నోటీసు కక్ష సాధింపే

17 Mar, 2021 03:51 IST|Sakshi

టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, యనమల 

సాక్షి, అమరావతి: కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుకు సీఐడీ నోటీసు ఇచ్చిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. దేశ చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రిపై మొదటిసారి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టారని ఒక ప్రకటనలో తెలిపారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా?, ఆయన ఫిర్యాదు చేయగానే ఈ కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు. రాజధానిలో అసైన్డ్‌ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే ఇచ్చామని, ల్యాండ్‌ పూలింగ్‌ 2015లో జరిగితే దానిపై ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్ష సాధింపు కాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, నారాయణలకు సీఐడీ నోటీసు జారీ చేయడం హాస్యాస్పదమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో తెలిపారు. సీఐడీ కేసు నమోదు చేయడం వెనుక కుట్ర ఉందన్నారు. 

చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు: లోకేశ్‌
సిల్లీ కేసులతో చంద్రబాబు గడ్డం మీద నెరిసిన వెంట్రుక కూడా పీకలేరని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు. అమరావతిని అంతం చెయ్యడానికి ఎన్ని కుట్రలు చేసినా, దైవభూమి తనని తానే కాపాడుకుంటుందన్నారు.  

మరిన్ని వార్తలు