టీడీపీ సీనియర్‌ నేతకు షాక్‌.. చంద్రబాబు ప్లాన్‌ అదేనా?

23 Dec, 2023 15:11 IST|Sakshi

ఆ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం డామినేషన్ ఉందని చెప్పుకునేవారు. కాని గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అందుకే ఈసారి అక్కడ మళ్ళీ పట్టు నిలుపుకోవాలని పచ్చ పార్టీ బాస్‌ తెగ ఆరాటపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేను కాకుండా బాగా డబ్బు ఖర్చు పెట్టగల అభ్యర్థిని దించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. చంద్రబాబు తీరుతో ఈసారి టిక్కెట్ రాదేమోనని ఆ మాజీ ఎమ్మెల్యేకు గుండె దడ మొదలైందట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదీ అంటే..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఎవరికి వారే తమకే టిక్కెట్టు దక్కుతుందని ఇన్నాళ్లూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాకిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే.. 2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ ముక్కలు చెక్కలైంది. అయితే, ఈసారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టిక్కెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారట. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారట. 

ఇలాంటి సమయంలో చంద్రబాబు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులతో ఎవరి వెంట నడవాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్‌లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. దీంతో, ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుత టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మనేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు. 
 
బోడే ప్రసాద్ వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్ధి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా  కేశినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ల నారాయణ తమ్ముడు కొనకళ్ల బుల్లయ్యను బరిలోకి దించి బీసీ ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్.

ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమ, కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇప్పటి వరకూ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్‌కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరనసలు చేసిన తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్ధిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట. 
 
ఆమధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో బోడే ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎవరెవరో వచ్చి తమకే టిక్కెట్ అంటున్నారు. పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట.

>
మరిన్ని వార్తలు