గవర్నర్‌గా ధన్‌కర్‌ వద్దంటూ ప్రధానికి మూడుసార్లు లేఖ రాశా

18 Jun, 2021 04:09 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ ధన్‌కర్‌ను ఉపసంహరించుకోవాలంటూ ప్రధాని మోదీకి ఇప్పటి వరకు మూడుసార్లు లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. ‘చిన్న పిల్లాడైతే బుజ్జగించవచ్చు కానీ, ఒక వృద్ధుడిని అలా చేయలేం కదా. ఈ విషయంలో మాట్లాడకుండా ఉండటమే మంచిది’అంటూ మమత వ్యాఖ్యానించారు. గవర్నర్‌ ధన్‌కర్‌ను తొలగిస్తారంటూ వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా ఆ విషయాలేవీ తనకు తెలియవన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ధన్‌కర్‌ను కేంద్రం నియమించింది. ఆయన్ను వెనక్కి తీసుకోవాలని  మోదీకి లేఖలు రాశా’అని తెలిపారు. రాష్ట్రంలోని టీఎంసీ ప్రభుత్వంతో గవర్నర్‌ ధన్‌కర్‌ మధ్య విభేదాలు మొదట్నుంచీ కొనసాగుతున్నాయి.

అమిత్‌ షాను కలిసిన ధన్‌కర్‌
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ధన్‌కర్‌.. గురువారం హోం మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో శాంతి భద్రతల పరిస్థితిపై ధన్‌కర్‌ హోం మంత్రికి వివరించినట్లు హోం శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం కోల్‌కతాలో గవర్నర్‌కు వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు