బీజేపీకి వెన్నుపోటు పొడిచి ప్రధాని కాగలరా? నితీశ్‌పై అమిత్‌షా ధ్వజం

23 Sep, 2022 15:08 IST|Sakshi

పాట్నా: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. బిహార్ సీఎం నితీశ్ కుమార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2024లో ప్రధాని కావాలనే లక్ష‍్యంతో ఆయన బీజేపీకి వెన్నుపోటు పొడిచి లాలూ ప్రసాద్ యాదవ్ ఒళ్లో కూర్చున్నారని ధ్వజమెత్తారు. నితీశ్ తెగదెంపులు చేసుకోవడంతో బిహార్‌లో ఎన్డీఏ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చారు అమిత్ షా. రెండు రోజుల పర్యటనలో భాగంగా సరిహద్దు జిల్లా పూర్ణియాలో ర్యాలీలో ప్రసంగించారు. నితీశ్‌పై విమర్శలు గుప్పించారు.

'నేను ఈవాళ సరిహద్దు జిల్లాల్లో పర్యటించడం చూసి లాలూ ప్రసాద్ యాదవ్, సీఎం నితీశ్ కుమార్‌లకు కడుపునొప్పి వస్తోంది. వాళ్లు అశాంతి కోరుకుంటున్నారు. నేను ఇక్కుడకు వస్తే అశాంతి నెలకొంటుందని ఆరోపిస్తున్నారు. నితీశ్‌ కుమార్‌ లాలూ ఒళ్లో కూర్చుకున్నారు. ప్రజలేం ఆందోళన చెందవద్దు. సరిహద్దు జిల్లాలు భారత్‌లో భాగమే. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో మనకు ఎలాంటి భయం అక్కర్లేదు. ఏదో ఒకరోజు ప్రధాని కావాలనే ఆశతో నితీశ్ లాలూ చెంతకు చేరారు. వాళ్లు బిహార్‌ ప్రజల తీర్పుకు విరుద్ధంగా ద్రోహం చేశారు. సీమాంతర ప్రజలు నితీశ్‌కు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. కూటములు మార్చి నితీశ్ ప్రధాని కాగలరా?' అని అమిత్ షా ప్రశ్నించారు.

నితీశ్‌కు సీఎం పదవి ఇస్తామని ప్రధాని మోదీ మాటిచ్చినందు వల్లే బీజీపే అందుకు కట్టుబడి ఉండి ఆయనకు బాధ్యతలు అప్పగించిందని అమిత్ షా చెప్పారు. కానీ నితీశ్ మాత్రం ద్రోహం చేసి ప్లేటు పిరాయించారని దుయ్యబట్టారు. ర్యాలీ అనంతరం కిషన్‌గంజ్‌కు వెళ్తారు అమిత్ షా. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎంఎల్‌సీలు, పార్టీ కార్యాలయాల బాధ్యులతో సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి చర్చిస్తారు.
చదవండి: అధ్యక్ష పదవికి సోనియా ఫ్యామిలీ దూరం!

మరిన్ని వార్తలు