ఆయనకు ఒకరకంగా గట్టి దెబ్బే. కనీసం 90 సీట్లన్నా రాకుంటే బీఎంసీ పీఠం ఉద్ధవ్‌ సేనకు దక్కడం కష్టమే. అయితే బీజేపీకి దూరమైంది గనుక ముంబై ముస్లింలు ఈసారి ఉద్ధవ్‌కు ఓటేసే అవకాశముంది. ఇది ఆయనకు కాస్త కలిసొచ్చే పరిణామమే. కాకపోతే, ఇది ఉద్ధవ్‌ను ఘోర పరాజయం గట్టెక్కించడానికి మాత్రమే పనికొస్తుందన్న అంచనాలున్నాయి. బీజేపీ ఆశీస్సులతో సీఎం పీఠం మాదిరిగానే బీఎంసీని కూడా ఉద్ధవ్‌ నుంచి షిండే లాక్కోవడం ఖాయమన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఇంతకూ బీఎంసీ ఎన్నికల నాటికి సిసలైన శివసేనగా గుర్తింపు, పార్టీ గుర్తు ఉద్ధవ్, షిండేల్లో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికర అంశం. వేచి చూద్దాం.

>
మరిన్ని వార్తలు