వరల్డ్‌కప్‌ హీరోకే ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు

11 Dec, 2023 14:56 IST|Sakshi

2023 నవంబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డుల వివరాలను ఐసీసీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. పురుషుల విభాగానికి సంబంధించి ఈ అవార్డును వరల్డ్‌కప్‌ హీరో, ఆసీస్‌ ఆటగాడు ‍ట్రవిస్‌ హెడ్‌ దక్కించుకోగా.. మహిళల విభాగంలో బంగ్లాదేశ్‌ యువ స్పిన్నర్‌ నహీద అక్తర్‌ ఈ అవార్డును గెలుచుకుంది. పురుషుల విభాగంలో ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం ట్రవిస్‌ హెడ్‌, మొహమ్మద్‌ షమీ, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ మధ్య తీవ్రపోటీ జరిగినప్పటికీ.. అంతింమంగా హెడ్‌నే అవార్డు వరించింది.

వరల్డ్‌కప్‌ సెమీస్‌లో (2 వికెట్లు, 62 పరుగులు), ఫైనల్లో (రోహిత్‌ శర్మ క్యాచ్‌తో పాటు 137 పరుగులు) అద్భుత ప్రదర్శనల కారణంగా మెజార్టీ శాతం ఓట్లు హెడ్‌కే దక్కాయి. 29 ఏళ్ల హెడ్‌కు ఇది తొలి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కాగా.. ఆసీస్‌ తరఫున వార్నర్‌ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న ఆటగాడు హెడే కావడం మరో విశేషం. 

మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు కోసం బంగ్లాదేశ్‌ యువ క్రికెటర్‌ నహీద అక్తర్‌.. సహచర క్రికెటర్‌ ఫర్జానా హాక్‌, పాక్‌ స్పిన్నర్‌ సైదా ఇక్బాల్‌ నుంచి పోటీ ఎదుర్కొంది. అయితే నవంబర్‌ నెలలో విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు (14.14 సగటున 7 వికెట్లు) గానూ నహీద ఈ అవార్డును ఎగరేసుకుపోయింది. విండీస్‌తో సిరీస్‌లో నహీద ప్లేయర్‌ ఆఫ్‌ సిరీస్‌ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్న తొలి బంగ్లాదేశీ మహిళా క్రికెటర్‌ నహీదానే కావడం విశేషం. 
 

>
మరిన్ని వార్తలు