వాళ్లవి రహస్య ఒప్పందాలు

4 Aug, 2021 01:29 IST|Sakshi

ప్రధాని మోదీతో టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ భేటీ ఎజెండా బహిర్గతపరచాలి 

కోవర్ట్‌ కేటగిరీలో కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ 

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మధుయాష్కీ 

సాక్షి, న్యూఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్‌ స్కీం, పోతిరెడ్డిపాడు విస్తరణపై కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశాలకు గైర్హాజరై, టెండర్లు పిలిచి ఒప్పందాలు చేసినప్పుడు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన సీఎం కేసీఆర్, తాజాగా నాగార్జునసాగర్‌ పర్యటనలో కేంద్రం తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తోందని పేర్కొనడం విస్మయం కలిగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్‌తో కలసి ఆయన మీడియా భేటీలో మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ పేరుతో కేసీఆర్‌ రూ.వేల కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని రేవంత్‌ ఆరోపించారు. ఏడేళ్లలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయల్‌సాగర్, సీతారామసాగర్, ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి ఉంటే, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి ఫిర్యాదు చేసే అవకాశమే వచ్చేది కాదని రేవంత్‌ అన్నారు.  

రహస్య భేటీ ఎజెండా బహిర్గతపరచాలి.. 
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజు టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌.. ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారని రేవంత్‌ ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ఇతర ఎంపీలు కూడా మోదీని కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కలిస్తే ఫొటోలను ఎందుకు బహిర్గతపరచలేదని ప్రశ్నించారు. అసలు బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఏంటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో కోవర్ట్‌ ఆపరేషన్‌లో నిష్ణాతులైన కౌశిక్‌రెడ్డి లాంటి వారికే ఎమ్మెల్సీ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ఒత్తిడితోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఈనెల 9 నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్రను రద్దు చేసుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ, ప్రగతి భవన్‌లో జరుగుతున్న రాజకీయ ఒప్పందాలు బహిర్గతమయ్యాయని, టీఆర్‌ఎస్‌లో బీజేపీకి సంబంధించిన నిర్ణయాలు జరుగుతున్నాయో లేదో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంజయ్‌ వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఎన్నికల వేళ కొట్లాట... ఢిల్లీలో సఖ్యత.. 
తెలంగాణలో ఉద్యోగాల రాక 3 నెలల్లో 14 మంది యువకులు మరణించారని మధుయాష్కీ గౌడ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఉద్యోగాల నోటిఫికేషన్‌ ప్రస్తావనతో యువకుల్ని కేసీఆర్‌ మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పటికే ప్రజా వ్యతిరేకత మొదలైందని ఆయన అన్నారు. ప్రాణత్యాగాలతో తెచ్చుకొన్న తెలంగాణలో అణిచివేత, ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలోనే మాటల యుద్ధం చేసే టీఆర్‌ఎస్, బీజేపీ.. తర్వాత ఢిల్లీలో ఎంతో సఖ్యతతో ఉంటాయని పేర్కొన్నారు. గతంలో కేటీఆర్, కవిత, హరీశ్‌లకు ఈడీ నోటీసులు వచ్చిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు