ఈ టైంలో వద్దు.. మునుగోడులో జేపీ నడ్డా సభ రద్దు..!

29 Oct, 2022 09:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 31న మునుగోడులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొనాల్సిన బహిరంగసభను రద్దు చేసుకున్నారు. అయితే దీనిపై రాష్ట్ర పార్టీ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఈ సభ ఆలోచనను విరమించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

తమ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్దమొత్తంలో డబ్బు ఎర చూపి ప్రలోభపరిచేందుకు బీజేపీ నాయకత్వం ప్రయత్నించిందంటూ టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించడం, దీనికి సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటకు రావడం రాష్ట్రరాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికల ప్రచారసభకు రావడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి పార్టీ నాయకత్వం వచ్చినట్టు సమాచారం.

ఈ సభ నిర్వహణకు చేసే వ్యయాన్ని ఎన్నికల ప్రచారానికి మళ్లించి మరింత ప్రభావవంతంగా చేయాలని నేతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతం నుంచే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొనడానికి నడ్డా అంతగా సుముఖత చూపలేదని తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితం మునుగోడు పరిధిలో మల్కాపురంలో స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు నడ్డాకు సమాధిని కట్టడంతో బీజేపీ నాయకత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ఈ నేపథ్యంలో 31న మునుగోడు సభలో పాల్గొనడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీలకు నడ్డా గట్టి జవాబిస్తారని పార్టీ నాయకులు భావించారు.  

9 చోట్ల సభలు...: 31న నడ్డా సభకు బదులుగా మునుగోడు పరిధిలోని ఏడు మండల కేంద్రాలు, రెండు మున్సిపాలిటీల్లో నిర్వహించే సభల్లో పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నేతలు పాల్గొననున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఎక్కడికక్కడ బైక్‌ ర్యాలీలు, ఎన్నికల ప్రభలు నిర్వహించి వీలైనంత ఎక్కువమంది ప్రజలను కలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్‌ 1న జాతీయ, రాష్ట్రపార్టీ ముఖ్యనేతల రోడ్‌షోలతో పార్టీ ప్రచార కార్యక్రమాలకు ముగింపు పలకనున్నారు.
చదవండి: కేసీఆర్‌ రాజకీయ జీవితం సమాధి...

మరిన్ని వార్తలు