Revanth Reddy Interview: నేడు ఇక్కడ..రేపు ఢిల్లీలో..

9 Nov, 2023 02:32 IST|Sakshi

గెలుపు ఖాయం అంటున్నటీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

బీఆర్‌ఎస్‌ నేతలు గల్లీలో గులాబీలు.. ఢిల్లీలో గులాములు 

కేటీఆర్‌వి ఉద్దెర మాటలు... కర్ణాటక పోలీసులు వచ్చి గుంజుకుపోతే తెలుస్తుంది 

టీడీపీ వాళ్లు నాకే ఓటేస్తానంటే ఆహ్వానించదగిందే కదా..? అందులో తప్పేముంది?  

75–80 స్థానాల్లో గెలుస్తున్నాం... బీఆర్‌ఎస్‌కు 25 కంటే ఎక్కువ రావు

నిన్న కర్ణాటకలో గెలిచాం..ఇప్పుడు తెలంగాణలో గెలుస్తాం... రేపు ఢిల్లీలోనూ గెలిచి తీరుతాం అని అంటున్నారు టీపీసీసీ చీఫ్‌ అనుముల రేవంత్‌రెడ్డి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 75–80 స్థానాలను గెలుచుకుని అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారాయన. బీఆర్‌ఎస్‌కు 25, బీజేపీ, ఎంఐఎంలకు కలిపి 10 స్థానాలే వస్తాయని జోస్యం చెప్పారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఐదు రోజుల రాష్ట్ర వ్యాప్త పర్యటనకు బయలుదేరిన సందర్భంగా రేవంత్‌రెడ్డి ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పలు కీలకాంశాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. 

కామారెడ్డిలో సీఎంపై పోటీ ఎందుకు చేస్తున్నారు? 
రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలున్నా కేసీఆర్‌ కామారెడ్డికి వెళ్లడం వెనుక రాజకీయ కోణం ఉంది. అసదుద్దీన్‌ ఒవైసీ, కేసీఆర్‌ కలిసి మా పార్టీలోని సీనియర్‌ మైనార్టీ నేత షబ్బీర్‌అలీని ఓడించేందుకు కుట్ర చేశారు. ఆయన స్థానంలో నేను అక్కడ పోటీ చేస్తే పదేళ్ల కేసీఆర్‌ వైఫల్యాలు, తప్పులను ప్రజలకు చేరవేయడం సులభమవుతుంది. కేసీఆర్‌ పాలనా వైఫల్యాలపై జాతీయస్థాయిలో చర్చ జరగడంతో పాటు కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో గట్టిగా పోరాడుతుందనే సంకేతాన్ని పంపాలనేది మా అధిష్టానం ఉద్దేశం. 

అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మళ్లీ ఎందుకు మార్పులు చేస్తున్నారు? 
అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఢిల్లీ నుంచి ఫీల్డ్‌ సర్వే నిర్వహించారు. కిందిస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, సామాజిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రస్థాయిలో పార్టీ అవసరాలను కూడా అంచనా వేసి అధిష్టానం ఒకట్రెండు మార్పులు చేసింది. 

మీ పార్టీలో ఉన్న నేతలు బలంగా లేరనే వేరే పార్టీల నుంచి వచ్చిన వారిని తీసుకుని టికెట్లు ఇస్తున్నారా? లేదంటే కాంగ్రెస్‌ బలహీనంగా ఉందా?  
పార్టీ వేరు, నాయకులు వేరు కాదు. కాంగ్రెస్‌ పార్టీలోని బలమైన 160 మంది నేతలను కేసీఆర్‌ తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు వచ్చిన వారిలో చాలా మంది పాత కాంగ్రెస్‌ వాళ్లే. వివేక్‌ వెంకటస్వామి, రాజగోపాల్‌రెడ్డి లాంటి వారు బయటకు వెళ్లి కేసీఆర్‌ను ఓడించాలనుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని మళ్లీ పార్టీలోకి వచ్చారు.  కొన్ని సందర్భాల్లో వారు మమ్మల్ని సంప్రదిస్తే మరికొన్ని సార్లు మేమే వాళ్లను సంప్రదించి టికెట్లు ఆఫర్‌ చేశాం. 

టికెట్ల కేటాయింపులో రేవంత్‌ వర్గానికే ప్రాధాన్యం ఉందా? 
119 మంది కూడా నా వర్గమే. సోనియా, ఖర్గే వర్గమే. రేవంత్‌ ఒక్కడే టికెట్లు నిర్ణయించడు. సీఈసీ నిర్ణయిస్తుంది. ఆ సీఈసీలో 16 మంది ఉద్ధండులుంటారు. టీపీసీసీ స్క్రీనింగ్‌ కమిటీలో కూడా భట్టి, ఉత్తమ్, మధుయాష్కీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అది పార్టీ సమష్టి నిర్ణయం. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి సహజంగానే జరుగుతున్న పరిణామాలన్నీ నాకు ఆపాదిస్తారు. 

కాళేశ్వరం వైఫల్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యారా? 
రాహుల్‌గాంధీ, నేను, భట్టి విక్రమార్క వెళ్లి ప్రాజెక్టును చూసి ప్రపంచానికి నిజం చెప్పాం. అన్ని స్థాయిల్లో చర్చలు పెట్టాం. ఎన్నికల నేపథ్యంలో మీడియా అంతా ఎన్నికల వివాదాలపైనే ఎక్కువ ఫోకస్‌ చేస్తోంది. అందుకే చర్చ జరగడం లేదు. 

సింహం సింగిల్‌గానే వస్తుందని, కోహ్లీలాగా మళ్లీ సెంచరీ కొడతామని మంత్రి కేటీఆర్‌ అంటున్నారు కదా? 
కృష్ణానగర్‌ పోతే ఇలాంటి మాటలు చెప్పేటోళ్లు చాలా మంది ఉంటారు. అవన్నీ ఉద్దెర మాటలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ఏదో లేఖ రాశారని  అబద్ధం చెప్పి కేటీఆర్‌ ఇరుక్కున్నాడు. తర్వాత ఫేక్‌ అని ఒప్పుకున్నాడు. సైలెంట్‌ అయిపోయాడు. ఒక్కరోజు వార్తతో లబ్ధి పొందాలని చూశాడు. సైబర్‌ క్రైమ్‌లో కేసు అయ్యింది. కర్ణాటక çపోలీసులు వచ్చి గుంజుకుని పోయి జైల్లో వేస్తే కానీ కేటీఆర్‌కు అర్థం కాదు. 

ఢిల్లీ దొరల మధ్య తెలంగాణ ప్రజల మధ్య పోటీ జరుగుతోందని బీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు కదా? 
సిగ్గులేకుండా బరితెగించి మాట్లాడడంలో పోటీ పెడితే కేసీఆర్‌ కుటుంబమే ఫస్ట్‌ వస్తుంది. ఢిల్లీకి పోయి నా కొడుకుని సీఎం చేస్తానని మోదీని అడిగింది మేమా? కేసీఆరా? అడుక్కున్నది కేసీఆర్‌. ఢిల్లీకి బానిసలై ఇక్కడ గులాబీలమని చెప్పే వారికి ఇతర పార్టీల మీద ఆరోపణలు చేసే హక్కు లేదు. 

కాంగ్రెస్‌ కారణంగానే తెలంగాణ నాశనమైందన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై మీరేమంటారు? 
కేసీఆర్‌ విశ్వాసం కోల్పోయిన నాయకుడు. అంతర్జాతీయ విమానాశ్రయం, హైటెక్‌సిటీ, ఓఆర్‌ఆర్, మెట్రో, ఫ్లైఓవర్‌లు నిర్మించి రూ. 60వేల కోట్ల ఆదాయం ఇక్కడి నుంచి వచ్చేలా చేసింది కాంగ్రెస్‌ కాదా..? అభివృద్ధి చేస్తే నాశనం చేసినట్టా..? నాగార్జునసాగర్, శ్రీశైలం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జూరాల, ఎస్సారెస్పీ, దేవాదుల, శ్రీరాంసాగర్, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ లాంటి ప్రాజెక్టులు కట్టినందుకు తెలంగాణ నాశనమైందా?  

టికెట్లు అమ్ముకున్నారని మీ పార్టీలో టికెట్లు రాని వారంటున్నారు... ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ నేతలు మీ పేరు మార్చి పిలుస్తున్నారు కదా? 
టికెట్లు అమ్ముకున్నారనడంలో వాస్తవం లేదు. టికెట్ల నిర్ణయంలో రేవంత్‌రెడ్డి ఒక్కడికే ఆ అధికారం లేదు. అసలు కాంగ్రెస్‌ పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరువయ్యారని బిల్లా అంటుంటే... కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారని రంగా అంటున్నాడు. బిల్లా రంగాల మధ్యనే ఈ విషయంలో వైరుధ్యం ఉంది. కాంగ్రెస్‌ టికెట్లు కోట్ల రూపాయల ధరలు పలుకుతున్నాయని అంటే ఓట్ల విషయంలో బాహుబలి కలెక్షన్లు వచ్చినట్టే కదా? వాళ్లు నోట్ల రూపంలో చూస్తే నేను ఓట్ల రూపంలో చూస్తున్నా. 

వచ్చే ఎన్నికల్లో మీరు ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తారు? 
కాంగ్రెస్‌ పార్టీకి 75–80 స్థానాలు వస్తాయి. బీఆర్‌ఎస్‌కు 25 కంటే ఎక్కువ రావు. బీజేపీకి 4 మించవు. ఎంఐఎంకు 5–6 మాత్రమే వస్తాయి. 

తెలంగాణపై మీ పార్టీ అధిష్టానం ఎందుకు అధిక ఫోకస్‌ పెట్టింది? 
నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీ... తెలంగాణలో గెలుపు ద్వారా ఢిల్లీ ఎర్రకోటపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసేందుకు మార్గం ఏర్పడుతుంది. అందుకే అధిష్టానం ఫోకస్‌ పెంచింది. 

కాంగ్రెస్‌ పార్టీకి మేలు చేసేందుకే తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదా..? 
టీడీపీ నుంచి పోయినోళ్లు 90 శాతం మంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మంత్రులే. తలసాని, నిరంజన్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తో సహా కేసీఆర్‌ కూడా తెలుగుదేశం వాళ్లే కదా? మరి, టీడీపీ పోటీ పెట్టకపోతే వారికి లాభం వస్తుందని అనుకోవచ్చు కదా? తెలుగుదేశం సానుభూతిపరులందరూ నాకే ఓటు వేస్తే మంచిదే కదా? వారు వస్తే ఆహ్వానించదగ్గ విషయమే కదా? తప్పేముంది అందులో? 

-మేకల కళ్యాణ్‌ చక్రవర్తి

మరిన్ని వార్తలు