హత్రాస్‌ కంటే బెంగాల్‌ ఎన్నికలే ముఖ్యమా?

2 Mar, 2021 19:22 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదలవ్వడంతో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌, బీజేపీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం బెంగాల్‌లోని మల్దాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మమతా బెనర్జీపై ప్రభుత్వ విధానాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. బెంగాల్‌లో గోవధ, లవ్ జిహాద్‌లను దీదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు. బెంగాల్‌లో దుర్గా పూజను నిషేధించారని, ఈద్ సందర్భంగా గోవుల వధ జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలో జైశ్రీరామ్ నినాదాన్ని అనుమతించడం లేదన్న సీఎం యోగి.. ప్రజల మనోభావాలతో మమతా ప్రభుత్వం ఆడుకుంటుందని దుయ్యబట్టారు. 

మరోవైపు సీఎం యోగి ఆదిత్యానాథ్‌ పర్యటనపై తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎంపీ నుస్రత్‌ జహాన్‌ ఘాటుగా స్పందించారు. తమ సొంత రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టలేని వ్యక్తి పక్క రాష్ట్రాల గురించి మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ‘బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘోర ఘటనను మాటల్లో వర్ణించలేకపోతున్నాను. హత్రాస్‌ ఘటనలోని బాధిత కుటుంబ సభ్యులకు ఆ ప్రభుత్వం రక్షణ ఇవ్వలేకపోయింది. ఆ కుటుంబ ప్రాధాన్యత కంటే బీజేపీకి బెంగాల్‌ ఎన్నికలు ముఖ్యమా.’  అంటూ కౌంటర్‌ ఇచ్చారు. 

చదవండి: దీదీ నీకు వాళ్ల గతే పడుతుంది: యోగి ఆదిత్యనాథ్‌

కాగా ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన హత్రాస్‌ అత్యాచార ఘటనలో బాధితురాలి తండ్రిని నిందితుడు, అతని స్నేహితుడు  కాల్చి చంపిన విషయం తెలిసిందే. రెండేళ్ల కిందట యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు గౌరవ్ శర్మని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 2018లో జైలుకెళ్లిన నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైన నిందితుడు తనపై ఫిర్యాదు చేసారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అయితే తండ్రి కోసం విలపించిన బాధితురాలు తనకు న్యాయం జరగాలని, తనపట్ల కిరాతకంగా ప్రవర్తించిన వ్యక్తికి కఠిన శిక్ష పడాలని కోరింది.

మరిన్ని వార్తలు