దావూద్‌నైనా క్షమించొచ్చు.. కేసీఆర్‌, కేటీఆర్‌లను క్షమించలేం: రేవంత్‌ రెడ్డి

22 May, 2023 16:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. 111 జీవో ఎత్తివేత వెనక లక్షల కోట్ల కుంభకోణం ఉందని ఆరోపించారు. 111జీవో రద్దు  ముమ్మాటికీ విధ్వంసమేనని, దీని వెనక సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ హస్తం ఉందన్నారు. జీవో ఎత్తివేతపై విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ తరపున నిజనిర్ధారణ కమిటీ వేసి ఎక్కడెక్కడ ఎవరెవరూ భూములు కొన్నారో తేల్చుతామని పేర్కొన్నారు. 

కేసీఆర్‌ నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ ఆగం
యువరాజు స్నేహితులకు వేలకోట్లు దోచిపెట్టడానికి ఏ111 జీవో రద్దు చేశారని రేవంత్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేటీఆర్‌, కవిత, సంతోష్‌, రంజిత్‌రెడ్డిలకు పెద్ద మొత్తంలో భూములు ఉన్నాయని.. పేదల చేతిలో 20 శాతం భూములు కూడా లేవని తెలతిపారు. దావూద్‌నైనా క్షమించొచ్చు కానీ, కేసీఆర్‌, కేటీఆర్‌లను క్షమించలేమని మండిపడ్డారు. కేసీఆర్‌ అన్నింటిని అమ్ముతున్నాడని, పరిపాలనపై పట్టులేని వ్యక్తి నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ ఆగం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

111 జీవో రద్దు అణువిస్పోటనం
‘కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక  జంట నగరాలను విధ్వంసం చేస్తున్నారు. కేటీఆర్ రియల్ ఎస్టేట్ మాఫియాను తయారుచేసుకున్నాడు. హిరోషిమా నాగసాకి లాగా హైదరాబాద్‌ను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ చెరువులన్నీ మాయం అయ్యాయి. 111జీవో ప్రాంతంది తాగునీటి సమస్య కానేకాదు. 111 జీవో రద్దు అణువిస్పోటనం లాంటిది. దీని వెనక ధనదాహం, అవినీతి, దోపిడీ ఉన్నాయి. 111 జీవో పరిధిలో బీఆర్‌ఎస్‌ వాళ్ళు వందలాది ఎకరాల కొన్నారు.  80 శాతం భూములు కేసీఆర్ బినామీల చేతుల్లో ఉన్నాయి. పైపుల కంపెనీ కోసం 111 జీవో రద్దు చేస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీకి స్థలం కేటాయించాలి
కేసీఆర్ దోపిడీలో వాట లేకపోతే  సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చెప్పాలి. బండి సంజయ్ రంకెలెయ్యడం కాదు. 111 జీవో రద్దుపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. కేసీఆర్‌ను ఉప్పు కారం పెట్టి కొట్టినా తప్పులేదు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఇప్పటివరకు భూ కేటాయింపులు జరగలేదు. 5100 గజాల స్థలం కోసం పైసలు కట్టాం. అయినా భూ కేటాయింపు జరగలేదు.  అందుకే ఇప్పటికీ కిరాయికి ఉంటున్నాం. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయించాం. కేసీఆర్ తన పార్టీ ఆఫీసుకి 11 ఎకరాలు కేటాయించుకోడం దుర్మార్గం. మా కార్యాలయానికి స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం.
చదవండి: మాసబ్‌ చెరువును చెరబడుతున్న రియల్‌ మాఫియా.. మట్టికొట్టినా లెక్కలే!

తెలంగాణ కాంగ్రెస్ కు 88 సీట్లు..
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 88 సీట్లు వస్తాయని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందన్నారు. చార్లెస్ శోభరాజ్, దావూద్ ఇబ్రహీం, బిల్లా, రంగా నలుగురుకి  కేసీఆర్ సమానమాని,  కేసీఆర్‌కు 100 రోజుల కౌంట్‌డౌన్‌ స్టార్‌ అయ్యిందన్నారు. కేసీఆర్ తో చేతులు కలిపాక జేడీఎస్ సీట్లు తగ్గాయన్నారు. ఈసారి జరగనున్న ఎన్నికలు పేద, ధనిక ప్రజల మధ్య జరుగుతాయి’ అని తెలిపారు. 

11 జీవో రద్దు ఓ పెద్ద కుట్ర: భట్టి
బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలకే ఐదు వేల ఎకరాలున్నాయి. ముందు ముందు ఆ వివరాలు బయట పెడతానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇప్పటికే బీఆర్‌ఎస్‌ నేతలు ఊర్లమీద పడి భూములు కొటున్నారని మండిపడ్డారు.111 జీవో ప్రాంతంలో ఎవరెవరికి భూములు ఉన్నాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు.  బినామీలు, రియల్‌ ఎస్టేట్‌ వాళ్ల కోసమే 111 జీవో ఎత్తి వేశారని విమర్శించారు. 111 జీవో రద్దు ఓ పెద్ద కుట్ర అని, దీనితో రైతులకు ఒరిగిందేమి లేదన్నారు.
చదవండి: ఖమ్మం పిట్టలదొర పొంగులేటి: పువ్వాడ తీవ్ర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు