West Bengal: మమత నిర్ణయంపైనే ఘర్‌వాపసీ..! 

5 Jun, 2021 03:55 IST|Sakshi

మళ్ళీ టీఎంసీలో చేరేందుకు సిద్ధమౌతున్న పలువురు నాయకులు

సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్‌ రాజకీయాల్లో ఇప్పుడు ఘర్‌వాపసీ చర్చ ఊపందుకుంది. ఎన్నికల ముందు తృణమూల్‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన పలువురు నాయకులు తిరిగి పార్టీలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఘర్‌వాపసీకి అనుమతించాలా వద్దా అనే విషయంలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తీసుకొనే నిర్ణయంపైనే ఇప్పుడు ఈ నాయకుల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అయితే పార్టీలోకి తిరిగి రావాలనుకుంటున్న నాయకులు అందరికీ ఘర్‌వాపసీ సులభంగా జరగకపోవచ్చని, కేవలం కొందరు నాయకులను మాత్రమే పార్టీలోకి ఆహ్వానించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2024కు ముందు క్షేత్రస్థాయిలో బీజేపీని సంస్థాగతంగా బలహీనపరచడం టీఎంసీ లక్ష్యమైనప్పటికీ, ఎన్నికల ముందు అవకాశవాద రాజకీయాల కోసం పార్టీని వదిలిన వారిని అందరినీ తిరిగి పార్టీలోకి తీసుకొనే విషయంలో పార్టీ క్యాడర్‌కు మమతా బెనర్జీ క్యాడర్‌కు ఒక సందేశాన్ని ఇచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల ముందు పార్టీని వీడిన దీపేందు బిస్వాస్, సోనాలిగుహాతో సహా పలువురు మాజీ టీఎంసీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరాలని తీసుకున్న తమ నిర్ణయానికి చింతిస్తున్నామని, తిరిగి పార్టీలోకి రావాలనుకుంటున్నట్లు లేఖలు పంపారు. అంతేగాక ఒకప్పుడు మమతా బెనర్జీకి సన్నిహితంగా భావించిన గుహ తనను క్షమించాలని సీఎంను కోరుతూ ఒక వీడియోను విడుదల చేశారు. మరోవైపు అనారోగ్యంగా ఉన్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్‌ రాయ్‌ భార్యను పరామర్శించేందుకు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ హాస్పిటల్‌కు వెళ్ళిన తరువాత ముకుల్‌రాయ్‌ ఘర్‌వాపసీ విషయంలోనూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే తనపై వస్తున్న పుకార్లను ముకుల్‌రాయ్‌ అడ్డుకొనే ప్రయత్నం చేశారు.  

ఎన్నికల ముందు పార్టీని వీడిన వారి విషయంలో కాంగ్రెస్‌– వామపక్షాల వ్యూహాన్ని టీఎంసీ అనుసరిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్‌ గతంలో తరచూ అసమ్మతివాదులను వెనక్కి తీసుకోగా, వామపక్షాలు సాధారణంగా అసమ్మతివాదులకు, పార్టీని వదిలిన వారికి నో రీఎంట్రీ విధానాన్ని కలిగి ఉన్నాయి. కీలకమైన సమయంలో పార్టీని విడిచిన వారిని తిరిగి తీసుకొనే విషయంలో పార్టీ ఒక విధానాన్ని అనుసరించాలని పలువురు టీఎంసీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.  

ఘర్‌వాపసీలో భాగంగా పార్టీలోకి తిరిగి రావాలనుకొనే వారిలో ఎంపిక చేసిన వారికి మాత్రమే మమతా బెనర్జీ అవకాశం ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరిని బహిష్కరించాలనే నిర్ణయాలను మమతా బెనర్జీ, అభిషేక్‌ బెనర్జీ, సుబ్రతా బక్షి, పార్థా ఛటర్జీలతో కూడిన ప్రధాన క్రమశిక్షణా కమిటీ నిర్ణయిస్తుందని టీఎంసీ సీనియర్‌ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు టీఎంసీని వదిలి వెళ్ళినవారిని పార్టీలోకి తిరిగి తీసుకోవడం విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు స్పష్టంచేశాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చాలా కొద్దిమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీ గూటికి చేరుకున్న పరిస్థితుల్లో టీఎంసీ కుప్పకూలుతోందన్న విధంగా బీజేపీ ఎన్నికల సమయంలో ఒక హైప్‌ క్రియేట్‌ చేసిందని టీఎంసీ నాయకులు విమర్శిస్తున్నారు.   

మరిన్ని వార్తలు