కొత్తగా పార్టీలో చేరే వారికి టికెట్ల హామీ లేదు

28 Jun, 2022 01:42 IST|Sakshi

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ముందు నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రథమ ప్రాధాన్యత

పార్టీ విధానం మేరకే టికెట్ల కేటాయింపు 

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో కొత్తగా చేరే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామనే హామీని ఎ వ్వరూ ఇవ్వడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆది నుంచి పార్టీ కోసం పనిచేస్తూ ఎలాం టి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా పార్టీని బలంగా ఉంచిన వారి ప్రయోజనాలను విస్మరించ మని స్పష్టం చేశారు. భట్టి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే.

కొన్ని నియోజకవర్గాల్లో అప్పటికే పనిచేస్తున్న నాయకులకు తెలియకుండా నేరుగా కొత్త వారు వచ్చి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీనిపై ఇప్పటికే వివాదం సాగుతుండగా.. భట్టి విక్రమార్క సీఎల్పీ నాయకుని హోదాలో పార్టీ వైఖరిని వెల్లడిస్తూ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పని చేయడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తామని, అయితే ఇన్నాళ్లు కాంగ్రెస్‌ కంచుకోటను బలంగా ఉంచిన వారిని ఎవరి కోసం పణంగా పెట్టమని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2022 వరకు కాంగ్రెస్‌ను కాపాడుకుంటూ, కార్యకర్తలకు మనోధైర్యం కల్పిస్తూ వచ్చిన నాయకుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, కార్యకర్తల సమష్టి కృషి వల్ల జిల్లాలో పార్టీ బలమైన శక్తిగా మనగలుగుతోందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలను, నాయకులను ఎప్పటికీ వదులుకోమని స్పష్టం చేశారు. అదే సమయంలో కొత్తగా చేరిన వారి సేవలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల టికెట్ల ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్‌ పార్టీ విధానపరంగా జరుగుతుందని భట్టి తెలిపారు. 

మరిన్ని వార్తలు