మీ పాలనలో అంతరం మరింత పెరిగింది

3 Feb, 2022 05:29 IST|Sakshi

సమాఖ్య స్ఫూర్తిని మరిచారు

పార్లమెంట్‌లో కేంద్రంపై రాహుల్‌ విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ పాలనతో ఏకీకృత భారతం కాస్తా, సంపన్న భారతం, పేదరిక భారతంగా మారిపోయిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ రెండు అసమానత భారతాల మధ్య అంతరం తగ్గించే ప్రయత్నం చేయాలని కేంద్రానికి సూచించారు. మొత్తం దేశ సంపద కొద్ది మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇకనైనా దేశ సంపదను ఆ కొద్దిమందికి పంచడం మానుకోవాలని ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇండియా రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగం చెబుతోందని, అలాంటి దేశాన్ని కేంద్రమే పరిపాలించాలనుకోవడం దురదృష్టకరమని, ఈ ధోరణి దేశానికి పెను ముప్పు అని హెచ్చరించారు. 1947లో బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపోవడంతోనే పోవడంతోనే అంతమైన రాచరిక వ్యవస్థ, బీజేపీ హయాంలో మళ్లీ పురుడుపోసుకుందని నిప్పులు చెరిగారు. దేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులను అణచివేయొద్దని, ఇది ప్రజాస్వామ్యమే కానీ, రాచరికం కాదని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్‌ పార్లమెంటులో తొలి ప్రసంగం చేశారు. ‘‘మా ముత్తాత 15ఏళ్లు జైలు పాలయ్యారు.

మా నాన్నమ్మ 32 తూటాలకు బలయ్యింది. మా నాన్న ముక్కలు ముక్కలైపోయారు. అవన్నీ అనుభవించినవాడిగా చెబుతు న్నా... చాలా ప్రమాదకరమైన దానితో ఆడుకుంటున్నారు. అది ఆపేస్తే మంచిది. లేకపోతే కచ్చితంగా సమస్యను సృష్టించినవారవుతారు’’ అని హెచ్చరించారు. ప్రభుత్వం నిత్యం మేడిన్‌ ఇండియా అని మాట్లాడుతోందని, కానీ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించకుండా అది సాధ్యం కాదని తెలిపారు. ఉద్యోగాలు కల్పించే శక్తి వాటికే ఉందన్నారు. బిహార్‌లో ఉద్యోగార్థుల ఆందోళన ప్రస్తుతం దేశంలో ఉన్న నిరుద్యోగానికి అద్దం పడుతోందన్నారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగసస్‌ వంటివాటిని ఉపయోగించుకుని రాష్ట్రాల గొంతు నొక్కేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నారు
రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై దాడి చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.  బీజేపీ అనుబంధ సంస్థలు ఉద్యమాలు చేస్తున్న రైతులను ఉగ్రవాదులుగా ముద్రవేశాయని  ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... ఏడాది కోట్ల ఉద్యోగాలిస్తామన్న ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందన్నారు. పెట్రోలియం ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. సర్కారు చెబుతున్న మార్పు, సమానత్వం మాటల్లోనే తప్ప క్షేత్రస్థాయిలో లేదన్నారు.

డీఎంకే ఎంపీ తిరుచీ శివ మాట్లాడుతూ.. అఖిల భారత సర్వీసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకపోవడాన్ని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ... కేంద్రం సమాఖ్య స్ఫూర్తిపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తోందని  ణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సుఖేందు శేఖర్‌ రాయ్‌ మండిపడ్డారు. అఖిల భారత సర్వీసు క్యాడర్‌ నిబంధనల్లో మార్పు ప్రతిపాదనలను, వందమంది మాజీ ఐఏఎస్‌లు, ఐఎఫ్‌స్‌లు, తొమ్మిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్నా కేంద్రం నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందన్నారు.

అభివృద్ధిని చూసే గెలిపిస్తున్నారు  
ఐదేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి వల్లే జనం 2019లో స్పష్టమైన మెజారిటీతో గెలిపించారని ఉత్తరప్రదేశ్‌ బీజేపీ రాజ్యసభ సభ్యురాలు గీత అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంపై ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మాన చర్చలో ఆమె రాజ్యసభలో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం తన సంక్షేమ పథకాలతో అట్టడుగు వర్గాలు, వెనుకబడిన తరగతుల ప్రజల ఆర్ధిక సమానత్వానికి కృషి చేస్తోందని తెలిపారు.

కేంద్ర మంత్రివర్గంలో ఓబీసీ వర్గానికి చెందిన 27 మంది, ఎస్సీఎస్టీకి చెందిన వారు 20 మంది, మహిళలు 11 మంది ఉన్నారన్నారు. పెళ్లి వయసును 18 నుంచి 23కు పెంచుతూ ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తోందని తెలిపారు. బీజేపీ సభ్యుడు శ్వేత్‌మాలిక్‌ మాట్లాడుతూ...కాంగ్రెస్‌ నేతృత్వంలోని గత ప్రభుత్వాలు తమ అవినీతితో సామాన్యుని నడ్డి విరిచాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడం అతి పెద్ద తప్పిదమన్నారు. మోదీ ప్రభుత్వం ఉగ్రవాద దాడులను సర్జికల్‌ స్ట్రైక్‌తో తిప్పికొట్టిందన్నారు.

మరిన్ని వార్తలు