ఖర్గేతో రాజగోపాల్‌రెడ్డి భేటీ

28 Oct, 2023 02:00 IST|Sakshi

పార్టీ అభ్యున్నతి కోసంపని చేయాలంటూ నిర్దేశించిన ఖర్గే 

కాంగ్రెస్‌లో చేరిన మోత్కుపల్లి, నేతి విద్యాసాగర్, ఆకుల లలిత, నీలం మధు

సాక్షి, న్యూఢిల్లీ/యాదాద్రి/పటాన్‌చెరు టౌన్‌: గురువారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరికొందరు ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్, ఎమ్మెల్సీ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీలు టి.సంతోష్ కుమార్, కపిలవాయి దిలీప్, ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపకుడు నీలం మధు ముదిరాజ్, నకిరేకల్‌ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి, ఆమె భర్త గంగాధర్‌రావుకు ఖర్గే పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ మురళీధరన్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనుగోడు స్థానాన్ని రాజగోపాల్‌రెడ్డికి ఖర్గే ఖరారు చేశారు. పార్టీ అభ్యున్నతికి, గెలుపు లక్ష్యంగా చేయాలంటూ ఖర్గే సూచించారు. 

కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా... 
కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తానని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ అవినీతి, అక్రమాలపై బీజేపీ ఆయన్ని జైలుకు పంపుతుందనే ఆలోచనతోనే తాను బీజేపీలో చేరినా ఆ పరిస్థితులు కనిపించలేదన్నారు. అందుకే మళ్లీ సొంతగూటికి వచ్చినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒకవేళ హంగ్‌ ఏర్పడితే బీఆర్‌ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. అవినీతితో సంపాదించిన కోట్ల రూపాయలను ఇండియా కూటమికి ఫండ్‌ ఇస్తానని.. తనను ప్రధానిని చేయాలంటూ కేసీఆర్‌ కూటమిని కోరిన విషయం నిజం కాదా అంటూ ప్రశ్నించారు. ప్రజల మద్దతుతో తాను మునుగోడులో గెలుస్తానని, ఇంకా కొంచెం ముందుగా తాను కాంగ్రెస్‌లో చేరి ఉంటే కేసీఆర్‌ మైండ్‌ బ్లాంక్‌ అయ్యేదన్నారు. 

మరిన్ని వార్తలు