నిషేధిత భూములూ కట్టబెట్టారు 

10 Feb, 2023 06:37 IST|Sakshi

కేసీఆర్, కేటీఆర్‌పై రేవంత్‌ ఆరోపణలు 

సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్రాన్ని పాలిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఆయన కుమారుడు డ్రామారావు (కేటీఆర్‌ను ఉద్దేశించి)లు పెద్ద భూ కబ్జాదారులని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను వారి అనుచరులకు ధారాదత్తం చేసి, అందులో వాటాలు తీసుకున్న మాఫియా అని, నిషేధిత భూములూ కట్టబెట్టారని ధ్వజమెత్తారు. పార్టీ హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా గురువారం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గంలోని నర్సింహులపేట, మరిపెడ మండలాల్లో ఆయన పర్యటించారు. మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో, తర్వాత మరిపెడలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌ ప్రసంగించారు.  

ఆ కలెక్టర్లు కటకటాల పాలే.. 
‘పోరాడి సాధించుకున్న తెలంగాణను కేసీఆర్‌ చేతిలో పెడితే, ఆయన ప్రభుత్వ భూములను తమ అనుచరులకు కట్టబెడుతూ భూ మాఫియా పాలన సాగిస్తున్నారు. రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో అనుకూలమైన కలెక్టర్లను పెట్టుకొని వేలాది ఎకరాలను కబ్జా చేశారు. తెల్లాపూర్‌లో ప్రతిభ శ్రీనివాస్‌ పేరుమీద 100 ఎకరాల భూమిని అమెరికా కంపెనీ కొనుక్కుంటే..రూ.4 వేల కోట్ల విలువైన ఆ భూమిని రూ.260 కోట్లకు ప్రభుత్వం బెదిరించి బదలాయించుకుంది. ఈ రోజు అందులో వేలాది కోట్ల వ్యాపారం చేస్తున్నారు.

ఇందులో కేటీఆర్‌కు భాగస్వామ్యముంది..’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2004లో ప్రభుత్వ భూములను గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చింది. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్లు ఆయన చెప్పింది విని అక్రమ భూ దందాకు పాల్పడ్డారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములూ ధారాదత్తం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కలెక్టర్లకు తగిన శాస్తి జరుగుతుంది. 2024లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఈ అవినీతి కలెక్టర్లు కటకటాల పాలు అవుతారు..’ అని అన్నారు.  

సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమేనా.. ? 
‘నేను భూ కుంభకోణంలో ఉన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. దీనిని స్వీకరిస్తా. నాపై ఏ విచారణ చేసినా స్వాగతిస్తా. హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపినా నేను సిద్ధమే.. అదేవిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు రామారావులు, ఇతర నాయకులపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపేందుకు సిద్ధమేనా..?’ అని రేవంత్‌ సవాల్‌ విసిరారు.  

భూములు కాజేస్తున్నారు.. 
‘ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన పేరుతో ప్రవేశపెట్టిన ధరణి వెబ్‌సైట్‌ వచి్చన తర్వాతే భూ సమస్యలు ఎక్కువయ్యాయి. దీని పేరుతో సమస్యలు సృష్టించి ప్రభుత్వ భూములు, నిజాం భూములను కాజేస్తున్నారు. ఈ ధరణిని ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ సంస్థకు అప్పగించారు. ఇది ప్రైవేట్‌ సంస్థ. ప్రజల భూముల వివరాలు ప్రైవేట్‌ వ్యక్తులకు తెలిపి వాటిని కబ్జా చేసేందుకు ఇది వేదిగా ఉపయోగపడుతోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తాం. ప్రజలు, ప్రభుత్వ భూములకు రక్షణ కలిస్తాం..’ అని హామీ ఇచ్చారు.  

అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా.. 
‘ప్రజల కష్టంతో చెల్లించిన పన్నుల ద్వారా రూ.2వేల కోట్లు పెట్టి నిర్మించిన ప్రగతి భవన్‌.. దొరగారు, అయన బానిస రాజులకు అడ్డాగా మారింది. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ భవన్‌కు అంబేడ్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌గా పేరు మార్చి శాస్త్రవేత్తలు, మేధావులను తయారు చేసే కేంద్రంగా మారుస్తాం..’ అని రేవంత్‌ అన్నారు. తనకు భూ కబ్జాలతో సంబంధం లేదని చెబుతున్న మహబూబాబాద్‌ ఎంపీ కవిత కబ్జాల వివరాలు కాంగ్రెస్‌ నాయకులు బెల్లయ్య నాయక్, బలరాం నాయక్‌లు పత్రాలతో సహా చూపించారని చెప్పారు. ‘రాష్ట్రాన్ని దోచుకుంటూ ప్రజలను హీనంగా చూస్తున్న కేసీఆర్‌ కాలభైరవ పాలన పోవాలి.. కాంగ్రెస్‌ పాలన రావాలి..’ అని పిలుపునిచ్చారు.

గోడ దూకి గురుకులంలోకి..  
పాదయాత్రలో భాగంగా మరిపెడ శివారులోని సాంఘిక సంక్షేమ పాఠశాలకు రేవంత్‌రెడ్డి వస్తున్నారు అనే విషయం తెలియడంతో సిబ్బంది గేట్లు వేశారు. దీంతో ప్రహరీ గోడదూకిన రేవంత్‌ గురుకులంలోకి ప్రవేశించి విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు.  
 

మరిన్ని వార్తలు