Rahul Gandhi: మోదీకి భయపడటం లేదు.. ఏం చేస్తారో చేయని: రాహుల్‌ గాంధీ

4 Aug, 2022 14:49 IST|Sakshi

న్యూఢిల్లీ:  నేషనల్‌ హెరాల్డ్‌ భవనంలో యంగ్‌ ఇండియా ఆఫీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సీల్‌ వేసిన మరుసటి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రధాని మోదీ అంటే భయపడేది లేదన్నారు. దేశాన్ని కాపాడేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు ‘నీవు ఏం చేయాలనుకుంటున్నావో చేయ్‌. దేశాన్ని, ప్రజాస్వామ్యన్ని, సామరస్యతను కాపాడేందుకు కృషి చేస్తూనే ఉంటాను. వారు ఏం చేసిన మా పని కొనసాగిస్తాం. నిజాన్ని ఎవరూ బారికేడ్లు పెట్టి ఆపలేరు.’ అని పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం వద్ద బుధవారం బారికేడ్లు ఏర్పాటు చేయటంపై ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

‘మేము బెదిరిపోము. నరేంద్ర మోదీ అంటే భయపడటం లేదు. మీకు అర్థమవుతోందా? ఆయన ఏం చేయాలనుకుంటున్నారో చేయని. దానివల్ల ఎటువంటి తేడా ఉండదు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, సమరస్యాన్ని కాపాడటం నా బాధ్యత. అందుకోసం కృషి చేస్తూనే ఉంటాను.’ అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు రాహుల్‌. బారికేడ్లపై ప్రశ్నించగా.. వారు మరిన్ని బారికేడ్లు పెట్టవచ్చని, కానీ, నిజాన్ని ఆపలేరని పేర్కొన్నారు. నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ విచారణ నేపథ్యంలో ఈ మేరకు కేంద్రంపై విమర్శలు గుప్పించారు రాహుల్‌. ఇప్పటికే రాహుల్‌తో పాటు సోనియా గాంధీలను విచారించింది ఈడీ. బుధవారం యంగ్‌ ఇండియా ఆఫీస్‌ను సీల్‌ చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయం, గాంధీల నివాసం ముందు బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు.. ఈడీ నుంచి తనకు సమన్లు అందాయని రాజ్యసభలో పేర్కొన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.

ఇదీ చదవండి: ప్రొఫైల్‌ పిక్చర్లు మార్చుకోవాలంటూ మోదీ పిలుపు.. త్రివర్ణ పతాకంతో నెహ్రూ ఫొటో!

మరిన్ని వార్తలు