వామ్మో కాంగ్రెస్‌.. నేనూ మునిగిపోతా! దానికో దండం: పీకే

1 Jun, 2022 07:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదు. పాఠాలు నేర్చుకోవడం, తప్పులను దిద్దుకోవడం ఆ పార్టీ చరిత్రలోనే లేదు. అది రాజకీయంగా మట్టికరవడం ఖాయం. వెంటున్న అందరినీ కూడా తనతో పాటు తీసుకెళ్తుంది. ఆ పార్టీ బాసులు తాము మునగడమే గాక అందరినీ ముంచేస్తారు. కాంగ్రెస్‌లో చేరితే నేనూ మునగడం ఖాయం’’ అంటూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తానెప్పటికీ కాంగ్రెస్‌లో చేరబోనంటూ నాటకీయంగా చేతులు జోడించి(దణ్ణం పెట్టి) మరీ చెప్పారు. మంగళవారం బిహార్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘గత పదేళ్లలో బిహార్‌ నుంచి పంజాబ్‌ దాకా కనీసం 11 ఎన్నికల్లో ఎన్నో పార్టీలతో పని చేశాం. ఎక్కడా ఓటమి లేని మా ట్రాక్‌ రికార్డుకు 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పని చేయడం గండికొట్టింది. అందుకే ఆ పార్టీతో ఇంకెప్పుడూ కలిసి పని చేయొద్దని నిర్ణయించుకున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

ఈ ఏడాది జరిగే గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవడంలో ఇటీవలి చింతన్‌ శిబిర్‌ పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ పునరుత్థానానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ పెద్దలకు కొద్ది వారాల క్రితం పీకే ప్రజెంటేషన్‌ ఇవ్వడం, ఆయన పార్టీలో చేరతారంటూ వార్తలు రావడం, అలాంటిదేమీ లేదని ఆయన ప్రకటించడం తెలిసిందే.
 

మరిన్ని వార్తలు