శరద్‌పవార్‌కు అనారోగ్యం, కార్యక్రమాలన్నీ రద్దు

29 Mar, 2021 12:13 IST|Sakshi

 ఎన్‌సీపీ చీఫ్‌కు అనారోగ్యం,  గ్లాల్‌బ్లాడర్‌ లో రాళ్లు

త్వరలోనే ఆపరేషన్‌

తదుపరి నోటీసు వరకు కార్యక్రమాలన్నీ క్యాన్సిల్‌

సాక్షి, ముంబై: ఎన్‌సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ ‌పవార్‌ (80) అనారోగ్యానికి గురయ్యారు. శరద్ పవార్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, శస్త్రచికిత్స నిమిత్తం బుధవారం ఆసుపత్రిలో చేరనున్నారని పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. హోం మంత్రి అమిత్ షాతో శరద్ పవార్ రహస్య మంతనాలు జరిపారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న తరుణంలో ఆయన  అనారోగ్యం వార్త శ్రేణుల్లో ఆందోళన నింపింది.

ఎన్‌సీపీ ప్రతినిధి నవాబ్ మాలిక్ శరద్‌పవార్‌ అనారోగ్యం వివరాలపై సోమవారం ట్వీట్ చేశారు. ఆదివారం సాయంత్రం కడుపునొప్పి రావడంతో ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించగా,  పిత్తాశయంలో రాళ్లు ఉన్నట్టుగా తేలిందన్నారు. దీంతో తదుపరి సమాచారం అందించేంత వరకు ఆయన కార్యక్రమాలన్నీ రద్దైనట్టు మాలిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం బ్లడ్‌ థిన్నర్‌ (రక్తం గడ్డ కట్టకుండా వుండే) మందులు వాడుతున్న నేపథ్యంలో  2021, మార్చి 31న ఆసుపత్రిలో చేరతారని, ఎండోస్కోపీ, అనంతరం శస్త్రచికిత్స జరగనుందని  వెల్లడించారు.  అటు తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, మహారాష్ట్ర నవనిర్మాన్ సేన నాయకుడు రాజ్ ఠాక్రే ,  ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన ఆరోగ్యంపై ఆరాతీశారని  శరద్‌ పవార్‌  ట్వీట్‌చేశారు. ఈ  సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలిపారు.

హోం మంత్రి అమిత్ షా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్య  కీలక భేటీ జరిగిందంటూ మీడియాలో వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఎన్‌సీపీ ఖండించింది. అలాంటిదేమీలేదని, ఇదంతా బీజేపీ రాజకీయ ఎత్తుగడలో భాగమని కొట్టి పారేసింది. అటు ఈ వ్యవహారంపై అమిత్ షాను ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనాన్ని ఆశ్రయించారు. ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయ లేమంటూ వ్యాఖ్యానించారు. కాగా  పవార్‌ గతంలో క్యాన్సర్‌ బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు