‘సీఎం జగన్‌ చరిష్మా ముందు బాబు నిలువలేకపోతున్నారు’

12 Feb, 2021 15:32 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి:  మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 80 శాతానికి పైగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిచిందని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ఈ ఎన్నికల మొదటి దశ ఫలితాలను చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. అసెంబ్లీలో చంద్రబాబు సాక్షిగానే ఓ చట్టము చేశామని.. ఇప్పుడు దాన్ని నల్ల చట్టమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. బాబు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంటే ఫోబియా ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే తప్పు చేసిన వారు అనుభవించక తప్పుదని అంటున్న బాబు అది ఆయనకే వర్తింస్తుందని తెలుసుకోవాలన్నారు. తమ మేనిఫెస్టోలో ఏదీ అమలు చేయక గత అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైన బాబు.. సీఎం జగన్ చరిష్మా ముందు నిలువలేక ఏదో ఆవహించినట్లు మాట్లాడుతున్నారన్నారని ఎద్దేవా చేశారు. 

సజావుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని,  ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని మంత్రి తెలిపారు. కులాలు మతాలు చూడకుండా ఇంటివద్దకే వాలంటీర్ వ్యవస్థ వెళుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ నేతలను బాబు రౌడీలు, గూండాలు అంటున్నారని, మరీ అచ్చెంనాయుడు, కొల్లు రవీంద్ర ఏం చేశారని ప్రశ్నించారు. తమ పాలన బాగుందని టీడీపీ వారే కొనియాడుతున్నారన్నారని తెలిపారు. తనకు బాబు పోటుగాడు అనే బిరుదు ఇచ్చారని, అది తాను తీసుకుంటాను కానీ మీలాంటి వెన్నుపోటుదారున్ని మాత్రం కాదని విమర్శించారు. తన జిల్లాలో తిరుగులేని బలం తనకు ఉందని, మీరు ముఖ్యమంత్రిగా ఉండగానే ఒక్క ఓటు మెజారిటీతో ఓ నాయీ బ్రాహ్మణ మహిళను జిల్లా పరిషత్ చైర్మన్ చేశానన్నారు. ఇవన్నీ బాబు ఓర్చుకోలేక పోతున్నారన్నారు. ప్రజాబలం సీఎం వైఎస్‌ జగన్‌కు ఎక్కువగా ఉందని, 90 శాతం స్థానాలు తమవే అని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక పోస్కో అంతర్జాతీయ సంస్థ వాళ్లకు ముఖ్యమంత్రితో సంబంధం ఏమిటుందని, వారు సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లారని తెలిపారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని లీడ్ చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు అని దీనిపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలన్నారు. సీఎం జగన్‌కు దీనికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు నాయుడు సెంట్రల్ ఫోర్స్ కావాలంటారు.. వీలుంటే విదేశాల నుంచి కూడా ఫోర్స్ కావాలి అని అడిగే వ్యక్తి ఆయన అన్నారు. కానీ ఆయన సీఎంగా ఉన్నపుడు కేంద్రబలగాలను ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. బాబుకు పుంగనూర్ , తాంబల్లపల్లిలో ఏకగ్రీవాలు అవుతాయని ముందే తెలుసని, అందుకే బలవంతపు ఏకగ్రీవాలు అంటూ తన వైఫల్యాన్ని కప్పిపుచుకునే ప్రయత్నం చేశారని మంత్రి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు