కేసీఆర్‌ లూటీ చేసిందంతా తిరిగి ఇస్తాం: రాహుల్‌ గాంధీ

20 Oct, 2023 17:17 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: సామాజిక తెలంగాణ కోరుకొని సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. సోనియా మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదని అన్నారు. కానీ తెలంగాణ ఒకే కుటుంబం చేతిలో బందీ అయ్యిందని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్ కార్నర్ మీటింగ్‌లో రాహుల్‌ మాట్లాడారు.  ప్రధాని మాటలకు విలువ లేదని అన్నారు. 

ఆర్మూర్ ప్రాంతంలో పసుపు విషయంలో ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు అబద్ధపు హామీ ఇచ్చారని మండిపడ్డారు. నాలుగున్నరెళ్ళ కిందట పసుపు బోర్డు ఇస్తామని చెప్పి కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. పసుపు పంటకు రూ. 12 నుంచి 15 వేలు మద్దతు ధర ఇస్తామని తెలిపారు. పసుపు రైతులతో పాటు అన్ని పంటలకు ఎమ్‌ఎస్‌పీతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని రాహుల్‌ పేర్కొన్నారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటే
తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఒకటేనని విమర్శించారు. తెలంగాణ బీఆర్‌ఎస్‌ బీజేపీ.. కేంద్రంలో బీజేపీకి బీఆర్‌ఎస్‌ మద్దతు పలుకుతుందని దుయ్యబటారు. తన మీద 24 కేసులు ఉన్నాయన్న రాహుల్‌.. కేసీఆర్‌ మీద ఎన్ని కేసులు ఉన్నాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌ మీద సీబీఐ, ఈడీ, ఐటీ కేసులు, చర్యలు ఉండవని అన్నారు. దేశంలోనే అవినీతి సీఎం కేసీఆరేనని మండిపడ్డారు.

కాంగ్రెస్ గెలుపు పక్కా
కాంగ్రెస్‌ను ఓడించేందుకుచ బీజేపీని గెలిపించేందుకు ఎంఐఎం రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను నిలబెడతారని రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. బీజేపీ ఎక్కడెక్కడ పోటీ చేయాలని చెబితే అక్కడ ఎంఐఎం ఉంటుందని మండిపడ్డారు. తెలంగాణ సహా ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
చదవండి: సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌.. ఒక్కొక్కరికి ఎంతంటే!

ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌
నాకు ఇల్లు లేదు. దేశమే నా ఇల్లు. మా కుటుంబానికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ ప్రజలు అండగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తాం. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తాం. పెన్షన్‌​ రూ. 4 వేలు ఇస్తాం. రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తాం. కేసీఆర్‌ ఎంత లూటీ చేస్తున్నారో అంతా తిరిగి ఇస్తాం’ అంటూ రాహుల్‌  కేసీఆర్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.

రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు..
సభ అనంతరం ఆర్మూర్‌ నుంచి రోడ్డు మార్గంలోనే రాహుల్‌ హైదరాబాద్‌ బయల్దేరారు. హైలికాప్టర్‌ రద్దు కావడంతో రోడ్డు మార్గంలో నేరుగా శంషాబాద్‌ వెళ్తున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. దీంతో తెలంగాణలో రాహుల్ గాంధీ విజయభేరీ తొలి విడత బస్ యాత్ర ముగిసింది.  ఈనెల 18న రామప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి రాహుల్, ప్రియాంక యాత్ర ప్రారంభించారు. ములుగు నియోజక వర్గం నుంచి ఆర్మూర్ వరకుమూడు రోజుల యాత్ర సాగింది. ములుగు, భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, చొప్పదండి, ఆర్మూర్ నియోజక వర్గాలలో కొనసాగింది. 

కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్‌
ఆర్మూర్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో  ఖానాపూర్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్  కాంగ్రెస్‌లో చేరారు. సిట్టింగ్‌ను కాదని ఖానాపూర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే టికెట్‌ను జాన్సన్‌ నాయక్‌ కేటాయించడంతో అసంతృప్తి చెందిన ఎమ్మెల్యే రేఖా నాయక్‌ ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు