‘బహిరంగ క్షమాపణ చెప్పేవరకు సిద్ధూని సీఎం కలవరు’

21 Jul, 2021 09:58 IST|Sakshi

వైరలవుతోన్న పంజాబ్‌ సీఎం మీడియా అడ్వైజర్‌ ట్వీట్‌

చండీగఢ్‌: పంజాబ్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఇంకా ముగియలేదు. కాంగ్రెస్‌ అధిష్టానం నవజోత్‌ సింగ్‌ సిద్ధూకి పంజాబ్‌ పీసీసీ బాధ్యతలు అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ గుర్రుగా ఉన్నట్లు సమాచారం. సిద్ధూ తనకు క్షమాపణలు చెప్పే వరకు తనను కలిసేది లేదని ఇంతకుముందే అమరీందర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయన ఇదే మాటకు కట్టుబడి ఉన్నట్లు తాజా పరిణామాలు చూస్తే అర్థం అవుతుంది. 

ఈ క్రమంలో అమరీందర్‌ సింగ్‌ మీడియా అడ్వైజర్‌ రవీన్‌ థుక్రాల్‌ చేసిన ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘‘నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసేందుకు సమయం ఇవ్వాల్సిందిగా కోరారు అనే వార్తలు అవాస్తవం. ఏది ఏమైనా ముఖ్యమంత్రి నిర్ణయంలో మార్పు లేదు. నవజోత్‌ సింగ్‌ సిద్ధూ సోషల్‌ మీడియా వేదికగా ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణలు చెప్పే వరకు అమరీందర్‌ సింగ్‌ సిద్ధూని కలవరు.. అతడికి సమయం ఇవ్వరు’’ అని స్పష్టం చేశారు. 

మరోవసై పంజాబ్‌ మినిస్టర్‌ బ్రహ్మ్‌ మోహింద్రా కూడా సిద్ధూని కలవడానికి ఇష్టపడలేదు. ఈ మేరకు ఆయన ‘‘సిద్ధూని పంజాబ్‌ పీసీసీ చీఫ్‌గా నియమించడాన్ని స్వాగతిస్తున్నాను. కానీ సిద్ధూ ముఖ్యమంత్రిని కలిసి.. వారిద్దరి మధ్య ఉన్న విబేధాలను పరిష్కరించుకునే వారికి నేను సిద్ధూని కలను’’ అని ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు