ఎవరి ఓట్లెన్ని..? మునుగోడులో పార్టీల దృష్టంతా ఓటర్ల జాబితాలపైనే!

8 Oct, 2022 07:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక కౌంట్‌డౌన్‌ మొదలుకావడంతో ప్రధాన రాజకీయపక్షాల దృష్టంతా ఇప్పుడు ఓటర్ల జాబితాపై కేంద్రీకృతమైంది. నియోజకవర్గంలో ఎన్ని ఓట్లున్నాయి.. ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎన్నెన్ని ఉన్నాయి.. క్షేత్రస్థాయిలో ఓటర్ల జాబితాలో ఎవరెవరి పేర్లున్నాయి.. తదితర అంశాలపై పార్టీలు సమాలోచనలు సాగిస్తున్నాయి. మునుగోడు ఓటర్లుగా ఉంటూ నియోజకవర్గం బయట.. ముఖ్యంగా హైదరాబాద్‌ శివార్లలో ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై ఆరా తీయడం ప్రారంభించాయి. వచ్చేనెల 3.. పోలింగ్‌ తేదీన వారందరిని పోలింగ్‌ స్టేషన్లకు రప్పించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి.

నియోజకవర్గం వెలుపల ఉన్న ఓటర్లను కలసి వారి మద్దతును కూడగట్టేందుకు బీజేపీ నాయకులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఉండని వారిలో ఎక్కువ శాతం మంది ఎల్‌బీనగర్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్నట్లుగా పార్టీ నేతలు గుర్తించారు. ఆ ఓటర్లు, వారి అడ్రస్‌లను వెలికితీసే బాధ్యతలను ఎల్‌బీ నగర్, ఇతర కార్పొరేటర్లకు అప్పగించినట్లు సమాచారం. ఓటింగ్‌ రోజున వారిని మునుగోడుకు తరలించే ఏర్పాట్లపై సైతం పార్టీ నాయకులు దృష్టి పెట్టా రు.

ఇదిలాఉంటే.. మునుగోడు ఉప ఎన్నికకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించేందుకు శనివారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అధ్యక్షతన భేటీ జరగనుంది. మునుగోడు ఎన్నికలపై ప్రత్యేక చర్చతో పాటు పారీ్టపరంగా చేపడుతున్న కార్యక్రమాలను సైతం సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఈ భేటీ లో పార్టీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జీలతో అసెంబ్లీ ఇన్‌చార్జీలు హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో జాతీయ నేతలు తరుణ్‌ ఛుగ్, సునీల్‌ బన్సల్, అరవింద్‌ మీనన్‌ పాల్గొంటారని వివరించారు.
చదవండి: అహంతోనే వినతిపత్రం విసిరికొట్టారు

మరిన్ని వార్తలు