విలువలకు నిదర్శనం రావి జీవితం 

5 Nov, 2023 02:59 IST|Sakshi

భూస్వామి కుటుంబంలో పుట్టినా 500 ఎకరాలను దానమిచ్చారు 

ఎంపీగా పొందిన పింఛన్‌ డబ్బునూ పేదల కోసం ఖర్చు చేశారు 

చరమాంకంలోనూ తెలంగాణ అమరులకు సాయం చేయాలని నాటి సీఎం నేదురుమల్లిని కోరారు 

ఇప్పటి ఎన్నికల్లో విలువలకంటే డబ్బుకే ప్రాధాన్యత  

ప్రజలు విజన్‌ ఉన్న నాయకులను ఎన్నుకోవాలి  

‘సాక్షి’తో రావి నారాయణరెడ్డి మనవరాలు రావి ప్రతిభారెడ్డి 

కుటుంబం కోసం కాకుండా జీవితాంతం ప్రజల కోసం పరితపించిన తన తాత రావి నారాయణరెడ్డి జీవితం తనకు ఆదర్శమని ఆయన మనవరాలు రావి ప్రతిభారెడ్డి తెలిపారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టినా హరిజనులు, సామాన్యుల అభ్యున్నతి కోసం తపిస్తూ సాధారణ జీవితాన్ని గడిపారని.. ఎంపీగా పొందిన పింఛన్‌ను సైతం ప్రజల అవసరాల కోసం ఖర్చు చేసేవారని ఆమె గుర్తుచేసుకున్నారు.

విలువలు, దార్శనికత కలిగిన రావి నారాయణరెడ్డి లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి ప్రభావం తనపై ఎంతో ఉందని ప్రతిభారెడ్డి చెప్పారు. తాత చూపిన మార్గంలో పయనించాలని ఉద్యోగాన్ని వదిలేశానని, ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాటం.. అందులో పాల్గొన్న వీరుల చరిత్ర తెలిసి ఉండాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... 

నెహ్రూకన్నా ఎక్కువ ఓట్లు.. అయినా నిగర్వి.. 
రావి నారాయణరెడ్డి ఓ నిబద్ధత కలిగిన ప్రజానాయకుడు. నీతి, నిజాయతీ కోసం ప్రాణం ఇచ్చేవారు. విలువలకు ఆయన ప్రాధాన్యతను ఇచ్చే వారు. ఆయన 1952 ఎన్నికల్లో నల్లగొండ ఎంపీగా, ఆ తర్వాత భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచారంటేనే ఆయన నీతి నిజాయతీకి నిలువెత్తు నిదర్శనంగా చెప్పవచ్చు. ఎంపీగా నెహ్రూ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయన్న గర్వం ఆయనలో ఎప్పుడూ కనిపించేది కాదు. 

హరిజనులను ప్రేమించే వారు..  
భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ తాత సాధారణ జీవితం గడిపే వారు. తనకున్న 500 ఎకరాల భూమిని హరిజనులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఇంట్లో కార్లు కూడా ఉండేవి కాదు. ఆయనకు రెండు, మూడు జతల దస్తులే ఉండేవి. నానమ్మ బంగారు నగలను గాంధీజీ హరిజన సేవా సంఘానికి ఇచ్చారు. హిమాయత్‌నగర్‌లో మా ఇంటికి ఎప్పడూ భువనగిరి నుంచి వచ్చే వారికి నానమ్మ అన్నం పెట్టేది. తినకుండా ఎవరినీ వెళ్లనిచ్చే వారుకాదు. తాత చివరి దశలో ఆస్పత్రిలో అనారోగ్యంతో ఉండగా అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి చూడటానికి వచ్చి నీకు ఏమైనా కావాలా అని అడిగితే కుటుంబం కోసం కాకుండా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సహాయం చేయాలని అడిగారు. 

తాతయ్యతో ఎంతో అనుబంధం .. 
చిన్నతనం నుంచి హిమాయత్‌నగర్‌లోని మా ఇంట్లో తాతయ్య రావి నారాయణరెడ్డి దగ్గరే పెరిగాను. నాపై ఆయన ప్రభావం ఎంతో ఉంది. నేను 8, 9 తరగతులు చదువుతున్న వయసులో హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలు, సమావేశాలతోపాటు రెడ్డి హాస్టల్‌కు నన్ను ఎప్పుడూ తీసుకెళ్లేవారు. నిజాయితీగా ఉండాలని, అందరినీ సమానంగా చూడాలని నాకు చెప్పేవారు. ఆడపిల్లలకు చదువు అవసరమనేవారు. నన్ను కూడా బాగా చదువుకోమనే వారు.

ఇంట్లో నానమ్మ రావి సీతాదేవి, మేనేత్త రావి భారతి, అమ్మానాన్నలు రావి ఉర్మిల, సంతో‹Ùరెడ్డిలు ఉండేవారు. అప్పుడున్న పరిస్థితులను చర్చించే వారు. స్త్రీలకు సమాన హక్కులు, విద్య, రైతాంగ సమస్యలు, సామాజిక విప్లవం, రాజకీయ చైతన్యం గురించి చెప్పేవారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, విద్యా, వైద్యసౌకర్యాలపై చర్చించే వారు. ఆయా అంశాలు నాపై ఎంతో ప్రభావం చూపాయి. తాతయ్య ఆశయాల సాధన కోసం 17 సంవత్సరాలు చేసిన ఉద్యోగం వదిలి ఆయన చూపిన మార్గంలో నడవాలని  నిర్ణయించుకున్నా. 

అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలనుంది..
తాత కోరుకున్న సమ సమాజం కోసం పనిచేస్తా. తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన 4 వేల కుటుంబాలకు ఏదైనా మంచి చేయాలన్న తాత ఆలోచనలను ముందుకు తీసుకెళ్తా. బొల్లేపల్లిలోని పాఠశాలతో నాకు అనుబంధం ఉంది. దానికోసం నాకు ఏమైనా చేయాలని ఉంది. గత సంవత్సరం నుంచి టెన్త్‌ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. జూన్‌ 4న తాత జయంతి సందర్భంగా టెన్త్‌లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థులకు రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో నగదు బహుమతులు అందజేశాం. బొల్లేపల్లిలో శిథిలావస్థలో ఉన్న తాత పుట్టిన ఇంటిని బాగు చేసి సంక్షేమ సెంటర్‌గా తీర్చిదిద్దుతా. అక్కడ స్త్రీల సాధికారత కోసం కంప్యూటర్‌ విద్య, కుట్టు పనులు నేర్పిద్దామనుకుంటున్నా. 

నేటి రాజకీయం డబ్బుమయం.. 
ప్రస్తుతం రాజకీయాలు డబ్బులమయమయ్యాయి. తాత లాగా ముక్కుసూటిగా మాట్లాడే వారు ఇప్పుడు రాజకీయాల్లో నెగ్గలేరు. ప్రస్తుతం నాయకులు పార్టీలు మారడం ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది. ప్రజలు సంక్షేమ పథకాలకు, డబ్బులకు అలవాటుపడ్డారు. ఓట్ల కోసం నాయకులు ఇస్తున్న డబ్బుతో చిన్నచిన్న అవసరాలు తీర్చుకుంటున్నారు. కానీ ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ నాయకునికి ఐదేళ్ల కాలానికి చేసే అభివృద్ధి విజన్‌ ఉండాలి. ఎన్నికల్లో పోటీ చేసే వారికి తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలిసి ఉండాలి. అలాంటి వారినే ప్రజలు ఎన్నుకోవాలి. 

- యంబ నర్సింహులు

మరిన్ని వార్తలు