సంక్రాంతి తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ హీట్

9 Jan, 2023 16:43 IST|Sakshi

తెలంగాణ పాలిటిక్స్ సంక్రాంతి తర్వాత వేడెక్కనున్నాయా? వరుస సభలతో ప్రధాన రాజకీయ పక్షాలు వేగం పెంచనున్నాయా?  ఖమ్మం సెంట్రిక్ గా పావులు కదపబోతున్నారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరభేరికి పార్టీలు సిద్ధమవుతున్నాయా? అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పక్షాలు పావులు కదుపుతున్నాయి. వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని ఇప్పటికే పలుమార్లు సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ తాజాగా మిషన్ 90 పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది. వచ్చే ఎన్నికలకు అవసరమైన వ్యూహాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. కార్యకర్తల్లో జోష్ పెంచడానికి ఎవరికి వారు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తున్నారు.

బీఆర్ఎస్ పార్టీ అధినేత ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో పర్యటించబోతున్నారు. కలెక్టరేట్ ప్రారంభించిన తర్వాత అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో కేసీఆర్ సభను హిట్ చేసి పోయే వాళ్లను పట్టించుకోవాల్సిన పనిలేదనే సంకేతాలు ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది.

ఈ నెల 19న  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. విజయవాడ–హైదరాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు పచ్చజెండా ఊపనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్రమోడీ ఈ సభలో వివరించే అవకాశముంది.  

రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిధుల దారిమళ్లింపుపై ప్రధాని నరేంద్రమోడీ ఈ సభలో ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్ పర్యవేక్షించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్ సభా స్థలాన్ని పరిశీలించారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికలు ముగిసేవరకు ప్రధాన రాజకీయ పక్షాల వ్యూహప్రతివ్యూహాల మధ్య పొలిటికల్ హీట్ తగ్గే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు.

మరిన్ని వార్తలు